Thursday, May 2, 2024

తప్పుడు రికార్డులతో కోట్లు స్వాహా..

తప్పక చదవండి

చేయని టెస్టులకు చేసినట్లు రకరకాల చేతి రాతలతో ఎంబీ రికార్డ్స్‌ సృష్టించిన అధికారులు..

  • తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌ సప్లై ప్రాజెక్ట్‌లో అంతులేని అవినీతి..
  • తప్పుడు రిపోర్టులతో ప్రభుత్వాన్ని మోసం చేసిన జీ.వీ.పీ.ఆర్‌. ఇంజినీరింగ్‌ సంస్థ..
  • ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పొందం ప్రకారం నియమ నిబంధనలు గాలికొదిలేసిన వైనం
  • హైడ్రో టెస్టులు నిర్వహించకుండానే మెజర్మెంట్‌ బుక్‌లో నమోదు చేసిన అధికారులు..
  • ప్రజల గొంతులు తడిపే మంచినీటి ప్రాజెక్ట్‌లో అంతులేని అవినీతి..
  • రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలంటున్న సామాజిక వేత్తలు..
    హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి సరఫరాకు మిషన్‌ భగీరథ కింద తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌ సప్లై ప్రాజెక్ట్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో.. ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణ జీ.వీ.పీ.ఆర్‌. ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ వారికి అప్పగించింది.. కాగా ప్రభుత్వానికి సదరు జీ.వీ.పీ.ఆర్‌. ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ వారికి జరిగిన ఒప్పొందం ప్రకారం కొన్ని నియమ నిబంధనలు విధించింది.. అయితే ఈ నిబంధనలను త్రోసి పుచ్చిన సదరు సంస్థ ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను కూడా దారుణంగా మోసం చేసింది.. ఇందులో ముఖ్యంగా హైడ్రో టెస్ట్‌.. ఎలాంటి ప్రామాణికాలు పాటించకుండా.. సంబంధించిన మిషన్‌ భగీరథ ఇంజినీర్లు సంపూర్ణంగా హైడ్రో టెస్టులు చేయకుండా.. కేవలం ఒక్కచోట టెస్టులు నిర్వహించి నాలుగు నియోజకవర్గాల్లో టెస్టులు నిర్వహించినట్లు గా మెజర్మెంట్‌ బుక్‌ లో సైతం నమోదు చేయడం గమనార్హం.. సమాచార హక్కు చట్టం ద్వారా జరిగిన తంతును వెలికితీసి పరిశీలిస్తే ఈ దారుణాలు బహిర్గతం అయ్యాయి.. జీ.వీ.పీ.ఆర్‌. ఇంజినీరింగ్‌ చెప్పిన లెక్కల ప్రకారం ఈ తంతులో సుమారు రూ. 94 కోట్ల సొమ్ము వృధా అయ్యిందని తెలుస్తోంది.. ఈ పైకం యావత్తూ ఇటు సంస్థ, అటు అధికారుల జోబుల్లోకి చేరిందన్నది నిర్విదాంశం.. నిజానికి హైడ్రో టెస్ట్‌ నిర్వహించే పద్ధతి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూరల్‌ వాటర్‌ సప్లై, శానిటేషన్‌ డిపార్ట్మెంట్‌ వారికి జీ.వీ.పీ.ఆర్‌. ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ వారికి.. (మిషన్‌ భగీరథ), తెలంగాణ డ్రిరకింగ్‌ వాటర్‌ సప్లై ప్రాజెక్టు అధికారుల మధ్య జరిగిన ఒప్పొందం ప్రకారం హైడ్రో టెస్ట్‌ నిర్వహించడానికి విధించిన నిబంధనలు ఇలా ఉన్నాయి..

డీఐ పైప్‌ లైన్‌లో పెట్టిన, నీటి ఒత్తిడి శక్తి (టెస్ట్‌ ప్రెజర్‌) కావలసిన పరిమాణము వచ్చిన పిదప కనీసము అదే ఒత్తిడి శక్తి 24 గంటలు నిలచి ఉండవలెను. ఒక వేళ లేనిచో పైపులైను పరీక్షించి ఎక్కడ నీరు లీక్‌ అవుతోందో ఆ భాగము సరిచేసి మరలా ఒత్తిడి శక్తి 24 గంటలు ఉంచవలెను.
పైపు లైన్ల ఒత్తిడి కలుగ చేయవలసిన నీరు, తాగునీరు అయి ఉండవలెను..
ఒత్తిడి శక్తిని పెంచడానికి.. వాడవలసిన త్రాగు నీరు ఏ గ్రామము నుండి మరి ఏ ప్రదేశము నుండైనా తెచ్చినట్టుగా ఎలాంటి రికార్డులు లేవు..
క్రిమి సంహారిక మందులను త్రాగు నీరులో ఉదాహరణ : బ్లీచింగ్‌ పౌడర్‌, లిక్విడ్‌ క్లోరిన్‌ కలిపి నీటి ఒత్తడిలో 24 గంటలు పరీక్షించవలెను.
పైపులో వాడిన త్రాగునీరు లేదా లిక్విడ్‌ క్లోరిన్‌ వున్న నీరు గానీ దాని యొక్క క్రిమి సంహారిక మందు సాంద్రత, క్రిమి కీటకాల సాంద్రత ఎంత ఉన్నది పరిశోధనాలయంలో పరీక్షించి వలెను.. ఈ పరీక్షలు ప్రభుత్వ పరిశోధనాలయములలో పరీక్షించ వలెను. ఆ ప్రమాణ పత్రమను రికార్డ్‌ చేయవలసి ఉంటుంది..
పైపులో ఒత్తిడి కొరకు నీరు వృథాగా వ్యవసాయి భూములలోనూ, ప్రజలకు ఉపయోగకరమైన చెరువులతో గానీ, కాలువలలో గానీ కలపరాదు. ఈ వాడిన నీటిని ఉపయోగములో లేని బహిరంగ ప్రదేశములో గానీ లేదా మురుగు నీరు కాలువలో గానీ, ట్యాంకర్స్‌ లేదా వేరే ఇతర పైపుల ద్వారా వదలవలెను..

- Advertisement -

వాడిన తరువాత వ్యర్ధముగా నీటిని తిరిగి పరీక్షించి, తప్పకుండ సోడియం థియో సల్పేట్‌ తో న్యూట్రాలైస్‌ చేసి బహిరంగ ప్రదేశములో లేదా, మురుగు నీటి కాలువలో వదలవలెను..
పైన కనబరచిన నిబంధనల్లో ఏ ఒక్కటి కూడా పాటించిన దాఖలాలు లేవు.. అసలు కేవలం ఒక్కచోట మాత్రమే హైడ్రో టెస్ట్‌ నిర్వహించి, నాలుగు నియోజకవర్గాల్లో టెస్టులు నిర్వహించినట్లు అధికారులు ఏవిధంగా రిపోర్టులు ఇచ్చారు..? మెజర్మెంట్‌ బుక్‌ లో ఎలా నమోదు అయ్యింది..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలు అవుతుంటే ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారు.. వారికి కూడా వాటాలు అందాయా అన్నది అనుమానాస్పదంగా ఉంది.. అసలు ఎవరు హైడ్రో టెస్ట్‌ నిర్వహించాలి..? ఎవరెవరు నిర్ధారించి సంతకాలు చేయాలి..? ఎలా మెజర్మెంట్‌ బుక్‌ లో నమోదు చేయాలి..? అనే విషయాలు ఇప్పటికీ రహస్యంగానే ఉండటంలో అసలు ఆంతర్యం ఏమిటి..? నకల్‌ మార్‌ నేకూ అకల్‌ రహెనా.. అన్నట్లు.. ఈ అధికారుల నిర్వాకం ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ పై విపరీత ప్రభావం చూపింది.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రిత్వ శాఖ, ఉన్నతాధికారులు ఈ అవినీతి వ్యవహారంపై దృష్టి పెట్టి, జరిగిన అవినీతిని బహిర్గతం చేసి, దీనికి కారణభూతులైన అధికారులు, కాంట్రాక్ట్‌ నిర్వహించిన జీ.వీ.పీ.ఆర్‌. ఇంజినీరింగ్‌ కంపెనీ యాజమాన్యం వారిని సమగ్రంగా విచారించి కఠిన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు