- 96 మృతదేహాలు మార్చురీలో ఉన్నాయి
- 1,118 మంది గాయపడ్డారని వెల్లడి
మణిపూర్ : రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో గత కొన్ని నెలలుగా కల్లోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మే 3న ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పటికీ చల్లారలేదు. అక్కడక్కడా అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 175 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తాజాగా వెల్లడిరచారు. 175 మందిలో ఇప్పటికీ గుర్తించని 96 మృతదేహాలు మార్చురీలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఘర్షణల్లో 1,118 మంది గాయపడ్డారని.. సుమారు 33 మంది అదృశ్యమైనట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై కొన్ని కీలక గణాంకాలను పోలీసు శాఖ తాజాగా విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం.. ఈ హింసలో కనీసం 5,172 అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో 4,786 ఇళ్లు, 386 మతపరమైన ప్రదేశాలకు (254 చర్చిలు, 132 దేవాలయాలు) అల్లరి మూకలు నిప్పు పెట్టారు. హింస ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర ఆయుధగారం నుంచి 5,668 ఆయుధాలు లూటీకి గురయ్యాయి. అందులో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. అదేవిధంగా అల్లరి మూకల నుంచి 15,050 మందుగుండు సామగ్రి, 400 బాంబులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలో కనీసం 360 అక్రమ బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. కాగా, కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న జాత్యహంకార ఘర్షణలను చల్లార్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ శాంతి నెలకొనడం లేదు కదా రోజురోజుకూ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత క్షీణిస్తున్నాయి. ఇప్పటికీ కొందరు అల్లరి మూకలు, నిషేధిత ఉగ్రవాదులు అక్కడక్కడా దాడులకు పాల్పడుతున్నారు.