Saturday, May 4, 2024

మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు

తప్పక చదవండి

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు డాక్టర్ గాజుల ప్రభాకర్, డాక్టర్ పాపతోటి నరేంద్రకుమార్ లు మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాధించారు. బ్యాక్టీరియా మెటబొలైట్ నుండి బయో పెస్టిసైడ్ తయారుచేసి, కెమికల్ పెస్టిసైడ్ కన్నా త్వరగా, మెరుగ్గా పనిచేసే విధంగా తయారు చేయుటకు వారు రూపొందించిన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐ.ఎఫ్.సి.ఐ
(ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వెంచర్ క్యాపిటల్ స్కీం కింద ఎంపిక చేసి 30 లక్షలు గ్రాంట్ ను మంజూరు చేసింది. వివిధ దశలలో వారి ప్రతిభను ప్రదర్శించి విజయవంతంగా ప్రాజెక్టు గ్రాంట్ ను సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల తరపున గ్రాంట్ కి ఎంపికైన ఏకైక ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టు నిలవడం విశేషం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలైన డోర్నకల్ మరియు నెల్లికుదురు మండలం శ్రీరామగిరి నుండి వచ్చి వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి అనేక పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కెమికల్ పెస్టిసైడ్ వాడటం వలన మానవులు అనేక రకాల ఆరోగ్య సమస్యలు మరియు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంతేకాకుండా వాటి వల్ల పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతోంది. కావున కెమికల్ పెస్టిసైడ్ ల వాడకం నిర్మూలించి బయోపిస్టిసైడ్స్ వాడటం వలన పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలను అధిగమించి మెరుగ్గా పనిచేసే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ ను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం వీరు మిర్చి, మామిడి పంటలపై తీవ్ర ప్రభావం చూపించే నల్ల పురుగును నిర్మూలించేందుకు చేసిన ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అందించే 50 లక్షల బయో టెక్నాలజీ ఇగ్నిషన్ గ్రాంట్ (BIRAC-BIG)కి ఎంపికై పరిశోధనలు చేస్తుండటం గమనార్హం. గతంలో కూడా వీరు కేంద్ర ప్రభుత్వ సంస్థ అందించే ప్రాజెక్ట్ గ్రాంట్ లకు ఎంపికై విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ నరేంద్ర కుమార్ ప్రస్తుతం థాయిలాండ్ సురనరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ క్రాఫ్ ప్రొడక్షన్ లో పోస్ట్ డాక్టరల్ గా చేస్తుండగా, డాక్టర్ గాజుల ప్రభాకర్ జీ. పి. అవెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని స్థాపించి అనేక రకాల వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వీరు చేసిన పరిశోధనలు 25కి పైగా జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితం అయినాయి. వీటితో పాటు ఇప్పటివరకు 5 పుస్తకాలను ప్రచురించడంతో పాటు, 6 పేటెంట్లను కూడా పొందారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లభిస్తే రైతులకు ఉపయోగపడే మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వీరు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు