- మూడోసారి కూడా కేసీఆరే సీఎం..
- జోశ్యం చెప్పిన అసదుద్దీన్ ఒవైసీ..
- మేము పోటీచేసే ప్రతిచోటా గెలుస్తాం..
- ఈ సారి రాజస్థాన్ లో కూడా పోటీచేస్తాం..
హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసింది. తెలంగాణ అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ సోమవారం ప్రకటించింది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును డిసెంబరు 3న చేపట్టనున్నట్టు తెలిపింది. ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంపై మజ్లీస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. తాము పోటీచేసే ప్రతి చోటా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ సారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం తొలిసారిగా పోటీ చేయనున్నట్లు ఒవైసీ ప్రకటించారు.