Sunday, October 13, 2024
spot_img

తెలంగాణ విద్యా వ్యవస్థకు చెదలు

తప్పక చదవండి
  • పాఠశాల విద్యను నిర్లక్ష్యానికి గురిచేస్తున్న ప్రభుత్వం
  • సౌకర్యాల లేమితో విద్యార్థులు గోసలు
  • వెక్కిరిస్తున్న గురుకులాల సమస్యలు
  • ప్రభుత్వానికి, విద్యాశాఖకు చీమ కుట్టినట్లయిన లేదు
  • విద్యా వ్యాపారమైంది.. కార్పొరేటు సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయింది
  • వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల మూసివేస్తున్న అడిగేనాధుడు లేడు
  • ఏం సాధించారని.. సాధిస్తారని దశాబ్ది ఉత్సవాలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై, బ్రష్టు పట్టిన పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. పాలకులు తీసుకుంటున్న కార్పొరేటు నిర్ణయాలతో విద్యా వ్యవస్థ అద:పాతాళానికి నెట్టబడిరది. చదువు కోవాలంటే .. చదువులు కొనాలనే రోజులు వచ్చి పడ్డాయి.. రాష్ట్రంలో 28 వేల పైచిలుకు పాఠశాలలు ఉండగా అందులో ఇప్పటికీ సగానికిపైగా పాఠశాలలు మూసి వేయబడ్డాయి.ఇంకా మూసి వేయబడుతున్నాయి. తెలంగాణ వస్తే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ప్రసంగాలతో ఊదరకొట్టిన నాయకులు బాల్యం నిర్వీర్యం అయిపోతుంటే ఎందుకు పట్టించుకోవడంలేదో అర్ధం కావడం లేదు.. విద్యావ్యవస్థను గాడిలో పెట్టామని గోడలకు రంగులు వేసి కరపత్రాలు ముద్రించుకుని మురిపోతున్న మంత్రులు ఉన్నంత కాలం బాల్యం బందీగానే ఉండక తప్పదు..

విద్యా రంగానికి నిధుల కొరత
అరొకర వసతులు.. టీచర్ల కొరత .. పాఠ్య పుస్తకాల కొరత .. బట్టల కొరత .. తాగు నీటి కొరత.. కొరత .. కొరత .. లతో తెలంగాణ విద్యావ్యవస్థ పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా అవమానాలకు గురవుతూనే ఉంది..ప్రాధాన్యత ఉన్న విద్యారంగంపై ఈ పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కటంటే ఒక్కటి సమీక్షా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.. తెలంగాణ పునర్నిర్మాణం అవుతుందంటే మురిసిపోయిన తెలంగాణ బిడ్డలకు మయిలపట్టిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తుంటే మతులుపోతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కేటాయించే రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించిన విధానాన్ని చూస్తుంటే యిట్టె చెప్పేయచ్చు విద్యారంగాన్ని ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందని..

- Advertisement -

తెలంగాణ విద్యా వ్యవస్థ సర్వ నాశనం..
విద్యా రంగం అభివృద్ధి చెందితేనే సాంస్కృతి, సామాజిక విలువలు, ఆర్థిక ఎదుగుదల, సామాజిక చైతన్యం ముఖ్యంగా విద్యా రంగం అభివృద్ధి చెందితేనే మౌఖికంగా పలు రంగాలపై ప్రభావం ఉంటుంది. సీమాంధ్ర పాలకుల పాలనలో సరైన నిధులు కేటాయించపోవడంతో తెలంగాణ విద్యా వ్యవస్థ సర్వ నాశనం అయిందని.. నాశనం చేశారని.. ఎన్నోసార్లు ఊకదంపుడు ప్రసంగాలతో అదరగొట్టిన కేసీఆర్‌ మరి నేడు ఆయన పాలనలో చేస్తుంది ఏమిటో ఆయనకే తెలియాలి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి 12 శాతం నిధుల కేటాయింపు జరిగితే .. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 6.57 శాతం నిధులు కేటాయిస్తున్నారు.. దేశంలోనీ ఇతర రాష్ట్రాల్లో సగటున విద్యారంగానికి 14.8 శాతం నిధులు కేటాయింపులు జరుగుతుంటే మన రాష్ట్రం మాత్రం ఆతీ తక్కువ నిధులు కేటాయించిన రాష్ట్రంగా దేశంలోనే నిలిచిపోయింది.. నిధుల లేమి కారణంగా ఖాళీలు భర్తీ చేయకపోవడంతో తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలోకి నెట్టబడిరది.

పాఠశాల విద్య- ప్రభుత్వ నిర్లక్ష్యం!
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే 12 వందల పాఠశాలలు మూసి వేయబడ్డాయి.6,132 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్నాయి.67 శాతం పాఠశాలలు డబల్‌ సింగల్‌ ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి. రాష్ట్రంలో 53% పాఠశాలల్లో సరిగ్గా తరగతి గదులు లేవు 3900 కోట్ల రూపాయలతో 9132 స్కూళ్లలో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపలేకపోతుంది..

రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కనీస వసతులు లేవు
రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో తాగునీరు మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం, మౌలిక వసతులు లేవు.. వీటి సంఖ్య నేడు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికి తెలుగు మీడియం, ఇంగ్లీష్‌ మీడియం ఉర్దూ మీడియం లో సుమారు 40 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.33 జిల్లాల్లో విద్యాధికారి పోస్టులు రెగ్యులర్గా ఉన్నవి 9 మాత్రమే, 592 మండలాలకు గాను 571 మండలాల్లోప్రభుత్వప్రధానోపాధ్యాయులు ఇన్చార్జి ఎంఈఓ లుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో తూ తూ మంత్రంగా నిర్వహించబడుతున్న బడిబాట కార్యక్రమం విజయవంతమైందని నాయకులు ప్రసంగాలతో ఉదరగొడుతున్నారు. ప్రభుత్వ బడులపై నమ్మకంతో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అంటున్నారు కానీ వారి వివరాలు ఎక్కడ బహిర్గతం చేయడం లేదు . ఇలాంటి పరిస్థితుల్లో ఏం అభివృద్ధి జరిగిందని దినోత్సవాలు జరుపుకోవాలో విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఈ మధ్యనే కేంద్రం విడుదల చేసిన పర్ఫార్మెన్స్‌ గ్రేడిరగ్‌ ఇండెక్స్‌ (పి జి ఐ) నివేదికలో విద్య అభివృద్ధి సూచిలో తెలంగాణ రాష్ట్రం 31వ స్థానంలో ఉన్నది. అంటేనే ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏ పాటిదో యిట్టె అర్థమవుతుంది.

గురు కులాలు కాదు సమస్యల కూపాలు
విద్యారంగంలో ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న పథకం గురుకులాలు ఏర్పాటు. దీని ద్వారా కేజీ టు పీజీ విష్ట విద్య అందిస్తామని చెప్పారు. కానీ రాజ్యాంగ సమానాత్వానికి వ్యతిరేకంగా కులాల వారిగా గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగింది. గురుకులాల ద్వారా కొంతమేర విద్య అందుతున్న సౌకర్యాల పరంగా అత్యంత దుర్భరమైన స్థితిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 9 వందల పైచిలుకు గురుకులాలను ప్రారంభించినప్పటికీ 600 పై చిలుకు గ్రూపులలో కొనసాగుతున్నాయి. అయినా వీటికి పక్కాభవనాలు లేక మూసి వేయబడిన ఇంజనీరింగ్‌ కళాశాలలో, ఫంక్షన్‌ హాల్‌ లో వీటిని నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపస్లో మూడు నాలుగు గురుకులాలను నిర్వహించడంతో విద్యార్థినీ విద్యార్థులకు టాయిలెట్లు, బాత్రూంలో, డార్మెట్‌ హాల్‌, డైనింగ్‌ హాల్‌, తరగతి గదులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు గురుకులాల్లో నిరుపేద విద్యార్థులు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ఫుడ్‌ పాయిజనింగ్‌, పాముకాటులు నిత్యకృతమయ్యాయి. మహిళ అభివృద్ధి అంటూ కేజీవీబీ ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ కూడా సొంత భవనాలు లేక నిర్వహణ సరిగా లేక వారిపై పర్యవేక్షణ కరువై సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. మహిళా కళాశాలలో యూనివర్సిటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

పరీక్షలు నిర్వహణ వైఫల్యాలు
తెలంగాణ రాష్ట్రంలో కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేనిస్థితిలో విద్యారంగం ఉంది. ఇంటర్మీడియట్‌ పదవ తరగతి పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీకేజీ కాకుండా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పొచ్చు.2019 న గ్లోబరీనా సంస్థ నిర్వాహకం వల్ల 23 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఒక్కటేంటి ఎంసెట్‌ లీకేజీలు, ఇంటర్మీడియట్‌ లీకేజీలు, పదవ తరగతి పరీక్షల లీకేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తెలంగాణలో పలు స్కూల్లలో సిలబస్‌ పూర్తికాకుండానే పరీక్షలు నిర్వహించడం పట్ల ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా నిర్వహించడం లేదనడానికి ఇది నిదర్శనం.

రాష్ట్రంలో చదువు వ్యాపారమయం
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్‌, ప్రైవేట్‌, విద్యాసంస్థల ఫీజులతో దోపిడికి అంతం లేకుండా పోయింది. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, కోర్సులకు ఫీజుల నియంత్రణ రూపకల్పన చట్టాలు కమిషన్లు ఉన్నాయి. కానీ పాఠశాల స్థాయిలో ఇంటర్మీడియట్‌ స్థాయిలో కార్పొరేట్‌ ఆగడాలు పెరిగిపోయాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా బ్రాంచ్లను ప్రారంభించి ఫీజుల రూపంలో దోపిడీలకు పాల్పడుతున్న వాటిని నియంత్రించే యంత్రాంగం లేదు వీరి మార్కులు ర్యాంకులు ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఫీజులను నియంత్రించే జీవోలు నెంబర్‌ 42 43 జీవోలను అటకెక్కించిన ఘనత మన కేసీఆర్కే దక్కుతుంది. నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేటు సమస్యలను నియంత్రించే స్థితిలో నేడు ప్రభుత్వం లేదు దీంతో వీరి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ప్రాథమిక స్థాయి నుండి యూనివర్సిటీల స్థాయి వరకు ప్రభుత్వ రంగాలను బలహీన పరుస్తూ ప్రైవేట్‌, కార్పొరేట్‌ రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ రంగాలను గాలికి వదిలేశారు. కోట్లు ఖర్చు చేసి ప్రచార ఆర్భాటమే తప్ప చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రజలకు అర్థమైంది.

ఎక్కడ తగ్గని అయ్యా కొడుకుల ఏతులు
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన కొడుకు మంత్రి కేటీఆర్‌ ఏతులు కొట్టడమే తప్ప ఇక్కడ ఏమి చేసింది లేదు. వీళ్ళ చేతుల్లో పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు గోసపడ్డారే తప్ప బాగుపడ్డ దాఖలాలు ఇక్కడ కూడా లేవు. ప్రజలకు అర్థం కానని రోజులే మీ కాలం చెల్లుబాటు అవుతుంది దొర కానీ ప్రజలకు అర్థమైన రోజున మీరు ఇక అంతే ఇప్పటికే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు రానున్న రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు