Friday, May 3, 2024

డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘించిన మహిళలకు కఠిన శిక్షలు

తప్పక చదవండి

టెహ్రాన్‌ : డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిన మహిళలు, బాలికల విషయంలో జైలు శిక్షలు, జరిమానాలను పెంచే వివాదాస్పద బిల్లుకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అనుచితంగా దుస్తులు ధరించిన వారు ఈ చట్టం ప్రకారం గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటారు. ఈ చట్టం అమలు తీరును, ఫలితాలను మూడేళ్లపాటు పరిశీలించనున్నారు. అయితే, ఇది చట్టంగా మారాలంటే గార్డియన్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందాలి. ఇరాన్‌లో మహ్సా అవిూని పోలీస్‌ కస్టడీలో మరణించడంపై నిరసనలు చెలరేగిన ఏడాది తర్వాత ఈ బిల్లును తీసుకొచ్చారు. ఆమెను హిజాబ్‌ సరిగా ధరించలేదనే కారణంతో అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవిూని మరణం తరువాత మహిళలు తమ హిజాబ్‌లను గాలిలో ఊపుతూ, తగలబెడుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు.ఈ నిరసనల్లో వందల మంది భద్రతా బలగాల చేతిలో హతమయ్యారని వార్తాకథనాలు వెలువడ్డాయి. నిరసనల తర్వాత దేశంలో జుట్టును వస్త్రంతో కప్పుకోవడం పూర్తిగా మానేసే మహిళలు, బాలికలు పెరుగుతున్నందున మొరాలిటీ పోలీసులు వీధుల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. రియాపై ఆధారపడిన ఇరాన్‌ చట్టం ప్రకారం యుక్తవయస్సుకు పైబడిన మహిళలు, బాలికలు తమ జుట్టును హిజాబ్‌తో కప్పుకోవాలి. శరీర ఆకారాన్ని దాచడానికి పొడవాటి, వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ఈ నిబంధనలు పాటించని వారికి 10 రోజుల నుంచి 2 నెలల వరకు జైలు శిక్ష, 5,000 రియాల్స్‌ నుంచి 5,00,000 రియాల్స్‌ వరకు జరిమానా విధించేవారు. ఇపుడు ఈ శిక్షలు, జరిమానాలు పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ’హిజాబ్‌ అండ్‌ చాస్టిటీ’ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 152 మంది, వ్యతిరేకంగా 34 మంది ఓటు వేశారు. ఈ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా దుస్తులు ధరించిన వ్యక్తులకు ’నాలుగో డిగ్రీ’ శిక్ష విధించనున్నారు. శిక్షాస్మృతి ప్రకారం దోషులకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 3.5 లక్షల నుంచి 7 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. విూడియా, సోషల్‌ నెట్‌వర్క్‌లలో నగ్నత్వాన్ని ప్రోత్సహించడం లేదా హిజాబ్‌ను ఎగతాళి చేయడం, మహిళా డ్రైవర్‌ లేదా ప్రయాణికులు హిజాబ్‌ లేదా తగిన దుస్తులు ధరించకపోతే వాహన యజమానులకు జరిమానాలను కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. విదేశీ లేదా శత్రు ప్రభుత్వాలు, విూడియా లేదా ఇతర సంస్థల సహకారంతో దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించడాన్ని ప్రోత్సహించే ఏ వ్యక్తికైనా 5`10 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించనున్నారు. ఈ బిల్లును ఇప్పుడు మతాధికారులు, న్యాయనిపుణుల సంప్రదాయవాద సంస్థ అయిన ’గార్డియన్‌ కౌన్సిల్‌’ ఆమోదం కోసం పంపనున్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి, షరియాకు విరుద్ధమని భావిస్తే దానిని వీటో చేసే అధికారం కూడా వారికి ఉంది. మరోవైపు, ఈ బిల్లు లింగ వివక్షకు రూపమని, మహిళలు, బాలికలను అణచివేయాలనే ఉద్దేశంతో అధికారులు వ్యవస్థాగత వివక్షతో పరిపాలిస్తున్నట్లు కనిపిస్తోందని ఎనిమిది మంది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు ఇటీవల అభిప్రాయపడ్డారు. ’నిర్దేశిత డ్రెస్‌ కోడ్‌ను స్త్రీలు, బాలికలు పాటించకపోతే ఈ బిల్లు ప్రకారం కఠినమైన శిక్షలు పడతాయి. దీని అమలు హింసాత్మకం కావొచ్చు’ అని వారు తెలిపారు. ’లింగ వివక్ష నిషేధం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, సామాజిక, విద్య, ఆరోగ్య సేవలను పొందే హక్కు సహా ప్రాథమిక హక్కులను ఈ బిల్లు ఉల్లంఘిస్తుంది’ అని వారు విమర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు