Thursday, May 16, 2024

అంగ రంగ వైభవంగా విఠలేశ్వర స్వామి రథోత్సవం..

తప్పక చదవండి

గౌలిగూడ సుల్తాన్‌షాహిలో విఠలేశ్వర స్వామి రథోత్సవం ఊరేగింపు వైభవంగా సాగింది. ఎంతో ప్రసిద్ధి చెందిన జంగల్‌ విఠోబా దేవాలయంలో ప్రతి ఏడు స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు ఘనంగా నిర్వహిస్తారు. గురువారం రాత్రి విఠలేశ్వర, రక్మాబాయి రథోత్సవ ఊరేగింపును భక్తుల జయ, జయ ధ్వానాల మధ్య నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆలయానికి విచ్చేసి స్వామి వారికి పట్టు వస్ర్తాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి వారికి మహాభిషేకం, పూజలు, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి శేషవాహనంపై విఠలేశ్వర, రక్మాబాయి సమేతంగా రథోత్సవం ఊరేగింపు నేత్ర పర్వంగా సాగింది. వేలాది మంది భక్తులు పాల్గొని పాండురంగ స్వామిని కీర్తించారు. సుల్తాన్‌షాహి నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర బడేమియా పెట్రోల్‌ బంక్‌, ఓల్డ్‌ అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌, మున్నాలాల్‌ దవాసాజ్‌ దుకాణం, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ చమాన్‌ల మీదుగా తిరిగి విఠలేశ్వర మందిరానికి చేరుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ చిట్టిబుర్ర, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ జి.శంకర్‌యాదవ్‌, అధ్యక్షుడు వి.కిషన్‌ యాదవ్‌ అతిథులను సత్కరించారు. విఠలేశ్వర స్వామి రథోత్సవం ఊరేగింపు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రిని సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించారని గుర్తు చేశారు. గోషామహల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి నందకిశోర్‌ వ్యాస్‌ బిలాల్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఆర్‌వి మహేందర్‌కుమార్‌, ఎం. ఆనంద్‌కుమార్‌ గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌, నాయకులు పురుషోత్తం రావు, జాంబాగ్‌ కార్పొరేటర్‌ రాకేశ్‌ జైస్వాల్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ జి. శంకర్‌యాదవ్‌, అధ్యక్షుడు వి.కిషన్‌ యాదవ్‌, వి.పాండు యాదవ్‌, పి.మాణిక్‌రావు, రాజు మహారాజ్‌ తదితరులు అతిథులకు ఘన స్వాగతం పలకడంతో పాటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు