Friday, November 1, 2024
spot_img

అయోధ్యలో శరవేగంగా ప్రాణప్రతిష్ట ఏర్పాట్లు

తప్పక చదవండి
  • దేశవ్యాప్తంగా 6వేలకు పైగా ప్రముఖుల హాజరు
  • భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు
  • రెడ్‌, ఎల్లో జోన్లుగా విభజించిన అధికారులు

అయోధ్య : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సహా 6,000 మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో భద్రతా సిబ్బందిని అయోధ్య లోని వివిధ ప్రాంతాల్లో మోహరించనున్నారు. డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జనవరి 22న ఆలయ విధుల్లో పాల్గొనే పోలీసులెవరూ స్మార్ట్‌ ఫోన్‌లను ఉపయోగించకూడదు. అలాగే ఈ వేడుక ముగిసిన నాలుగు రోజుల తర్వాత జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భద్రతా సిబ్బంది స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగించకూడని డీజీపీ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రామమందిర సముదాయానికి సంబంధించిన సమగ్ర భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రాంతాన్నంతటినీ రెడ్‌, ఎల్లో జోన్‌లుగా విభజించారు. రామజన్మభూమి కాంప్లెక్స్‌ను రెడ్‌ జోన్‌లో ఉంచారు. 6 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌, 3 కంపెనీల పీఏసీ, 9 కంపెనీల ఎస్‌ఎస్‌ఎఫ్‌, 300 మంది పోలీసు సిబ్బంది, 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 38 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, 40 మంది రేడియో పోలీసు సిబ్బందికి రామాలయం, దాని ప్రాంగణం భద్రత బాధ్యతలు అప్పగించారు. అయోధ్య భద్రతకు రూ.90 కోట్ల బ్జడెట్‌ కేటాయించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద అయోధ్యలో ఏఐ ఆధారిత వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు. బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌కు చెందిన రెండు బృందాలు, రెండు విధ్వంసక నిరోధక దళాలు, పీఎసీకి చెందిన ఒక కమాండో యూనిట్‌, ఎటీఎస్‌, ఎస్‌టీఎఫ్‌లకు చెందిన ఒక్కో యూనిట్‌, ఎన్‌ఎస్‌జీతో సహా సెంట్రల్‌ ఏజెన్సీలను కూడా ఆలయ భద్రత విధుల్లో మోహరించనున్నారు. ఎల్లో జోన్‌లోని కనక్‌భవన్‌, హనుమాన్‌గఢ ప్రాంతాల్లో కూడా పటిష్ట భద్రత ఉంటుంది. ఎల్లో జోన్‌లో 34 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 71 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 312 మంది కానిస్టేబుళ్లు భద్రతను పర్యవేక్షించనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు