- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
శామీర్‌పేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాల లను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థు లకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎలాంటి లోటుపాటులు లేకుండా చూడాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం శామీర్‌పేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యతో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయ కుమారి, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో మన ఊరు – మన బడి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 176 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని, అందులో 30 పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి ప్రారంభోత్సవాలు జరిగాయని, మరో 20 పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని వివరించారు. అదే విధంగా జిల్లాలోని మిగిలిన పాఠశాలలకు సంబంధించిన పనులు ఆయా దశల్లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి నిధుల కొరతలేనందున పనులు సకాలంలో పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా చూడాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలల్లో తరగతి గదులతో పాటు, పెయింటింగ్, వంట శాలలు (కిచెన్ షెడ్స్), మూత్రశాలలు, మరుగుదొడ్లు, టేబుళ్ళు, ఫ్యాన్లు, బ్లాక్ బోర్డులు, విద్యుత్తు సౌకర్యం, నీటి వసతితో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయితే పనులు సకాలంలో పూర్తి కావడంతో పాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరుగుతాయని దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రకారం సమన్వయం చేసుకొని పాఠశాలలను సందర్శించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. డివిజన్ వారీగా పాఠశాలలకు సంబంధించిన పనులు తదితర వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల పనులు పెండిరగ్లో ఉండకుండా త్వరితగతిన పూర్తి చేసి అన్ని అభివృద్ధిలో ముందుస్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-