Friday, May 3, 2024

ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్..

తప్పక చదవండి
  • టోర్నీని మధ్యలో వదిలేసి ఇంటికెళ్లిపోయిన మిచెల్ మార్ష్
  • ఇప్పటికే జట్టుకు దూరమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్
  • టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం

తొలుత రెండు వరుస పరాజయాలు.. ఆ తర్వాత వరుస విజయాలతో సెమీఫైనల్ రేసులోకి దూసుకొచ్చిన ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు భారీ షాక్ తగిలింది. ఈ టోర్నీలో మంచి ఫామ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ సోమవారం గోల్ఫ్‌కార్ట్ నుంచి కిందపడడంతో చిన్నపాటి దెబ్బ తగిలి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు మిచెల్ మార్ష్ రూపంలో ఆ జట్టుకు మరో దెబ్బ తగిలింది. టోర్నీ నుంచి అతడు అకస్మాత్తుగా ఇంటికి చేరుకున్నాడు. టోర్నీ మొత్తం అతడు మిస్సయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలతోనే అతడు టోర్నీ నుంచి ఇంటికి చేరుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో మార్కస్ స్టోయినిస్, కేమరాన్ గ్రీన్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మార్ష్ అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ తిరిగి నంబర్ 3లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. లబుషేన్ 4, జోష్ ఇంగ్లిష్, స్టోయినిస్, గ్రీన్ ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దిగే అవకాశం ఉంది. నాలుగు వరుస విజయాలతో ఊపుమీదున్న ఆసీస్ మరో రెండు మ్యాచుల్లో గెలిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. శనివారం ఇంగ్లండ్‌ను ఎదుర్కోనున్న ఆసీస్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. మ్యాక్స్‌వెల్ కానీ, మార్ష్ కానీ టోర్నీ మొత్తానికి దూరమైతే మ్యాట్ షార్ట్, అరోన్ హర్డీలను విమానమెక్కిస్తుంది. ప్రస్తుతం తన్వీర్ సింఘా మాత్రమే రిజర్వ్ ప్లేయర్‌గా ఉండడంతో వీరిద్దరి రాక తప్పనిసరి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు