Tuesday, June 18, 2024

అనారోగ్యంతో ఆరోగ్య కేంద్రాలు…

తప్పక చదవండి
 • కాగితాల పైనే ఉన్నతి – సేవలతో అధోగతి..
 • పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రుల దయనీయ పరిస్థితి…
 • 5 యేళ్లు గా కరంటు బిల్లులు కట్టకపాయే
 • డాక్టర్లు లేక, వైద్యం అందక ప్రయివేటును ఆశ్రయిస్తున్న ప్రజలు…
  పాలేరు : ఆపద వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సమయానికి డాక్టర్లు అందుబాటులో లేక ప్రయివేటు వైద్యాన్ని ప్రజలు ఆశ్రయిస్తున్న ఘటనలు ఓ వైపు ఉంటే, కాగితాలపై వచ్చిన ఆసుపత్రుల హోదా పెంపు ఉత్తర్వులను చూపించి అధికార పార్టీ చేస్తున్న పాలాభిషేకాల హడావుడిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.. ఈ నెల 3న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమీషనర్ ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం ఆగస్టు 8న తెలంగాణ ప్రభుత్వం పాలేరు నియోజక వర్గంలోని తిరుమలాయపాలెం 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఏరియా ఆసుపత్రి గా మార్చేందుకు ఆదేశాలు ఇవ్వటమే కాకుండా, సివిల్ పనులు, అవసరమైన పరికరాల కొనుగోలుకై 26 కోట్లను కేటాయించింది.. ఇదే విషయమై స్థానిక శాసనసభ్యులు కందాల కూడా అసెంబ్లీలో ఈ నెల 6న విజ్ఞప్తి కూడా చేశారు… దీంతో పాలేరు నియోజకవర్గంలోని ముఖ్యమైన అధికార బిఆరెస్ నాయకులందరూ తిరుమలాయపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఇటీవల సందర్శించి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపటమే కాకుండా, అధినేతలకు పాలాభిషేకాలు నిర్వహించారు… ఇదే విషయమై నియోజకవర్గంలోని పలువురు ప్రజా సంఘాలు, ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. గత నాలుగేళ్లుగా ఎలాంటి సౌకర్యాలను కల్పించని అధికార పార్టీ కేవలం అప్ గ్రేడ్ ఉత్తర్వులతోనే ప్రజల సమస్యలు తీరి పోయినట్లు హడావుడి చేస్తుండటాన్ని ఆక్షేపిస్తున్నారు… వాస్తవానికి నియోజకవర్గంలోని నేలకొండపల్లి, తిరుమలాయపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోకి మార్చుతూ 2022 ఏప్రిల్ నెలలోనే నిర్ణయం తీసుకుంది.. అంతకు ముందు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో 30 పడకలకు సరిపడా మౌలిక సదుపాయాలను, సరిపడా డాక్టర్లను, సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించిన పరిస్థితి లేదు.. అయినా ప్రభుత్వం మంచి ఉద్దేశ్యం, ప్రజారోగ్యం పై విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలోని 60 ఆసుపత్రులలో పాటు, నియోజకవర్గంలో రెండు ఆసుపత్రులకు ఉన్నతి కల్పించింది.. అయితే ఈ అప్ గ్రేడ్ కేవలం కాగితాలకే పరిమితమైనదని చెప్పవచ్చు… ఓ ఆసుపత్రిని అభివృద్ధి చేసే క్రమంలో సరియైన వసతులు తో పాటు, రోగుల కనుగుణంగా డాక్టర్లను, వారికి సరిపడా సిబ్బందిని, అవసరమైన పరికరాలను సమకూర్చాల్సి ఉంటుంది.. అయితే పేరుకు పెద్దాసుపత్రులుగా మారినా కూడా ఈ రెండు ఆసుపత్రులకు బాలారిష్టాలు తీరలేదు… ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల కంటే హీనంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులు ఉన్నాయి.. ముఖ్యంగా హాస్పిటల్స్ లో డాక్టర్ల ను నియమించేలా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలను చేయలేదు.. ఉన్న అరకొర సిబ్బందితోనే ఒక్కరో, ఇద్దరో డాక్టర్లు వైద్యాన్ని నెట్టుకుని వస్తున్నారు.. అత్యవసర సమయాలలో ప్రాధమిక చికిత్స చేసేందుకు కూడా ఒక్కోసారి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రవేటు ఆసుపత్రులు లేదా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితులే అధికంగా ఉన్నాయి… అంతే కాకుండా సామాజిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి మండలి చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యే ఉన్నా ఆసుపత్రుల సేవలలో ఎలాంటి మార్పులు చెందక పోవటంతో ప్రజలు ఈసుడోమంటూ ప్రయివేటు సంస్థలను ఆశ్రయిస్తున్నారు.. గత పిహెచ్సీ లను సామాజిక ఆరోగ్య కేంద్రాలు రూపాంతరం చెందిన గడిచిన 18 నెలలలో నేలకొండపల్లి, తిరుమలాయపాలెం ఆసుపత్రుల అభివృద్ధికి సరియైన పూర్తిస్థాయి సమావేశం జరగలేదంటే అతిశయోక్తి కాదు.. దీంతో ప్రతి రోజూ 150 నుండి 200 వందలకు పైగా అవుట్ పేషంట్స్ వచ్చే ఈ ఆరోగ్య కేంద్రాలపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు.. అంతే కాకుండా అత్యవసర సమయాలలో డాక్టర్లు అందుబాటులో లేక సిబ్బంది కూడా వైద్యం చేయాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు.. దీంతో పాటు ఆసుపత్రుల పరిసరాలు శానిటేషన్ పై కూడా పూర్తిస్థాయి సిబ్బంది లేమి ప్రభావం పడ్తుంది… దీంతో ఆసుపత్రుల స్థాయి పెరిగిందని సంతోషపడాలో, పేదోనికి వైద్యం అందని ద్రాక్ష అయ్యిందని ఏడవాలో ప్రజలకు అర్ధం కావట్లేదు…
  తీవ్రమైన డాక్టర్ల కొరత :
  సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా అభివృద్ధి చేసిన కేంద్రాలలో డాక్టర్ల కొరత అటు ప్రభుత్వాన్ని, ప్రజలను వేధిస్తోంది.. ఎన్నిసార్లు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు విన్నపాలు చేసినా పట్టించుకున్న నాధుడు లేదు… అంతే కాక అత్యవసర సమయాలలో ప్రాణాలు గాలిలో కలిసిన సందర్భాలు అనేకం.. అయినా ఉన్నతాధికారులు నుండి మాత్రం డాక్టర్లు, సిబ్బంది నియామక నమూనా ఇంకా పూర్తి కాలేదనే సమాధానం సర్వరోగ నివారిణి అయ్యింది… సాధారణంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం 15 మంది డాక్టర్లు సేవాలందించాల్సి ఉండగా, ఈ రెండు కేంద్రాలలో ఒక్కరు లేదా ఇద్దరు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు… ఇక గైనకాలజీ (2), పెడిట్రియాషిన్ (2), అనస్థీషియా (2), జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, డెంటల్, కంటి వైద్య నిపుణులతో పాటు పోస్టుమార్టం చేసేందుకు కూడా నిపుణులను నియమించాల్సి ఉండగా అరకొర మంది మాత్రమే ప్రజల ప్రజారోగ్య సేవలలో ఉంటున్నారు.. ఇంతమంది డాక్టర్లకు సరియైన సబ్ స్టాఫ్ నియామకాలు ఇక కల గానే మిగుల్తున్నాయి…
  విద్యుత్ బకాయిలు రూ. 12 లక్షలు :
  నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం కు సంబంధించిన విద్యుత్ బకాయిలు ఈ ఆగస్టు నాటికి 12 లక్షలు పేరుకు పోయాయి.. ఆసుపత్రికి చెందిన కరంటు సర్వీస్ పై చివరి సారిగా 2019 లో బిల్లు చెల్లించి నట్లు విద్యుత్ శాఖ రికార్డులు తెలుపుతున్నాయి.. దీంతో ఈ మధ్య కాలంలో విద్యుత్ నిలిపి వేసేందుకు సిద్ధమవగా స్థానిక వైద్యుల చొరవతో అధికారులు తమ చర్యలను విరమించుకున్నట్లు తెలుస్తుంది.. కరెంట్ సప్లయ్ లేకపోతే రోజువారీ ఆసుపత్రి కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడనుంది.. అంతేకాక విలువైన టీకాలు, ఇంజక్షన్స్ కూడా పాడయిపోయే ప్రమాదం ఏర్పడనుంది.. దీంతో కోట్లాది రూపాయలు కాగితాలపై నిధులను చూపించే యంత్రాంగం దృష్టి పెట్టాలి.. దీంతో పేరుకే పెద్దాసుపత్రులుగా కాగితాలపై ఉండి ప్రయోజనమేమిటని ప్రజలు, కాగితాలపై చెక్కిన అక్షరాలు ప్రజారోగ్యాన్ని మెరుగు పర్చలేవని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి… అన్ని రకాల మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బందిని నియమించి సంబరాలు చేసుకుంటే ప్రజలు హర్షిస్తారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.. ఇకనైనా పాలకులు పేరు, హోదా ల కంటే మెరుగైన వైద్యం ప్రజలకు అందేలా దృష్టి సారించాలని వేడుకుంటున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు