- కల్వకుంట్ల ఫ్యామిలీలో రాజుకున్న అగ్గి..
- తెరమరుగైన ఎంపీ సంతోష్ రావు..
- అన్నిట్లో తానై పాలిటిక్స్ నడిపించిన ఘనత..
- ఎందుకు కనిపించడం లేదంటూ కొన్ని వర్గాల్లో ఆందోళన..
- సీఎం కేసీఆర్ కి అన్నీతానై ఆత్మబంధువుగా కొనసాగిన సంతోష్..
- ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు అన్నీ తానై..
- మరి ఎక్కడ చెడింది..? గ్యాప్ ఎందుకొచ్చింది..?
- సంతోష్ చిరునామా చింపే ప్రయత్నంలో నాలుగు స్థంబాల రాజకీయం..!
- ఈ పరిస్థితులు ఏ మలుపు తిరగబోతున్నాయి..?
- కొత్తగా తెరమీదకు వంశీ, కన్నారావులు..
ఆయన లేకపోతే కేసీఆర్ కాలు కిందపెట్టడు.. తన ఆరోగ్య సంరక్షణ బాధ్యత అతనికే అప్పగించారు.. సమయానికి మాత్రలు ఇవ్వడం.. కేసీఆర్ ఆకలిని గుర్తించి భోజన ఏర్పాట్లు చేయడం.. చీమ చిటుక్కుమన్నా పక్కనే వాలిపోవడం.. కేసీఆర్‌కి ఆత్మబంధువుగా ప్రాణానికి ప్రాణంగా నిలిచిన వ్యక్తి.. పొద్దుట నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేసీఆర్‌కి అన్నీ తానై నీడలా కాపాడుకునే వ్యక్తి.. అతను పక్కనుంటే మృత్యువు సైతం తన దరికి చేరదని నమ్మకం ఏర్పరచుకున్నారు కేసీఆర్.. ప్రతి క్షణం తనను అంటిపెట్టుకుని ఉండటానికి, ఎక్కడికి వెళ్లినా తన పక్కనే ఉండేలా, ఎలాంటి ప్రోటోకాల్ సమస్య రాకుండా అతడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు.. దీంతో అటు సెక్యూరిటీ, ఇటు అధికార వర్గాల నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకున్నారు.. సీఎం కేసీఆర్ తనకు కల్పించిన ఈ అపూర్వ అవకాశాన్ని ఆ వ్యక్తి పరిపూర్ణంగా వినియోగించుకున్నాడు. ఎంతలా అంటే షాడో సీఎం స్థాయిలో చక్రం తిప్పేంతగా.. ఇప్పటికే మీకు అర్ధం అయివుంటుంది ఆ వ్యక్తి ఎవరు అన్నది.. అతనే ఎంపీ (రాజ్యసభ) జోగినపల్లి సంతోష్ కుమార్.. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో తెరమరుగయ్యారు.. దీనికి కారణాలు ఏంటి..? అనే క్రమంలో విషయ పరిశోధన చేస్తే విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి..
హైదరాబాద్ ; జోగినపల్లి సంతోష్ కుమార్.. ఈ పేరు తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారుండరు.. సీఎం కేసీఆర్ కి కొడుకు వరస అవుతాడు.. మంచి శ్పురద్రూపి.. సేవాగుణం కలిగిన వాడు.. మరీ ముఖ్యంగా కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగే వ్యక్తి.. సంతోష్ తన పక్కన ఉన్నాడంటే చాలు కొండంత ధైర్యంగా ఉండేవారు కేసీఆర్.. ఏ క్షణం ఆయనకు ఏది అవసరమో అడక్కుండానే క్షణాల్లో అందించేవారు సంతోష్.. ఎప్పటికీ తనను అంటిపెట్టుకుని ఉండటానికి ఎలాంటి ప్రోటోకాల్ సమస్యలు ఎదురుకాకుండా అతనికి రాజ్యసభ సభ్యత్వం కల్పించి ఎంపీని చేశారు కేసీఆర్.. సంతోష్ కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజకీయ రంగంలోని కొన్నివర్గాలు, కొందరు అధికారులు, వ్యాపారవేత్తలు సంతోష్ ని మంచిచేసుకునే క్రమంలో అతనితో సన్నిహితంగా మెలిగేవారు.. అతని ద్వారా తమ పనులను నెరవేర్చుకునేవారు.. వారంతా సంతోష్ కనుసన్నలలో మెలుగుతూ ఆయన పనులన్నీ చక్కబెట్టేవారు.. దీంతో సంతోష్ కి ఒక ప్రత్యేక వర్గం ఏర్పడిరది.. టి.ఆర్.ఎస్. పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా సంతోష్ తనకు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని తనకనుగుణంగా వినియోగించుకున్నారు.. పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు తానే ముందుండి చూసుకునేవారు.. ఆర్ధిక వ్యవహారాలు సైతం ఆయనే చక్కబెట్టేవారనే విషయం కూడా పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతుండేవి.. ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్నా అందులో సంతోష్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది అనేది పార్టీ వర్గాల బోగట్టా.. కేసీఆర్ కోటరీలో కీలకంగా వ్యవహరించే కేసీఆర్ తనయుడు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావు కూడా తీసుకోలేని కీలక నిర్ణయాలను సైతం సంతోష్ కుమార్ అలవోకగా తీసుకునేవాడనేది జగమెరిగిన సత్యం.. అధినేత కేసీఆర్ తో ఏ విషయమైనా చెప్పి ఒప్పించడానికి కేవలం ఒక్క సంతోష్ కుమార్ తోనే సాధ్యం అవుతుందనే నమ్మకం పార్టీలోని అన్ని స్థాయిల నాయకులకు ఉండేది.. ఈ వ్యవహారం కొంత విమర్శలకు సైతం దారితీసింది.. కేటీఆర్, కవిత, హరీష్ లాంటి వాళ్లకి సంతోష్ వ్యవహారం కొంత కంటికింపుగా ఉండేది.. ఇతిమిద్దంగా వారు ఎప్పుడూ బయటపడకపోయినా లోలోపల ఆందోళనకు గురైయ్యేవారని వారి సన్నిహితులు వాపోతుండేవారు..

కాగా జోగినపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి 2018, మార్చి 23న రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన టీ న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ దినపత్రికకు కీలక భాద్యతల్లో పోషించారు.. సంతోష్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. జోగినపల్లి సంతోష్ కుమార్ 1976, డిసెంబరు 7న రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం, కొదురుపాక గ్రామంలో జోగినపల్లి రవీందర్ రావు, శశికళ దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు కొదురుపాకలో పూర్తి చేసి, ఉన్నత చదువులకు హైదరాబాదు వచ్చాడు. సంతోష్ కుమార్ పుణెలోని యూనివర్సిటీ అఫ్ పూణే నుండే ఎంబీఏ పూర్తి చేశాడు.. సంతోష్ కుమార్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పీఏగా పనిచేశాడు. సంతోష్ కుమార్ 2018లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2019 జూన్ నెలలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభలో టిఆర్‌ఎస్ విప్ గా సంతోష్ కుమార్ నియమితులయ్యాడు.
కాగా దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అనే ముఖ్య ఉద్దేశంతో 2018, జూలై 17న జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’’లో భాగంగా సంతోష్ కుమార్ మేడ్చల్ జిల్లాలోని 2,042 ఎకరాల్లోని కీసర రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నాడు. ఆయన చేప్పట్టిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల్లో మంచి స్పందన వచ్చింది. రాజకీయ నాయకులు, సినీతారలు, వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో ‘‘వృక్ష వేదం’’ పుస్తకాన్ని రూపొందించారుడు. ఈ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించాడు.. ఈ పుస్తకంలో వేదాల్లో అడవులు, చెట్లకు సంబంధించిన ప్రస్తావనలను తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రచురించాడు..
కాగా జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రాభల్యం రోజు రోజుకూ పెరిగిపోతుండటం జీర్ణించుకోలేని ముఖ్య నాయకులు అతనికి ఎలాగైనా చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే అధినేత కేసీఆర్ కి పరోక్షంగా, కొన్నిసార్లు ప్రత్యక్షంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.. ముందు వారి మాటలను తేలిగ్గా తీసుకున్న కేసీఆర్ ఆ తర్వాతి కాలంలో పరిస్థితులు తన చేయిజారిపోతున్నాయని గ్రహించి.. తన ఆలోచనలను, అభిప్రాయాలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది.. ఒక్క సంతోష్ కోసం మిగతావారికి దూరం కావడం, పార్టీకి తన మనుగడకు ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. సంతోష్ ప్రాబల్యాన్ని కొంచెం కొంచెంగా తగ్గించే ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.. అందుకే సంతోష్ కి ప్రాదాన్యత ఇవ్వడం తగ్గించేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.. కేటీఆర్, కవిత, హరీష్, ఇప్పుడు కొత్తగా తెరమీదకు వచ్చిన మహారాష్ట్ర బీ.ఆర్.ఎస్. పార్టీ ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన వంశీ, కన్నారావు లాంటి వారితో బాటు ఇప్పటికే తనకంటూ ఒక బలమైన వర్గం నిర్మించుకున్న జోగినపల్లి సంతోష్ కుమార్ లు ఎవరికీ వారు తమ వర్గాలని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగిపోతుండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.. ఈ క్రమంలో కేసీఆర్ ఎలాంటి పొరబాటు అడుగు వేసినా పార్టీ చీలి ముక్కలైపోతుందనే ఆందోళన అధినేతతో ఏర్పడిరది.. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒక్క సంతోష్ ని కట్టడి చేస్తే సరిపోతుందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తోంది.. ఒకవేళ సంతోష్ ని దూరం పెడితే తనను చూసుకునే నిజాయితీపరుడైన సంతోష్ లాంటి వ్యక్తిని సంపాదించడం కూడా కష్టమనే విషయం కూడా కేసీఆర్ మెదడును తొలుస్తోంది.. ఎందుకంటే తన రాజకీయ గురువైన స్వర్గీయ ఎన్ఠీఆర్ జీవితంలో జరిగిన విపత్కర పరిస్థితులు.. చివరిరోజుల్లో ఎన్ఠీఆర్ దూరం పెట్టిన కుటుంబ సభ్యుల వ్యవహారం కూడా దగ్గరుండి చూసినవాడు కాబట్టి.. అలాంటి దుర్భర పరిస్థితులు తనకు ఎదురుకాకుండా ఉండేందుకు కూడా కేసీఆర్ శతధా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. అందుకే వాస్తవాలు సంతోష్ కి అర్ధం అయ్యేలా వివరించిన ఆయన పార్టీ భవిష్యత్తును రక్షించే ప్రయత్నంలో సంతోష్ ని కొంతకాలం తెరమరుగున ఉండేలా ఒప్పించినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. చూడాలి మరి సంతోష్ భవితవ్యం ఏవిధంగా ఉండబోతోంది..? అపర చాణుక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.. ఈ వర్గాలన్నింటినీ ఒకతాటిమీదకు తీసుకువచ్చే ప్రక్రియ అధినేత కేసీఆర్ తీసుకుంటారా..? లేక కాలం చెప్పబోయే సమాధానం కోసం ఎదురుచూద్దాం..