Sunday, May 19, 2024

రైతులను నిలువునా ముంచుతున్న దౌర్భాగ్యం..

తప్పక చదవండి
  • సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పిలవబడుతున్న ధరణి..
    దరిద్రంగా ఎందుకు మారింది..?
  • ధరణిలోని లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు అధికారులు..
  • కొందరికి కాసుల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరికి కన్నీటిని మిగుల్చుతోంది..
  • అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ చేసిన
    నిర్వాకానికి నరకం చూస్తున్న రైతన్నలు..
  • కోర్టు తీర్పును కాలరాసి ఒకరి భూమిని వేరొకరికి
    రిజిస్ట్రేషన్ చేసే యత్నంలో మహేశ్వరం ఎమ్మార్వో..
  • తమకి న్యాయం జరిగేలా చూడాలంటూ ఆదాబ్ ని ఆశ్రయించిన బాధిత రైతులు..
  • ముఖ్యమంత్రి దృష్టి సారించాలని వేడుకుంటున్న బాధితులు..

‘ విధిచేయు వింతలన్నీ ‘ అని పాడుకోవడం ఒకప్పటి మాట.. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ‘ ధరణి చేయు వింతలన్నీ ‘ అని పాడుకోవాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది.. భూ సమస్యలను సమూలంగా రూపు మాపుతామని ఒక చాలెంజింగా ముఖ్యమంత్రి తన మానసపుత్రికగా తీసుకుని వచ్చిన ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారింది.. సమస్యలు తీరకపోగా సరికొత్త సమస్యలు తెరమీదకు వస్తున్నాయి.. రైతుల జీవితాలు కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతున్నాయి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పట్టాలు ఉన్నా.. రైతుబంధు తీసుకుంటున్నా.. తీరా పరిస్థితులు తారుమారైపోతున్నాయి.. సంవత్సరాల తరబడి తమ భూమి అనుకుంటూ సాగుచేసుకుంటున్న భూములు.. ఇంకొకరి పేరుమీద మారిపోతున్నాయి.. కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ.. విసిగి వేసారిపోతూ చివరికి ప్రాణాలు తీసుకున్న ఎందరో రైతుల కన్నీటి చరిత్రలు మనం రోజూ చూస్తున్నాం.. చివరికి వైషమ్యాలు పెరిగి ఒకరినొకరు చంపుకున్న దారుణ ఘటనలు కూడా చూశాం.. అయినా సరే అధికార బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం సిగ్గూ ఎగ్గూ లేకుండా ధరణి ఎంతో గొప్పది అంటూ కితాబు ఇస్తుండటం అత్యంత బాధాకరం.. ధరణి వచ్చిన తరువాత రైతుల తలరాతలు మారిపోతున్నాయి.. కానీ లోపం ఎక్కడ ఉంది..? సాంకేతిక సమస్యలు అనుకోవడానికి వీలులేదు.. కొందరు అధికారులు.. వీరిలో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.. బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు.. ధరణిలోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని.. ధన వ్యామోహంతో తమకు నచ్చిన వారికి ఇతరుల భూములను అడ్డగోలుగా కట్టబెడుతున్నారు.. రైతులు సర్వనాశనం కావడానికి హితోధికంగా కంకణం కట్టుకుంటున్నారు.. తాజాగా ధరణి దారిద్రంతో అష్టకష్టాలు పడుతున్న రైతన్నల కన్నీటి గాథ వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్, 29 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, కొంగరకుర్దు ఏ గ్రామంలో కొప్పుల మల్లారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి, శ్రీనివాస్ వ్యాస్ తండ్రి సత్యనారాయణ వ్యాస్ అనే రైతులకు సర్వే నెంబర్స్ : 287/2, 287/3 లో ఒక్కో సర్వే నెంబర్ లో 3 ఎకరాలు చొప్పున మొత్తం 6 ఎకరాల భూమి ఉంది.. ఈ భూమిని తేపర్ల మహేందర్ తండ్రి ఎల్లయ్య దగ్గర నుండి 287/2 ఖాతా నెంబర్ : 60316, పాస్ బుక్ నెంబర్ : టి 05160190749, ఖాతా నెంబర్ : 60316, పాస్ బుక్ నెంబర్ : టి 5160190748 గా సదరు భూమిని పైన పేర్కొన్న రైతులు కొనుగోలు చేశారు.. కాగా నాటి నుంచి నేటి వరకు సదరు కొప్పుల మల్లారెడ్డి, శ్రీనివాస్ వ్యాస్ లు ఆ భూమిలో పొజిషన్ లో ఉంటూ ఉన్నారు .. కాగా 1975 సాదా బైనామా ద్వారా సదరు భూమిని సప్పిడి లింగయ్య దగ్గర తేపర్ల మహేందర్ కొనుగోలు చేసి ఉన్నారు . 1975 నుంచి 2021 వరకు తెపర్ల మహేందర్ ఆ భూమిలో పొజీషన్లలో ఉన్నారు.. కాగా 2021 నుండి 2023 వరకు భూమిని కొనుగోలు చేసిన ఇద్దరి రైతుల పేరుమీద రెవెన్యూ రికార్డ్ కూడా ఉంది.. వారి యొక్క ఖాతా నెంబర్లు : 60320, 60321.. పాస్ బుక్ నెంబర్లు : టి 05160190753, టి 05160190754 ద్వారా సదరు రైతులకు రైతు బంధు కూడా వచ్చింది.. దీని తర్వాత 1975లో అమ్మిన వ్యక్తి సప్పిడి లింగయ్య కుమారుడు సప్పిడి లక్ష్మయ్య తండ్రి లింగయ్య అనే వ్యక్తి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సదరు అనుభవంలో ఉన్న ఇరువురు రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఓ.ఆర్.సి. నెంబర్ : సి/1511/22 ఆర్డర్ తో ఇద్దరు రైతుల పేర్లను తొలగించారు.. ఈ అక్రమ తతంగానికి మూల కారణం మహేశ్వరం ఎమ్మార్వో, ఆర్.డీ.ఓ., అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఐఏఎస్ లే కారణం అని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.. డబ్బులకు ఆశపడి ఈ వ్యవహారం నడిపించారని బాధితులు వాపోతున్నారు.. 29 జనవరి 2023 నాడు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఓ.ఆర్.సి. జారీ చేసిన అనంతరం కలెక్టర్ బదిలీ మీద వెళ్లిపోయారు.. తాను ఎలాగూ ట్రాన్స్ ఫర్ అవుతున్నారు కనుక ఒక్కరోజులోనే కలెక్టర్ సప్పిడి లక్ష్మయ్య తండ్రి లింగయ్య పేరుమీద భూమిని బదలాయించి రెండు రోజుల్లోనే రెవెన్యూ రికార్డ్స్ మొత్తం తారుమారు చేశారని బాధితులు తెలిపారు.. ఆ తరువాత బాధిత రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ తెలంగాణ హై కోర్టులు కేసు ( డబ్ల్యు.పీ. నెంబర్ : 11793/2023 ) ఫైల్ చేశారు.. దీనిని పరిశీలించిన న్యాయస్థానం అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ జారీ చేసిన ఓ.ఆర్.సి. ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ తర్వాత బాధిత రైతులు కలెక్టర్ కి తమ పేరు మీద భూమిని మార్పు చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.. అదే విధంగా తమ భూమిని వేరే వారి పేరుమీద రిజిస్టర్ చేయవద్దని కోరుతూ మహేశ్వరం ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు.. అయినా సరే సదరు మహేశ్వరం ఎమ్మార్వో హై కోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా లోపాయికారి ఒప్పొందం చేసుకుని వేరే వారి పేరుమీద రిజిస్టర్ చేసే చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు బాధిత రైతులు వాపోతున్నారు.. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సర్వే నెంబర్లు : 287/2, 287/3 గా ఉండగా.. దీనికి అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ 287/4, 287/5 గా సర్వే నెంబర్లు వేయడం క్షమించరాని నేరంగా భావిస్తున్నామని బాధిత రైతులు అంటున్నారు.. కాగా ఈ భూములకు సంబంధించిన కేసు ఇప్పటికీ జాయింట్ కలెక్టర్ సమక్షంలో పెండింగ్ లో ఉండటం గమనార్హం..

- Advertisement -

6 ఎకరాల భూమిలో పొజిషన్ లో ఉన్న రైతుల పేరుమీద రెవెన్యూ రికార్డులు ఉండగా.. రైతు బంధు కూడా తీసుకుని ఉండగా.. ధరణిని అడ్డుపెట్టుకుని దరిద్రపు ఆలోచనలతో.. అక్రమ సంపాదనపై వ్యామోహంతో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఓ.ఆర్.సి. జారీ చేయడం ఒకెత్తైతే.. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ.. బాధిత రైతుల విన్నపాలను బుట్టదాఖలు చేస్తూ.. మహేశ్వరం ఎమ్మార్వో భూ యజమానులు భూమిని వేరే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ చేయాలనుకోవడం అత్యంత దారుణమైన విషయం.. క్షమించరాని తప్పిదం.. పబ్లిక్ గా మోసం చేయడమే అవుతుంది.. దేశానికి వెన్నెముక లాంటి రైతుల నడ్డి విరుస్తుస్తున్న ఇలాంటి అవినీతి అధికారులు ఉన్నంత కాలం.. లోపాల పుట్టగా రాజ్యమేలుతున్న ధరణి లాంటి పోర్టల్ లు ఉన్నంత కాలం.. ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి.. కోర్టులన్నా.. కోర్టు తీర్పులన్నా.. కోర్టు ఆదేశాలన్నా లెక్కలేకుండా.. రైతుల క్షేమాన్ని విస్మరిస్తూ అవినీతి సొమ్ముకు ఆశపడుతున్న మహేశ్వరం ఎమ్మార్వో లాంటి అధికారులకు సరైన గుణపాఠం చెప్పక తప్పదు.. ధరణి తన మానస పుత్రిక అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన బాధ్యతలు వహిస్తున్న మంత్రి కేటీఆర్ లు దీనికి సమాధానం చెప్పాలి.. మహేశ్వరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డి తన ఇలాఖాలో జరుగుతున్న ఇలాంటి మోసపూరిత తంతుపై దృష్టిపెట్టి బాధిత రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలతో కూడిన కథనాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు