Saturday, May 18, 2024

మత్తులో యువత చిత్తు..ప్రశ్నార్థకంగా మారిన తెలంగాణ భవిష్యత్తు..

తప్పక చదవండి
  • వారు పుట్టుకతోనే వృద్ధులయ్యారా..?
  • చేవచచ్చి జీవచ్ఛవాల్లా మారారా..?
  • వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును మరిచారా..?
  • రాక్షస రాజకీయాలను మార్చే సాహసం చేయలేరా..?
  • యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమనే నిజాన్ని గ్రహించలేరా..?
  • మీరు నిర్వీర్యం అయితే దేశం వెనుకబడిపోతుంది..
  • ముక్క, చుక్క వదిలేసి భవితవ్యం వైపు చుక్కాని అవ్వండి..
  • వివేకానందుడి మాటలు ఒకసారి మననం చేసుకోండి..
  • అంబేడ్కర్ మీకిచ్చిన ఆయుధాన్ని సారించండి..
  • ఇంకెన్నాళ్లు ఈ వయసుమీరిన రాజకీయుల అరాచకాలు..
  • యువతరం కళ్లుతెరిస్తేనే నవశకం మొలకెత్తుతుంది..( బీవీఆర్ )
  • లేవండి మేల్కోండి.. గమ్యం చేరేవరకూ విశ్రమించకండి : స్వామి వివేకానంద..
  • స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం నేర్పించే మతాన్ని యువత స్వీకరించాలి : బాబా సాహెబ్ అంబేడ్కర్..
  • ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు దీన్ని యువత ప్రేరేపించాలి : మహాత్మా గాంధీ..

కొంతమంది యువకులు ముందుయుగం దూతలు అన్న శ్రీ శ్రీ మాటలని నిజం చేసే యువత నిజంగా ఉన్నారా..? ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు..? ఏదైనా సాధించగల సత్తా ఉన్న యువత ఎందుకు నిర్వీర్యం అయిపోతోంది..? సమ సమాజ స్థాపనలో ఎందుకు వెనుకంజ వేస్తోంది..? చరిత్ర సృష్టించిన వారిలో యువతే కనిపిస్తారు.. అఖండభారత నిర్మాణానికి నడుకట్టి అసువులు బాసిన యువత నడయాడిన దేశం మనది.. అలాంటి భారతావనిలో ఈరోజు యువత మగతలో బ్రతుకుతోంది.. ఇది వాంఛనీయం కాదు.. చేవచచ్చిన యువత జీవచ్ఛవంలా బ్రతుకుతుండటం శోచనీయం.. భరతమాత కొంగుబంగారమై యువత ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఎంతో ఉంది.. ఓ యువతా నిజాలను గ్రహించు.. గాడితప్పుతున్న రాజకీయ అరాచకాలకు అంతం పలుకు.. ఇది కేవలం యువత వల్లే సాధ్యం అవుతుందన్న నిజాన్ని గ్రహించు.. భరతమాత కంటినుంచి జారుతున్న కన్నీటిబొట్టును చెంపమీదే తుడిచే ప్రయత్నం చెయ్.. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడానికి నీలోని శక్తిని వెలికి తీయ్.. కదం బడావో.. తెలంగాణకో.. ఔర్ భారత్ కో బచావో..

హైదరాబాద్ : దేశానికి వెన్నెముక లాంటి యువతరం బలహీనపడి వంగిపోతోంది.. ముందుండి నడిపించాల్సిన వారే వెనుకబడిపోతున్నారు.. దీనికి కారణాలు అనేకానేకం.. యువతను నిర్వీర్యం చేస్తున్న అరాచకీయం రాజ్యమేలుతున్నంత కాలం ఇలాంటి గడ్డు పరిస్థితులే చవిచూడాల్సి వస్తుంది..

- Advertisement -

అసలు యువత పాత్ర ఏంటి..?
యువతే మన దేశ భవిష్యత్తు.. భారతమాతకు యువత ప్రాణం. వారు ఈ రోజు కేవలం మన భాగస్వాములు కావచ్చు.. కానీ రేపు వారు నాయకులు అవుతారు. ఎందుకంటే యువత శక్తివంతంగా.. ఉద్వేగభరితంగా ఉంటారు. వారు తమకు ఎదురవుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోగలుగుతారు.. ఎదురయ్యే పరిస్థితులనుంచి ఎంతో నేర్చుకోగలుగుతారు. వారు నేర్చుకోవడానికి, వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టడానికి వెనుకంజ వేయరు.. యువత సామాజిక సంస్కరణలను తీసుకురావడానికి, సమాజాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడగలరు.. దేశంలో యువత అనేది లేకుండా మనం మనుగడ సాగించలేం. సమసమాజ లక్ష్యాలను సాధించడానికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారు కృషి చేయడం ఇప్పడి పరిస్థితుల్లో అవశ్యముగా కనిపిస్తోంది.. ఈ నిజాన్ని నేటి యువత గ్రహించాలి..

దేశాభివృద్ధికి యువత ఎంతో అవసరమని మనం ఎన్నో సందర్భాల్లో ప్రత్యక్షంగా చూసాం.. మనం ఏది సాధించాలన్నా సాంకేతికంగా, స్పోర్టివ్ గా ఉన్న యువత ఖచ్చితంగా అవసరం. అలాంటి శక్తివంతమైన యువతరాన్ని గుర్తించడంలో మనం గుర్తించగలగాలి.. కానీ ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణాలో జరుగుతున్నదేమిటి..? యువతను మత్తుకు బానిసలను చేసి రాష్ట్ర భవితవ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారు.. ఇది వినడానికి, చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.. సమాజ నిర్మాణంలో వారు పోషించే ముఖ్యమైన పాత్ర గురించి వారికి తెలపాల్సింది పోయి వారిని తాత్కాలిక ఆనందాల వలలోకి నెట్టివేస్తున్నాయి ప్రభుత్వాలు..

యువతను ప్రేరేపించడానికి అనేకానేక మార్గాలున్నాయి :
మన యువత వారి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యువత మరింత అభివృద్ధి చెందడానికి, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, అత్యుత్తమ విద్యను అందించడానికి ప్రభుత్వాలు సరైన కార్యక్రమాలను రూపొందించాలి. యువత అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోంది..? యువతను నిరుత్సాహపరిచి, వారిమీద వారికే నమ్మకం లేకుండా చేసి, వారి అమూల్యమైన నైపుణ్యాన్ని కాలరాస్తోంది.. యువత స్వేచ్చా వాయువులు పీల్చకుండా వారిని నాశనం చేస్తున్నాయి.. గడచిన తొమ్మిదేండ్లుగా ఉద్యోగావకాశాలను కనుమరుగు చేసింది.. కంటితుడుపు చర్యలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ కాలం గడుపుతోంది.. పేపర్ లీకేజీలతో వారి జీవితాలను కాలరాచివేస్తోంది.. తెలంగాణాలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి.. పోరాటతత్వాన్ని గుండెనిండా నింపుకున్న లక్షలాది విద్యార్థులున్నారు.. మరి ఇప్పుడు వారంతా ఏమైపోయారు.. ఒక్క జీవోతో ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకున్న కేసీఆర్ ప్రభుత్వం యువత కోసం ఏమి చేస్తోంది.. ఇవన్నీ ప్రశ్నించే తత్వాన్ని యువతరం ఎందుకు కోల్పోయింది.. రెండువేల పెన్షన్ ఇస్తూ.. స్కాలర్ షిప్పులు, ఫీజు రీ యంబర్స్ మెంట్స్ లాంటి వాటికి తిలోదకాలిచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు బహిరంగంగా ప్రశ్నించలేకపోతోంది యువత.. ఒక్కసారి వారి గుండెలమీద చేతులు వేసుకుని ఆలోచించాలి..

అంతే కాకుండా జాతి, కుల, మతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలు అందుబాటులో ఉంచకుండా వారిని పెడత్రోవ పట్టిస్తున్నాయి మకిలి పట్టిన రాజకీయాలు.. తమ స్వార్ధం కోసం, బంధుప్రీతి, పక్షపాతం లాంటి అంశాలమీద దృష్టిపెట్టి.. మన రాష్ట్రం యొక్క వాస్తవ ప్రతిభను అణగద్రొక్కుతున్నాయి.. ఈ వాస్తవాన్ని నేటి యువతరం వీలైనంత త్వరగా గ్రహించాలి.. యువకులందరూ తమ సత్తాను నిరూపించుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత.. కానీ తమ బాధ్యతలు మరచిన కుటిల ప్రభుత్వాలు దాన్ని మరచిపోతున్నాయి.. యువత తనకు తాను ఈ వాస్తవాలను గ్రహించాలి..

మన యువతకు దేశాన్ని సైతం నిర్మించగల సామర్థ్యం ఉంది.. కాబట్టి సమ సమాజం కోరుకునే వయసుమళ్ళిన నాయకులు యువతకు ఆ అవకాశం ఇవ్వాలి.. నేటి యువత భవిష్యత్తుపై అపారమైన ప్రేమను, పాత తరాలకు లేని అద్భుత దూర దృష్టిని కలిగి ఉన్నారు. దేశం అభివృద్ధి చెందడానికి, యువతలో ఉన్న అద్భుతమైన ఉత్సాహాన్ని, నాయకత్వ లక్షణాలకు నూతనోత్తేజం నింపగలగాలి.. ఎందుకంటే దేశ నిర్మాణానికి యువత ఆలోచనా ధోరణి అత్యవసరం.. దృఢమైన సంకల్పం యువత కలిగి ఉంటుంది.. సమాజంలో ఎలాంటి మార్పునైనా తీసుకురాగల సామర్ధ్యం కేవలం ఒక్క యువతకే ఉంటుంది.. ఇది అక్షర సత్యం.. ఇప్పటి తలపండిన నేతలు కూడా ఒకప్పుడు యువతరంనుంచి వచ్చినవాళ్లే.. కనుక తమ స్వార్ధ ప్రయోజనాలను పక్కనబెట్టి.. యువతకు ప్రాముఖ్యం కలిపించగలగాలి.. అప్పుడే కలలు గంటున్న అఖండ భారతం, బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది..

యువత ఎదురుతిరిగితే.. రాజ్యాలు సైతం కుప్పకూలి పోతాయన్నదానికి ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి.. యువత విజృంభించి రాజ్యాధికారం చేపట్టిన ఘటనలు కూడా మనం చూశాం.. కానీ కుహనా రాజకీయం రాజ్యమేలుతున్న ప్రస్తుత సమాజంలో యువతను టార్గెట్ చేస్తూ.. తమకు ఎదురులేకుండా చేసుకోవడానికి, ప్రశ్నించే తత్వాన్ని అణగద్రొక్కడానికి, కుయుక్తులు పన్నుతూ వారిని అధః పాతాళానికి తోక్కేస్తున్నారు.. చదువుకు దూరం చేస్తున్నారు.. ఉపాధి అవకాశాలకు గండి కొడుతున్నారు.. యువతలో నైరాశ్యం నింపి ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు.. మత్తుకు బానిసలను చేస్తూ.. తాత్కాలిక ఆనందమే పరమావధి అనే ధోరణిలోకి యువతను బలవంతంగా నెట్టేస్తున్నారు.. దాంతో తాము అనుకున్నవి సాధిస్తూ.. సమాజాన్ని నాశనం చేస్తూ.. యువతను తమ కాలికింద చెప్పులా మార్చివేస్తూ రాక్షసానందం పొందుతున్నారు.. ఈ భయంకర వాస్తవాలను యువత గ్రహించాలి.. తమ శక్తి ఏమిటో వారే గ్రహించాలి.. వయసుమళ్ళిన కుటిల రాజకీయాలను కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలి.. సమాజంలో ఏకొందరో అక్కడక్కడా నిజాయితీ కలిగిన నాయకులున్నారు.. వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగాలి.. కన్నీటితో దుఃఖ భరితమై కుమిలిపోతున్న భరతమాతకు చేయూతనిచ్చి నవసమాజ స్థాపనకు నడుం కట్టాలి..

ముఖ్యంగా ఓ తెలంగాణ యువతరమా.. మీరున్న పరిస్థితిని గమనించండి.. మీ జీవితాలు ఎలాంటి దారుణ పరిస్థితుల్లో ఉన్నాయో.. చూడండి.. మీ భవితవ్యం కోసం ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీ బ్రతుకులు ఎంతగా ఆగమాగం అయ్యాయో తెలుసుకోండి.. కనీసం మీ తర్వాతి భవిష్యత్ తరాలకోసమైనా కళ్లుతెరవండి.. లేకపోతే ఎప్పటికీ ఈ నీచ రాజకీయాలు సృష్టిస్తున్న చీకటి వ్యవస్థలో కుమిలి, కుమిలి మీ జీవితాలను అంతం చేసుకోవాల్సిందే.. ఓ యువతా మేలుకో.. దాస్య శృంఖలాలను తెంపేసుకో.. స్వేచ్చా వాయువులు పీల్చుకో.. నీ హక్కులతోబాటు.. భవిష్యత్ తరాల హక్కులను సైతం సజీవంగా నిలుపుకో..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు