Tuesday, June 18, 2024

సంచార కులాలకు, ఎంబీసీలకు సరైన గుర్తింపును ఇచ్చింది కేసీఆరే..

తప్పక చదవండి
  • తెలంగాణా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
  • స్వర్ణోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చి పాల్గొన్న వీరభద్రీయులు.
  • ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతఙ్ఞతలు తెలిపిన స్వర్ణోత్సవ వేడుక సభ..

హైదరాబాద్ :
అత్యంత వెనుకబడిన వర్గాలు, సంచార కులాలు, జాతులకు ప్రత్యేక గుర్తింపును, ఆత్మగౌరవంను పెంపొందింపజేసిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. కిస్తీలతో సంబంధం లేకుండా ఆర్థిక చేయూత, ప్రవేశ పరీక్షలతో నిమిత్తం లేకుండా ఫూలే పాఠశాలల్లో ప్రవేశాలు, పలు ప్రత్యేక సంక్షేమ పథకాలతో జీవన భరోసాను, భద్రతను నింపిన ముఖ్య మంత్రి కేసీఆర్ కు ఈ వర్గాలు ఋణపడి ఉంటాయని పేర్కొన్నారు. సోమవారం నాడు తెలంగాణ వీరభద్రీయ వీరముష్ఠి సంఘం 50 ఏళ్ళ స్వర్ణోత్సవ వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు కాటేపల్లి వీరాస్వామి సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా వకుళాభరణం, ఆత్మీయ అతిధులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, వివిధ పక్షాలకు చెందిన నాయకులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన సంఘం ప్రతినిధులలో రవీంద్ర భారతి కిటకిటలాడింది. వీరభద్రీయుల సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలతో ప్రాంగణమంతా కోలాహలంగా కనిపించింది. నేత్ర పర్వంగా కొనసాగింది.

ఈ సందర్భంగా జరిగిన సభలో వకుళాభరణం ప్రసంగిస్తూ.. వీరముష్ఠి వారంటే అడుక్కునే వాళ్ళు కాదని, ముష్టి అంటే పిడికిలి అని, ముష్ఠి ఘాతుకాలను రుచి చూపించే వారని, ధీరత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నప్పుడు సభంతా హర్షధ్వానాలతో మారు మోగింది. సంచార కులాలు తమ సాంస్కృతిక కళా రూపాలతో సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమైనవని ఆయన అన్నారు. చిన్నకులము అనే ఆత్మనూన్యతా భావంతో వచ్చే అవకాశాలను కోల్పోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ శాశ్వత పేదరిక నిర్మూలన కోసం, అంతరాలు లేని వివక్షరహిత సమాజ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కొన్ని డిమాండ్లపై ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది :

  1. మా కులవృత్తి అంతరించిపోయింది కాబట్టి, ప్రస్తుతం జీవనోపాధికి అల్యూమినియం వంట సామాన్లు విక్రయిస్తున్నారు. మా వారి కోసం ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసి కొత్తగా ఎంటర్ప్రీన్యూర్లను ప్రభుత్వం ప్రోత్సహించి పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా సహకరించాలి. 2. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లలో రుణాలకు దరఖాస్తు చేసుకున్న వీరభద్రీయ (వీరముష్ఠి) వారందరికీ రుణాలను మంజూరు చేయాలి. 3. అర్హులైన వీరభద్రీయ (వీరముష్ఠి) వారికి బీసీ, ఎంబీసీ బంధు పథకాలను అమలు చేయాలి. 4. గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష లేకుండా సీట్లు కేటాయించాలి. ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆన్ లైన్ ద్వారా కాకుండా నేరుగా ప్రవేశాలు కల్పించాలి. 5. బీసీ, ఎంబీసీ లలో మా కులానికి ప్రత్యేక గృహ పథకం ద్వారా ఇళ్లు కట్టించి ఇవ్వాలి. 6. రాష్ట్రంలోని అన్ని మండలాలు, జిల్లాలో వీరభద్రీయ(వీరముష్ఠి) సంఘం భవనాల కోసం 10 గుంటల స్థలం కేటాయించి, నిర్మించాలి. 7. ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయలేని వీరభద్రీయ (వీరముష్ఠి) కుల సభ్యులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. 8. వీరభద్రీయ(వీరముష్ఠి) సంఘానికి 2010లో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 2 ఎకరాల స్థలం కేటాయించారు. కానీ, ఇంకా కేటాయింపు జరగలేదు. స్థలం చూపించి కార్యాలయ భవనం, హాస్టల్ వసతి కల్పిస్తూ నిర్మించగలరని మనవి. 9. అన్ని మండలాలలో వీరభద్రీయ (వీరముష్ఠి) పేరుతో ధృవీకరణ పత్రాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మా కులంలో సాంస్కృతిక కళాకారులు ఉన్నారు. మా వారి కోసం ప్రత్యేక సాంస్కృతిక, సంగీత అకాడమీ ఏర్పాటు చేయాలి. కళాకారుల కోసం పింఛన్ సౌకర్యం కల్పించాలి.

ఈ కార్యక్రమంలో జాతీయ వీరభద్రీయ వీరముష్ఠి సంఘం అధ్యక్షులు కాటపల్లి రాజేశ్వర రావు, ప్రధాన కార్యదర్శులు చెవ్వ కొండయ్య, కళ్యాణి, క్రాంతి కుమార్, కార్యదర్శి పాన్నాల శివరాజ్, కోశాధికారి కాటపల్లి గండిస్వామి, వీరభద్రీయ వీరముష్ఠి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కాటపల్లి రాజేశ్వర రావు, వైస్ ఛైర్మన్ చెవ్వ విజయచందర్, ప్రధాన కార్యదర్శి చెవ్వ శ్రీనివాస్, కార్యదర్శి కాటపల్లి ఎల్లేష్, కోశాధికారి కాటపల్లి శ్రీశైలం, వీరభద్రీయ వీరముష్ఠి విద్యా కమిటి ఛైర్మన్ కాటపల్లి విఠల్ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు