టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ పరశురాం, విజయ్ దేవరకొండ. గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తున్నట్టు ఇప్పటికే ఓ అప్‌డేట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతా అనుకున్నట్టుగానే విజయ్-పరశురాం రెండో సినిమా నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరా స్విచ్చాన్ చేయగా.. హీరోహీరోయిన్లపై ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు.
ముహూర్తపు సన్నివేశానికి గోవర్ధన రావు దేవరకొండ గౌరవ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యానర్‌కు ఇది 54వ ప్రాజెక్ట్.
హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా వీడీ 13గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడించనుంది దిల్ రాజు టీం. వీడీ 13లో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్.
విజయ్ దేవరకొండ ఇప్పటికే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఖుషిలో నటిస్తున్నాడు. మరోవైపు కాప్ డ్రామా నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వీడీ 12లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. గీత గోవిందం తర్వాత విజయ్-పరశురాం నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.