ఇబ్రహీంపట్నం : వెంచర్ల ఏర్పాటు చేయాలంటే అక్కడ, దానికి సమీపంలో కుంటలు, చెరువులు, పాటు కాల్వలు ఉండకూడదు. కానీ రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు కళ్లు మూసుకుని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ధ్రువపత్రాలు, ఎన్వోసీలు జారీ చేస్తున్నారు. ఇంకేముంది స్థిరాస్తి వ్యాపారులు బఫర్ జోన్లో స్థలాలు ఏర్పాటు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అవగాహన లేక కొనుగోలు చేసినవారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. కన్జర్వేషన్ జోన్ లలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. నిబంధనల ప్రకారం ఎలాంటి గృహ నిర్మాణాల లే ఔట్లు నిర్మించడానికి వీలు లేదు. అయినా ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ వెంచర్ నిర్మిస్తున్నారు కొందరు రియల్టర్లు. ఔటర్ రింగు రోడ్డు బొంగులుర్ కి అతి సమీపంలో ఇబ్రహీంపట్నం మండలం లో ఆ అక్రమ వెంచర్లు నిలుస్తున్నాయి. హెచ్‌ఎండిఎ నామ్స్ ప్రకారం కనెక్టింగ్ రోడ్లు 40 ఫీట్ల వెడల్పు , ఇంటర్నల్ రోడ్లు 33 ఫీట్లు ఉండాలి. కానీ అనుక్కున్నదే తడవుగా లే అవుట్ చేసి , లాభాలు చూసుకొని అమ్మేయాలనే దుర్బుద్ధి తో చకా చకా వెంచర్ నిర్మాణ పనులు మొదలెట్టారు. ఎవరికీ కనిపించకుండా భూమి చుట్టూ ప్రహరీ గోడను ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభిస్తున్నారు. మొత్తం భూమిని చదను చేసి రోడ్లు వేశారు. అంతే కాకుండా ఆ వెంచర్ దాదాపు బఫర్ జోన్ లో ఉందని పక్కనేఉన్న రైతులు చెబుతున్నారు. కుంటలోని నీరు వెంచర్లోకి రాకుండా టిప్పర్లలో మట్టి తో పూడ్చుతున్నారు. ఆ వెంచర్ డవలప్మెంట్ లో భాగంగా అంతర్గత మురుగు నీటి కాల్వల పనులు మొదలు పెట్టారు. ఇంతా జరుగుతున్నా ఆ వెంచర్ వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి కూడా చూడడం లేదు. అక్రమ వెంచర్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి…..
ప్రభుత్వ నిబంధనలకు పాతర… ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వమే ఆయుధంగా అక్రమార్కులు తాము అనుకున్న పనిని సులువుగా పూర్తి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ధనార్జనే ధ్యేయంగా పనిచేసే రియాల్టర్లు యథేచ్ఛగా పని పూర్తి చేసుకుంటున్నారు. ఎవరైనా ఈ అక్రమ నిర్మాణాలపై ప్రశ్నిస్తే ఈ ప్రాంతంలో ఇదంతా కామన్ అనే విధంగా సమాధానాలు చెప్పడం విడ్డూరం. పైగా తమ నిర్మాణాలను ఎవరు ఆపలేరని తమ పని తాము పూర్తి చేసుకుని వెళ్తామనీ రియల్టర్లు చెప్పడం ఇక్కడ విస్తుపోయే అంశం. అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడంతో ఇదే అదునుగా అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. ప్రధాన రహదారి పక్కనే పెద్ద ఎత్తున వెంచర్ నిర్మాణ పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….అనుమతులు లేకుండా నడుస్తున్న అక్రమ వెంచర్ వ్యవహారంపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు. చర్యలు తీసుకోవడం మాట పక్కన పెట్టి కొందరు అధికారులు సదరు వెంచర్ నిర్వాహకులకు సహకరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ ఎటువంటి నిర్మాణ పనులకు అనుమతులు లేకున్నా ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో దర్జాగా వెంచర్ నిర్మాణ పనులు సాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు..
తప్పక చదవండి
-Advertisement-