Friday, April 19, 2024

డెంగ్యూ వ్యాధి నివారణ పట్ల అవగాహన అవసరం

తప్పక చదవండి

16 మే “జాతీయ డెంగ్యూ నివారణ దినం” సందర్భంగా

అత్యంత ప్రమాదకర డెంగ్యూ వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన, వ్యాధి నివారణ పట్ల పరిజ్ఞానం, వ్యాధి చికిత్స మార్గాలు లాంటి అంశాలను సామాన్య ప్రజలకు అవగాహన కలిగించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నేతృత్వంలో ప్రతి ఏట 16 మే రోజున ‘జాతీయ డెంగ్యూ నివారణ దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. భారతదేళవ్యాప్తంగా విస్తరించిన డెంగ్యూ వైరల్‌ వ్యాధి ఆడ ‘ఏడస్‌ ఎజిప్టి’ రకమైన దోమకాటుతో సంక్రమిస్తున్నది. వ్యాధికి 4 రకాల (డెంగ్యూ వైరస్‌-1 నుంచి డెంగ్యూ వైరస్‌-4 వరకు) స్టీరియోటైప్‌ వైరస్‌లు కారణమని తెలుస్తున్నది.

- Advertisement -

డెంగ్యూ వ్యాధి ప్రాణాంతకం:
2017లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అత్యధిక డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని, 2021లో ఒక్క పంజాబ్‌లోనే అత్యధికంగా 16,129 డెంగ్యూ కేసులు బయట పడ్డాయని గణాంకాలు తెలుపుతున్నాయి. చికిత్సతో నయం చేయగల డెంగ్యూ వ్యాధి రెండవ సారి సోకితే ప్రాణాంతకంగా మారవచ్చు. దోమకాటు అనంతరం 3-14 రోజుల్లో డెంగ్యూ వ్యాధి లక్షణాలు బయట పడతాయి. డెంగ్యూ వైరస్‌కు సరైన ఆంటీ-వైరల్‌ ఔషధాలు లేనప్పటికీ తొలిదశలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. డెంగ్యూ రోగులు చికిత్స సమయంలో ద్రవ ఆహారం విధిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దోమ కాటుతో డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా, జీకా అంటువ్యాధి లాంటివి వస్తాయని మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 15 జూన్‌ రోజున ‘అంతర్జాతీయ డెంగ్యూ వ్యతిరేక దినం’ పాటించబడుతున్నదని మనకు తెలుసు.

డెంగ్యూ వ్యాధి లక్షణాలు:
డెంగ్యూ వ్యాధి సోకిన రోగుల్లో అధిక జ్వరం, తలనొప్పి, కండర కీళ్ళ నొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, రక్తస్రావం, బిపి తగ్గడం, ప్లేట్లెట్లు పడిపోవడం, అలసట (ఫాటిగ్యూ), దురద దద్దుర్లు (రాషెస్‌), కంటి వెనుక నొప్పి లాంటి రోగ లక్షణాలు కలుస్తాయి. రక్త పరీక్షల ద్వారా వ్యాధి నిర్థారణ చేస్తారు.

నియంత్రణ మార్గాలు:
గృహ పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి. నీటి పాత్రలకు మూతలు పెట్టాలి కుటుంబ సభ్యులు శరీరం పూర్తిగా కప్పేలా దుస్తువులు ధరించాలి. దోమ తెరలు, దోమలను వికర్శించే ఔషధాలు వాడాలి. దోమలు దరి చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ నివారణ, నియంత్రణ ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని తెలుసుకోవాలి. దోమల తావులను గుర్తించి నాశనం చేయడం, దోమ కాటు నుంచి స్వయం రక్షణ పొందడం, తొలి దశలోనే గుర్తించడం, దోమల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడం మరువరాదు. డెంగ్యూ లాంటి పలు వ్యాధుల నియంత్రణకు, రోగనిరోధకశక్తి పెరుగుదలకు ధ్యానం, ప్రాణాయామం, శారీరక వ్యాయామం, యోగా, పోషకాహారం తీసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటిస్తున్నది. దాదాపు 50 శాతం ప్రపంచ జనాభా డెంగ్యూ ముంగిట నిలిచి ఉన్నది. “డెంగ్యూను నివారణకు చేయి చేయి కలుపుదాం” అనే నినాదంతో ప్రాణాంతక వ్యాధి కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకుందాం. మనల్ని దోమ కాటు వేయక ముందే మనమే దోమలను ఖతం చేద్దాం.

  • డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
    కరీంనగర్ – 9949700037
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు