Saturday, July 27, 2024

ధాన్యం కేటాయింపుల దందా.!

తప్పక చదవండి
  • సీఎంఆర్‌ బకాయి మిల్లర్లకు పెద్దపీట వేస్తున్న అధికార యంత్రాంగం
  • సూర్యాపేట జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖలో ఓ ఉన్నతాధికారి మాయాజాలం..
  • 100 కోట్ల సీఎంఆర్‌ డిఫాల్ట్‌ మిల్లర్‌కు ధాన్యం కేటాయింపులో అధిక ప్రాధాన్యం.!
  • క్రిమినల్‌ కేసులు నమోదైన మిల్లర్లపై అధికారులకు అమితమైన మమకారం..
  • ఎలక్షన్‌ సీజన్‌లో తమవైపు ఎవరు చూడరని కోట్లు దండుకుంటున్న వైనం.!

పెరుమాళ్ళ నర్సింహారావు, ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి
సూర్యాపేట జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సి.ఎం.ఆర్‌) ప్రభుత్వ పాలసీ విధానాన్ని సక్రమంగా పాటించే మిల్లర్లను పక్కనబెట్టి, సుమారు100 కోట్ల రూపాయల విలువైన సి.ఎం.ఆర్‌ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌ కు తరలించి, పలు కేసులు ఎదుర్కొంటున్న డిఫాల్ట్‌ మరియు అధిక సి.ఎం.ఆర్‌ బియ్యం బకాయి ఉన్న మిల్లర్ల పై సూర్యాపేట జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారులు అమితమైన మమకారాన్ని చూపించడం వెనక భారీ నగదు బదిలీ స్కీం నడుస్తోందని జిల్లాకు చెందిన పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 2023 ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ల నుండి ఆయా సంబంధిత మిల్లర్లకు సూర్యాపేట జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారులు కేటాయింపులు చేపడుతున్నారు. అయితే ఈ కేటాయింపుల నేపథ్యంలో జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖకు ముఖ్య అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి తనకు ముందుగా మూటలు ఎవరు అప్పగిస్తే, వారి మిల్లులకే ముందస్తు ధాన్యం కేటాయింపునకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

సి.ఎం.ఆర్‌ డిఫాల్టర్లు, క్రిమినల్‌ కేసులు ఉన్న మిల్లర్లపై అధికారులకు అంతులేని మమకారం..
సంబంధిత జిల్లా ఉన్నతాధికారికి సి.ఎం.ఆర్‌ డిఫాల్ట్‌ మిల్లర్లపై ఎక్కడలేని మమకారం పెరిగిపోతోందని, ధాన్యం కేటాయింపుల్లో డిఫాల్ట్‌ మిల్లర్లకే ఈయన ఇక్కడ పెద్ద పీట వేస్తున్నారని బాధిత మిల్లర్లు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సి.ఎం.ఆర్‌ బియ్యం పాలసీ నిబంధనల మేరకు పనిచేసే కొంతమంది రైస్‌ మిల్లర్లను పక్కకు నెట్టి, అవినీతి ఆరోపణలు, క్రిమినల్‌ కేసులు నమోదైన మిల్లర్లకు జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. అయినోనీకి ఆకులో.. కానోనికి కంచంలో… అన్న చందంగా జిల్లా అధికారి వ్యవహారం కొనసాగుతోందని పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 40 రైస్‌ మిల్లర్లు అసలు ఈ సి.ఎం.ఆర్‌ పాలసినే పట్టించుకోరు. కనీసం వారిని ఈ పాలసీ ఎందుకు పాటించడంలేదని అడిగే అధికారి ఇక్కడ దిక్కులేడు. కోట్ల రూపాయల సి.ఎం.ఆర్‌ బకాయి ఉన్న మిల్లులకే ప్రస్తుతం అధికారులు అధికంగా ధాన్యం కేటాయింపులు చేయడం విడ్డూరంగా ఉందంటూ మిల్లర్లు మండిపడుతున్నారు.

- Advertisement -

ఎలక్షన్‌ సీజన్లో పట్టించుకోరనే అనే ధీమా.!
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు, పార్టీలన్నీ ఎన్నికల సీజన్‌ కావడంతో ఎవరి బిజీలో వారు ఉన్నారు . ఇదే అదునుగా భావించిన జిల్లా సివిల్‌ సప్లై శాఖ ఉన్నతాధికారి కౌంటర్‌ తెరిచి డిఫాల్ట్‌ మిల్లర్లతో కుమ్మక్కై చివరి జాబితాలో ఉంచాల్సిన వారికి మొదటి జాబితాలో ప్రాధాన్యత కల్పిస్తూ, త్వర త్వరగా వారికి ధాన్యం కేటాయింపులు చేస్తున్నారని, సదరు అధికారి వ్యవహారంపై పలువురు మిల్లర్లు నిప్పులు కక్కుతున్నారు.

ఆరోపణలు అవాస్తవం..
సూర్యాపేట జిల్లాలో ఉన్న రైస్‌ మిల్లులన్నింటికీ ప్రభుత్వ నిబంధనల మేరకే ధాన్యం కేటాయింపులు చేస్తున్నాము. కొద్దిమంది మిల్లర్లు మాత్రమే అనవసర ఆరోపణలు తమ శాఖపై చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండానే ధాన్యం కేటాయింపులు చేస్తున్నామని జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖ అడిషనల్‌ కలెక్టర్‌ ఎ.వెంకటరెడ్డి ఆదాబ్‌ కు వివరణ ఇచ్చారు.

  • ఎ. వెంకట్‌ రెడ్డి, సూర్యాపేట జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (సివిల్‌ సప్లయ్‌)
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు