Saturday, May 18, 2024

మరో ఇద్దరికి నిఫా వైరస్‌..

తప్పక చదవండి
  • ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కమిటీల ఏర్పాటు
  • మెడికల్‌ కాలేజీలో 75 ఐసోలేషన్‌ గదులు సిద్ధం
  • అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం
    కోజీకోడ్‌ : కేరళలో నిఫా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కోజీకోడ్‌లో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. మంగళవారం మరో ఇద్దరికి నిఫా వైరస్‌ నిర్ధరణ కావడం వల్ల పొరుగు జిల్లాలైన కన్నూర్‌, వయనాడ్‌, మలప్పురం జిల్లాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. కోజీకోడ్‌ మెడికల్‌ కాలేజీలో 75 ఐసోలేషన్‌ గదులను సిద్ధం చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. కోజీకోడ్‌ జిల్లాలో ఏడు గ్రామపంచాయతీలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించినట్లు వీణా జార్జ్‌ అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరోగ్య శాఖ బృందం మంగళవారం రాత్రి.. కోజీకోడ్‌లో సమీక్ష నిర్వహించిందని పేర్కొన్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) బృందాలు బుధవారం కేరళకు చేరుకుంటామని అన్నారు. కేరళలో నిఫా వైరస్‌లో కనిపించే వేరియంట్‌.. బంగ్లాదేశ్‌ వేరియంట్‌ అని వీణా జార్జ్‌ పేర్కొన్నారు. ‘కేరళలో కనిపించే నిఫా వైరస్‌ జాతి బంగ్లాదేశ్‌ వేరియంట్‌. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. మరణాల రేటు తక్కువగా ఉంది. ఈ వేరియంట్‌ వ్యాప్తి కూడా తక్కువగానే ఉంది. కంటైన్‌మెంట్‌ జోన్‌లను గుర్తించడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌ గదుల ఏర్పాట్లు వంటి చర్యలు తీసుకుంటున్నాం.’ అని వీణా జార్జ్‌ తెలిపారు. మరోవైపు.. కోజికోడ్‌ పరిధిలోని ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటిస్తూ ఆ జిల్లా కలెక్టర్‌ గీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ఆమె కోరారు.
    కంటైన్‌మెంట్‌ జోన్‌లలో మాస్క్‌లు, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచించారు. కోజీకోడ్‌లో ఇటీవల రెండు అసహజ మరణాలు సంభవించాయి. జ్వర సంబంధిత లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ.. ఆగస్టు 30న ఒకరు, సెప్టెంబరు 11న ఇంకొకరు మరణించారు. నిఫా వైరస్‌ అనుమానంతో బాధితుల నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. తాజాగా వారు ‘నిఫా’తోనే మృతి చెందినట్లు నిర్ధరణ అయ్యింది. మరో ఇద్దరికి వ్యాధి నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. వారికి నిఫా వైరస్‌ సోకినట్లు మంగళవారం తేలింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు