Friday, July 19, 2024

దివీస్ కాలుష్యంతో చావాల్సిందేనా..?

తప్పక చదవండి

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు..

  • దివీస్ ల్యాబ్స్ నిర్వాకంతో ఆగమవుతున్న బ్రతుకులు..
  • భూగర్భజలాల కలుషితంతో విషతుల్యమవుతున్న పరిసరాలు..
  • గాలి, నీరు, భూమి ఎందుకూ పనికిరాకుండా పోతున్న వైనం..
  • దివీస్ ల్యాబ్స్ పై చర్యలు చేపట్టే దమ్ము ఎవరికీ లేదా..?
  • మేము జీవచ్ఛవాల్లా బ్రతకవలసిందేనా..?
  • పర్యావరణ ఇంజినీర్, టి.ఎస్.పీ.సి.బీ. నల్గొండ వారికి
    ఫిర్యాదుచేసిన చౌటుప్పల్ ఎంపీటీసీ మునగాల తిరుపతి రెడ్డి, గ్రామస్తులు..
  • మాకు జీవించే హక్కు లేదా..? అని ప్రశ్నిస్తున్న దైన్యం..

యాదాద్రి భువనగిరి జిల్లా పాలిట యమకూపంలా తయారయ్యింది దివీస్ ల్యాబరేటరీస్.. గత 25 సంవత్సరాలుగా జిల్లా పరిసర ప్రాంతాల ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తూ.. బ్రతికే అవకాశం లేకుండా చేస్తూ.. నిరంతరంగా తన దుర్మార్గాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు దివీస్ చైర్మన్ దివీస్ మురళి.. తనకున్న ధనబలం, రాజకీయ పలుకుబడితో వ్యవస్థలను తనచుట్టూ తిప్పుకుంటూ.. తనకు నచ్చినట్లు చేసుకుంటూ పోతున్నాడు.. అతను విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ కొందరు కాలుష్యనియంత్రణ మండలి అధికారులు అతగాడి అడుగులకు మడుగులు ఒత్తుతూ.. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ వారి ప్రాణాలనే గాల్లో దీపంలా పెడుతున్నారు.. భూమి, నీళ్లు, వాతావరణం కాలుష్యంతో నిండిపోయి.. భవిష్యత్తులో పీల్చుకునే ప్రాణవాయువు కూడా లభించని దుర్భర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం నెలకొంది.. చివరికి ఆక్సిజన్ కూడా కొనుక్కొని జీవించాల్సి వస్తుంది.. కేవలం అక్రమ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తూ పోతున్న కొందరు అధికారులు, దివీస్ ల్యాబ్స్ చైర్మన్ కి ఇసుమంతైనా ఇంగితజ్ఞానం లేకపోవడం దురదృష్టం.. అమాయకుల ఉసురు తగిలి వీరందరూ ప్రత్యక్ష నరకం చవిచూడక తప్పదని విశ్లేషకులు చెబుతున్న మాట..
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు గంగనబోయిన జంగయ్య, తమ ప్రాంతంలో నెలకొన్న విషమ పరిస్థితులను విశదీకరిస్తూ నల్గొండ జిల్లా, టి.ఎస్.పీ.సి.బీ. పర్యావరణ ఇంజినీర్ కు వినతిపత్రం సమర్పించారు.. గత 25 సంవత్సరాలుగా తమ గ్రామానికి పైభాగాన ఉన్న దివీస్ ల్యాబరేటరీస్ పరిశ్రమలో చేపడుతున్న ఉత్పత్తుల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను.. నిబంధనల ప్రకారం పరిశ్రమ పరిధిలో గల జీరో లిక్విడ్ డిచార్జీ ద్వారా పూర్తి శుద్ధి చేయవలిసి ఉంటుంది.. తదనంతరం వచ్చిన నీటిని తిరిగి పరిశ్రమ అవసరాలకు వినియోగించుకోవలిసి ఉండగా.. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ.. బహిరంగ ప్రదేశాలకు తరలించి, దగ్గరలో గల వాగులలో విడుదల చేస్తూ.. పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ.. భూగర్భ జలాలను కలుషితం చేయడంతో సమీపంలోని తమ గ్రామం ఆరెగూడెంతో పాటు పరిసర గ్రామాలలో భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కల్లుగీత కార్మికులు సుమారు వెయ్యి కుటుంబాల వారు నష్టపోయి.. కలుషితమైన కల్లును ఎవరు త్రాగక పోవడంతో.. ఉపాధి కోల్పోయి గత ఇరవై సంవత్సరాలుగా తీవ్రంగా నష్టపోతున్నారు. మరో వైపు దివీస్ ల్యాబ్స్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించడంతో భూగర్భ జలాలు కలుషితం కావడంతో, పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోతూ.. గత ఇరవై సంవత్సరాలుగా ఆర్థికంగా నష్టపోతున్నారు.

- Advertisement -

దివీస్ ల్యాబ్స్ పై ఎందుకు చర్యలు చేపట్టరు.. ?
దివీస్ ల్యాబ్స్ పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమ స్థాపించిన నాటి నుండి నేటి వరకు యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా తెలంగాణ రాష్ట్ర కాలుష్యనియంత్రణ మండలి అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రైతులు చేసిన ఫిర్యాదులపై మాత్రం చర్యలు చేపట్టలేదు. దాంతో న్యాయం కోసం న్యాయస్థానాలలో పదుల సంఖ్యలో కేసులు వేసినారు.

దివీస్ ల్యాబ్స్ కాలుష్యంపై దేశవ్యాప్తంగా కేసులు :
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో స్థానిక గ్రామాల రైతులు సుప్రీం హైకోర్టులో, జాతీయ హరిత ట్రిబ్యునల్ లో, మానవహక్కుల కమీషన్ లలో పదుల సంఖ్యలో కేసులు దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతము ఆ కేసులు విచారణ కొనసాగుతున్నాయి. మండలి అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు.. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా విస్తరణకు అడ్డదారిలో అనుమతులు ఇచ్చారు.. దివీస్ ల్యాబ్స్ పరిశ్రమ కాలుష్యంతో ఒకవైపు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, గీత కార్మికులు చస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం ప్రజలు చచ్చినా పరవాలేదు అని అడ్డదారిలో నిబంధనలకు విరుద్ధంగా దివీస్ ల్యాబ్స్ పరిశ్రమకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా.. విస్తరణకు అనుమతులు జారీ చేసినారు. నియంత్రణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం లేదు.? కానీ అధికారులు మాత్రం కనీసం కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం దురదృష్టం.. ఎన్నో రకాలుగా అధికారులు విచారణ కొరకు వచ్చినా.. దివీస్ ల్యాబ్స్ యాజాన్యం వారిని రకరకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయానికి దివీస్ ల్యాబ్స్ పరిశ్రమ పరిధిలోని మాజీ యం.పి.టి.సి. పంతంగి లక్ష్మణ్ రావు ఫిర్యాదు చేయడంతో స్పంధించిన ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే విచారించి చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణమండలి మెంబర్ సెక్రటరీని ఆదేశించడంతో.. విచారణాధికారిగా బోర్డులో నిజాయితీ అధికారిగా పేరున్న భద్రగిరీషను నియమించినారు. దాంతో విచారణాధికారికి సైతం లక్షలాది రూపాయలు ఆశ చూపి.. విచారణ లేకుండా చేసారని తెలియడంతో.. భద్రగిరీష్ అవినీతిపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో విచారించాలని కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ప్రతి ఒక్క అధికారిని వివిధ రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తూ చర్యలు చేపట్టకుండా తప్పించుకుంటున్నందున వెంటనే దయచేసి నష్టపోయిన ఆరెగూడెం రైతులకు కల్లు గీతకార్మికులకు 200 కోట్ల రూపాయల నష్టపరిహారము చెల్లించి.. చేపట్టిన విస్తర్ణ అనుమతులు రద్దు చేసి.. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి.. తిరిగి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ.. దివీస్ ల్యాబ్స్ పరిశ్రమ పది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలలో నీటి నమూనాలను సేకరించి, దివీస్ ల్యాబ్స్ ఎటువంటి కాలుష్యం వెలువడకుండా శాశ్వత పరిష్కారం చేయగలరని చౌటుప్పల్ ఎంపీటీసీ మునగాల తిరుపతి రెడ్డి, గ్రామస్తులు.. తమ వినతి పత్రంలో మనవి చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు