Saturday, May 4, 2024

మాస్ లీడర్ మార్పు వెనుక మర్మమేంటి..?!

తప్పక చదవండి
  • తెలంగాణలో సీఎం పీఠమే లక్ష్యమని చెప్పిన బీజేపీ..
  • ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండిని ఎందుకు మార్చింది..
  • కేంద్రంలో అధికారమే ముఖ్యమని లక్ష్మణ్ ఎందుకంటున్నారు..
  • కిషన్ రెడ్డి నియామకం బీజేపీ హైకమాండ్ తప్పిదం కానుందా..
  • లిక్కర్ కేసులో సీఎం కూతురు అరెస్టు కాకపోవడానికి కారణమేంటి..?

కర్ణాటకలో ఊహించని ఎదురుదెబ్బ తగలగానే బీజేపీ అధిష్టానం దేశంలో పలు కీలక నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరిగే 6 రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉంది. దీంతో హుటాహుటిగా తెలంగాణ, ఏపీలలో బీజేపీ పార్టీ అధ్యక్షులను ఎవరూ ఊహించని విధంగా మార్చేసింది.

బీజేపీ అధిష్టానం రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల మార్పు నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైనది.. ఈ నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత రానప్పటికీ.. తెలంగాణలో మాత్రం మాస్ లీడర్ బండి సంజయ్ ను మార్చడంపై క్యాడర్ లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.. బండి సంజయ్ ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే చాన్స్ ఉన్నప్పటికీ… క్యాడర్ లో మాత్రం అనుమాలు పోవడంలేదు. బీజేపీలోని ఒకరిద్దరు నేతలకు నచ్చనంత మాత్రాన బండి సంజయ్ ని అధ్యక్ష భాద్యతల నుండి ఎలా తప్పిస్తారంటూ నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికే ప్రశ్నలు సంధిస్తున్నారు. బండి సంజయ్ మార్పును ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి..

- Advertisement -

బండి సంజయ్ ప్రస్థానం :
బండి సంజయ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే… కీ.శే. బండి నర్సయ్య, శకుంతల దంపతులకు 11-7-1971న జన్మించిన ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య బండి అపర్ణ ఎస్‌బిఐ ఉద్యోగిని కాగా పిల్లలు సాయి భగీరత్, సాయి సుముఖ్ చదువుకుంటున్నారు. బండి సంజయ్ కుమార్.. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా ఉన్న ఆయన అనతికాలంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో (ఏబీవీపీ ) చేరి అంచలంచలుగా ఎదిగారు. ఏబీవీపీ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు.. ఆ తరువాత పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసి మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో 1994 నుండి 1999 వరకు, 1999 నుండి 2003 వరకు రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా సేవలు అందించారు. బిజెపి జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గా, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా , రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా కూడా అయన బాధ్యతలు చేపట్టారు. ఎల్.కె అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జిగానూ ఉన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్‌గా గెలిచారు. అదే 48వ డివిజన్ నుండి రెండవసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు నగర బిజెపి అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్… 2014 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ.. 52,000 వేలపై చిలుకు ఓట్లు సాధించి తన ఉనికిని చాటుకున్నారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓటమి చవిచూసినప్పటికీ.. 66,009 ఓట్లతో మరోసారి తన ప్రభావాన్ని చూపించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు పొందిన వారిలో బండి సంజయ్ ప్రథమ స్థానంలో నిలిచారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన అనంతరం అవకాశం చిక్కిన ప్రతీసారి తెలంగాణ సర్కార్‌పై వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. అధిష్టానం కంట్లో పడ్డారు. అంతే కాకుండా యువతలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. బండి సంజయ్ సేవలను గుర్తించిన బీజేపి అధిష్టానం.. చివరకు తెలంగాణ బీజేపికి ఆయన్నే పెద్దదిక్కుగా గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.

జీ హెచ్ ఎం సీ ఎన్నికలు బండి విజయానికి మచ్చుతునకలు :
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం జీ హెచ్ ఎం సీ ఎన్నికల్లో బీజేపీ గతంలో 2 స్థానాలకే పరిమితమయ్యింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టాక 50 సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంది. ఇంకా హుజురాబాద్, దుబ్బాక అసెంబ్లీ స్థానాలు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నపుడే బీజేపీ కైవసం చేసుకుంది.
మంచి వక్తగా కార్యకర్తల్లో నూతనోత్సహం నింపిన గొప్ప నాయకుడిగా బండి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ
బీజేపీని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయించిన ఘనత బండి సంజయ్ దేనని చెప్పవచ్చు. రాష్ట్రంలోని బీజేపీలో గట్టిపట్టు సాధించిన బండికి రాష్ట్రంలోని పలు సమస్యలపై చక్కటి అవగాహన ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పర్యటనలు, పలు సమావేశాలు, కార్యక్రమాలు బండి సంజయ్ ని నాయకులకు, కార్యకర్తలకు చేరువ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ బండి మార్పుపై తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ కొన్ని ప్రాంతాలకే పరిమతమయిన రోజుల్లో బీజేపీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన జవసత్వాలను నిదురలేపి అధికార బి ఆర్ ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టిన బలమైన హిందుత్వ వాదిగా.. ఒక శక్తిగా బీజేపీ కార్యకర్తలకు ఒక దైర్యంగా బండి నిలుచున్నారు. అటువంటి బండిని తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. కిషన్ రెడ్డిని నియమించడం బీజేపీ హైకమాండ్ చేసిన పొరపాటు అవ్వగలదనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ తెలంగాణలో బీజేపీని బండి సంజయ్ ముందుండి నడిపించారనీ.. పార్టీకి చాలా ఊపు తెచ్చారనీ.. కిషన్ రెడ్డి అలా చెయ్యలేరనే అభిప్రాయం వినబడుతుంది. ముఖ్యంగా బండి సంజయ్.. ఓ వర్గం వారిని చైతన్య పరచడంలో బాగా పనిచేసేవారనీ.. కిషన్ రెడ్డి అలా చేయలేకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.

బీజేపీ అధ్యక్షుల మార్పు కాంగ్రెస్‌కి కలిసొచ్చిందా..?
ఈ నిర్ణయం ప్రధానంగా కాంగ్రెస్‌కి కలిసొచ్చేలా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆల్రెడీ, బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం జరుగుతుంది. . ఇప్పుడు ఆ ప్రచారానికి మేలు చేకూర్చేలా కమలదళం నిర్ణయం ఉందని అంటున్నారు. మార్పును తనకు అనుకూల అస్త్రంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. లిక్కర్ కేసులో సీఎం కూతురు కవిత అరెస్టు కాకపోవడానికి ప్రధాన కారణం.. బీఆర్ఎస్ – మధ్య ఉన్న రహస్య ఒప్పందమే అని కాంగ్రెస్ ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టింది. తాజాగా బీఆర్ఎస్‌కి మేలు చేసేందుకే బండి సంజయ్‌ని మార్చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తమకే వచ్చేలా చేసుకోవాలని కాంగ్రెస్ రెడీ అవుతోంది.

సీనియర్ నేతల్ని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్న కాంగ్రేస్ :
బీజేపీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతల్ని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి వంటి వారిని ఆహ్వానించాలనుకుంటోంది. ఇలా చేయడం ద్వారా.. తెలంగాణలో కమలం పూర్తిగా వాడిపోయేలా చెయ్యాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో బీజేపీ క్యాడర్ నీరుగారిపోయింది. బండి సంజయ్ ఉన్నారన్న ధైర్యం ఇన్నాళ్లూ వారిని నడిపించింది. ఇప్పుడు ఆయన్ని తప్పించడంతో… క్యాడర్‌ చెల్లాచెదురయ్యే అవకాశం ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకుంటూ… బీజేపీ క్యాడర్‌ను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం బీజేపీలోని చాలా మంది నేతలు, కార్యకర్తలు కూడా.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వారికి కాంగ్రెస్ ఆశాదీపంగా కనిపిస్తోంది. మొన్ననే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన కాంగ్రెస్.. ఫుల్ జోష్‌లో ఉంది. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ముఖచిత్రం కనిపిస్తోంది. బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అనే నినాదాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే.. అంతగా తమకు కలిసొస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆ దిశగానే నెక్ట్స్ స్టెప్స్ వెయ్యబోతున్నారు. ఈ ప్రచారానికి కిషన్ రెడ్డి ఎలా బ్రేకులు వేస్తారన్నది ఆయన ముందున్న అతిపెద్ద సవాలు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు