Thursday, May 16, 2024

ముంబై వేదికగా ఇండియా కూటమి భేటీ

తప్పక చదవండి
  • హాజరైన విపక్ష పార్టీల నేతలు..
  • మోడీని ఢీకొనడమే లక్ష్యంగా చర్చలు..
  • నేడు జరుగబోయే సమావేశంలో
    వెలువడనున్న మరిన్ని విశేషాలు..

ముంబై : మోదీ సర్కార్‌ని ఢీకొట్టేందుకు దాదాపు 26 పార్టీలు ఒక్కటై ఏర్పడ్డ ఇండియా కూటమి నేతలు గురువారం ముంబైలో మరోమారు భేటీ అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన ఈ కూటమి…ఇప్పుడు ముంబయిలో సమావేశమయ్యింది. ఎన్డీఎను దెబ్బతీసే అంశాలపై నేతలు చర్చించారని సమాచారం. ప్రధానంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపైనే సచ్చ సాగిందని తెలుస్తోంది.. కూటమి ఏర్పాటైనప్ప టికీ ఇంత వరకూ ఎవరు దీన్ని లీడ్‌ చేస్తారన్నది మాత్రం ప్రకటించలేదు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతు న్నాయి. ఈ ముంబయి భేటీతో ఈ విషయంలో స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ భేటీకి నేతలంతా హాజరయ్యారు. ముంబయిలో పలు చోట్ల హోర్డింగ్‌లు, ప్లెక్సీలు అందంగా కనిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ వద్ద కాషాయ జెండాలు ఏర్పాటు చేయించింది ఉద్దవ్‌ థాక్రే సేన. ’హిందుత్వమే మా అజెండా. ఇండియాలో ఉండే వాళ్లందరూ హిందువులే’ అని వాదిస్తోంది ఆ పార్టీ. ఈ రెండురోజుల సమావేశాల్లో సీట్‌ షేరింగ్‌ విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ కమిటీలో ఎలాంటి విభేదాలు రాకుండా కో ఆర్డినేట్‌ చేసేందుకు ప్రత్యేకంగా ఓ కో ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 11 మంది సభ్యులుంటారు. ఇకపోతే ఇండియా కూటమి ఎలా ఉన్నా అందరి దృష్టి తదుపరి ప్రధాని ఎవరన్నదానిపై ఉంది. సమావేశంలో సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే,రాహుల్‌, సీతారామ్‌ ఏచూరి, మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌, స్టాలిన తదితరులు హాజరయ్యారు. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దాదాపు 28 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ప్రతిపక్ష పార్టీల ఓట్లు గంపగుత్తగా కలిస్తే ఎన్డీయే అభ్యర్థులకు ఓటమి తప్పదని కొందరు ఢంకా బజాయించి చెప్తున్నారు. అదేవిధంగా భారత్‌ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గ్రాఫ్‌ బాగా పెరగడం కూడా దీనికి దోహదపడుతుందని అంటున్నారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో పెరిగిన ఉత్సాహం, సామాన్యులను వేధిస్తున్న ధరలు, అదానీ – మోదీ సంబందాలు వంటివన్నీ మోదీని మూడోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టకుండా అడ్డుకుంటాయని చెప్తున్నారు. కొత్తగా ఏర్పాటైన ఇండియాకూటమి వల్ల ఎన్డీయేకు ముప్పు లేదని బిజెపి భావిస్తోంది. ఓటర్ల ధోరణిలో చెప్పుకోదగ్గ మార్పు రాకపోతే ఇండియా విజయం సాధించడం జరగని పని అని సర్వేలు చెబుతున్నాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేతోపాటు వేర్వేరు పార్టీలకు లభించిన ఓట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం, 2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 38.5 శాతం ఓట్లు, ప్రస్తుత ఇండియా కూటమిలోని పార్టీలకు 38 శాతం ఓట్లు లభించాయి. అయితే ఎన్డీయేకు ఉత్తర భారతంలో ఎక్కువ ఓట్లు లభించగా, మిగిలిన పార్టీలకు దేశవ్యాప్తంగా ఈ ఓట్లు లభించాయి. ఒకే చోట ఎక్కువ ఓట్లు లభించే అవకాశాలు ఉండటంతో ఎన్డీయేకు ఎక్కువ స్థానాలు లభిస్తున్నాయి. 2024లో కూడా ఇదే పునరావృతమయ్యే అవకాశం ఉంది. మొత్తం లోక్‌ సభ నియోజకవర్గాలు 543 కాగా, వీటిలో 224 స్థానాల్లో ఎన్డీయే ఓట్‌ షేర్‌ 50 శాతం వరకు ఉంది. ఎన్డీయే అభ్యర్థితో ఒకే ఒక ఇండియా అభ్యర్థి పోటీ చేయడం వల్ల ఇండియా కూటమి అభ్యర్థి తప్పనిసరిగా గెలుస్తారనే విశ్లేషణలు సరికాదని ఈ నివేదిక అంచనా వేసింది. ఎన్డీయే వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఏకీకృతమయ్యే అవకాశం కేవలం 17 లోక్‌ సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఉందని తెలిపింది. దీనివల్ల ఎన్డీయే స్థానాలు 330 నుంచి 313కు తగ్గుతాయని అంచనా వేసింది.

కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 272 మంది ఎంపీలు అవసరమవుతారు. ఎన్డీయే వ్యతిరేక ఓట్లలో రెండు శాతం ఓట్లు ఇండియా కూటమికి వెళ్లినా, ఎన్డీయే కోల్పోయే స్థానాలు 28 మాత్రమేనని ఈ నివేదిక అంచనా వేసింది. ఈ పరిస్థితిలోనైనా ఎన్డీయేకు దాదాపు 285 స్థానాలు లభిస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుందని తెలిపింది. ప్రస్తుతం ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత చెప్పుకోదగిన స్థాయిలో లేదని తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు