Tuesday, May 21, 2024

తెలుగు పేర్లతో ఆకట్టుకుంటున్న హోటళ్లు..

తప్పక చదవండి
  • హైదరాబాద్ లోని రెస్టారెంట్ల కొత్త పోకడ..

‘బాబాయ్‌ హోటల్‌’ అంటే బ్రహ్మానందం పొందుతారు!‘వివాహ భోజనంబు’ పిలిస్తే.. ‘ఒహొహ్హొ నాకె ముందు’ అని వాలిపోతాం!‘తెలంగాణ స్పైసీ కిచెన్‌’ ఎంత ఘాటుగా ఉంటుందో అని ముందుగానే ఓ అంచనాకొస్తాం!!పదార్థం సంగతి అటుంచితే, పేరుతోనే భోజన ప్రియులను కట్టిపడేస్తున్నారు రెస్టారెంట్‌ నిర్వాహకులు. నవీనతను సంతరించుకున్న స్వచ్ఛమైన పూటకూళ్ల ఇండ్లకు అచ్చమైన తెలుగు పదాలను నామకరణం చేసి జిహ్వ చాపల్యాన్ని హెచ్చిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో విభిన్న కాన్సెప్ట్‌తో, వినూత్నమైన తెలుగు పేర్లతో అతిథి కావోభవ అని ఆహ్వానిస్తున్నారు. పేరులో వింత, తెలుగు వంటకాలనే మమకారం కొంత కలగలసి వారాంతాల్లో నగరవాసులు వీటి ముందు క్యూ కడుతున్నారు. ‘వచ్చి తిని పో’.. ‘బకాసురా’.. రెస్టారెంట్‌ కబుర్లని చెప్పి ఇలా తిట్టడం ఏంటి? అని ఇదైపోకండి. ఇవి అచ్చంగా మన హైదరాబాద్‌లోని రెస్టారెంట్ల పేర్లే! వంటల్లో ఎన్ని విభిన్న పదార్థాలు ఉంటాయో.. అన్ని వెరైటీ పేర్లతో ఆకర్షిస్తున్నాయివి. శుచికరమైన పేర్లతో రుచికరమైన వంటకాలను ఆస్వాదించండంటూ స్వాగతం పలుకుతున్నారు పాకయాజులు. అలాంటి వినూత్నమైన నామధేయాలున్న వంటకాల కామధేనువుల పరిచయం ఇది.. అచ్చతెనుగు నాటు ఎంత పోటుగా ఉంటుందో మనకు తెలిసిందే! ‘నాటు నాటు..’ పాట ఘాటుకు ఆస్కార్‌ పుటలు కూడా అదిరాయి. అదే పేరుతో జూబ్లీహిల్స్‌లో తలుపులు ‘బార్లా’ తెరుచుకున్న కిచెన్‌ రెస్టారెంట్‌ ‘నాటు’. ఇక్కడి ఉలవచారు కోడి పులావ్‌ ఒక్కసారి రుచి చూస్తే ‘నా ఆట చూడు.. నా పాట చూడు..’ అని ఆత్మారాముడు గంతులు వేయడం ఖాయం. రొయ్యల వేపుడు, కీమా పులావ్‌ వంటి వెరైటీలు మాంసాహార ప్రియులను మైమరపింపజేస్తాయి. పదార్థం ప్రశస్తంగా ఉంటే సరిపోతుందా! పరిసరాలు కూడా అంత ఘనంగా ఉంటేనే విందు పసందుగా సాగుతుంది. అలాంటి వాతావరణం ‘నాటు’లో నీట్‌గా కల్పించారు రెస్టారెంట్‌ నిర్వాహకులు. తెలంగాణ ప్రైడ్‌గా భావించే నకాశి చిత్తరువులు రెస్టారెంట్‌ గోడలపై దర్జాగా కొలువుదీరి అతిథులకూ దర్పాన్ని తెచ్చిపెడతాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు