Wednesday, April 24, 2024

అనతికాలంలోనే తెలంగాణ అభివృద్ది

తప్పక చదవండి
  • ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు
  • విమర్శకులకు అభివృద్దితో సమాధానం చెప్పాం
  • కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం
  • ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న కెసిఆర్‌
  • మెదక్‌ పర్యటనలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం

మెదక్‌ తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. పరిపాలన చేతకాదన్న వారికి అభివృద్దితో సమాధానం చెప్పామన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్టాల్రతో పోల్చితే తెలంగాణ లో అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు. కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలోనే రాష్ట్రంలో ఇతర రాష్టాల్రు ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగిందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో సరైన అసెంబ్లీ, సెక్రెటేరియట్‌ కూడా లేవన్నారు. మనం 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడమేగాక ఇప్పుడు 24వ కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని సీఎం చెప్పారు. నూతన కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించు కున్నందుకు మెదక్‌ జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. మెదక్‌ కలెక్టరేట్‌ ఆర్కిటెక్చర్‌ ఉషారెడ్డి మన తెలంగాణ బిడ్డేనని సీఎం కేసీఆర్‌ ఆమెకు అభినందనందించారు. అభివృద్దికి కొన్ని గీటురాళ్లు ఉంటాయని, కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం కావచ్చు..ఇవన్నీ చూస్తే ఎంతగా అభివృద్ది చెందామో అర్థం అవుతుందని అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఉన్నదని, స్వచ్ఛమైన నీటిని ఇంటింటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని జిల్లాల్లో నిర్మించుకున్న ఈ పరిపాలనా భవనాలు చూస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి గురించి తెలిసి పోతుందన్నారు. గతంలో చేతగాని పాలకుల వల్ల రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా నాటి చేతగాని పాలకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.200 ఉన్న ఆసరా పింఛన్‌లను ఇప్పుడు రూ.4000 తీసుకొచ్చామని చెప్పారు. మెదక్‌ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్‌ సొమ్ము పంపిణీ, బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించి లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. అంతకు ముందు మెదక్‌ జిల్లాలో జిల్లా సవిూకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. సీఎం కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయం బయట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే జిల్లా పోలీస్‌ ఆఫీస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. నూతన కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించుకున్నందుకు మెదక్‌ జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. మెదక్‌ కలెక్టరేట్‌ ఆర్కిటెక్చర్‌ ఉషారెడ్డి మన తెలంగాణ బిడ్డేనని సీఎం కేసీఆర్‌ ఆమెను అభినందించారు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద సీఎస్‌ శాంతి కుమారి రిబ్బన్‌ కట్‌ చేశారు. కార్యాలయంలోపల ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలు, అధికారులతో కలిసి వేద పండితుల ఆశీర్వచననాలు తీసుకున్నారు. తర్వాత జిల్లా కలెక్టర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ముస్లిం, క్రిస్టియన్‌ మత పెద్దలు తమ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌కు శాలువా కప్పి సత్కరించారు. అంతకుముందు సీఎం బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతికుమారి, డీజీపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు. ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వదించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు