Thursday, May 2, 2024

17న బీజేపీ మేనిఫెస్టో

తప్పక చదవండి
  • బీజేపీ పార్టీ మీడియా సెంటర్‌లో విడుదల
  • అదే రోజు తెలంగాణలో అమిత్‌ షా పర్యటన
  • 25, 26, 27 తేదీలలో మోడీ పర్యటన
  • పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టిన బీజేపీ

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి ముఖ్య నాయకులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నాటి నుంచి ప్రధాని మోడీ సహా.. అమిత్‌ షా, పలువురు కీలక నేతలు తెలంగాణలో పర్యటించారు. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కీలక నేతలతో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల చివరి వారంలో ప్రధాని మోడీ వరస పర్యటనలు ఉన్నాయి. 25, 26,27 తేదీలలో మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా టూర్‌ కి సంబంధించి కూడా ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. ఈనెల 17న అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకే రోజు నాలుగు సభలకు బిజెపి ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నల్గొండ, వరంగల్‌, గద్వాల్‌, రాజేంద్రనగర్‌ లో పబ్లిక్‌ మీటింగ్స్‌ ఉండనున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నేతలు 119నియోజకవర్గాల్లో పాగా వేసి ఎన్నికలు పూర్తి అయ్యేవరకు గ్రౌండ్‌ లెవెల్‌లో పనిచేస్తున్నారు. అయితే, బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా కూడా క్లారిటీ వచ్చింది. అమిత్‌ షా పర్యటన 17న ఉన్న నేపథ్యంలో ఆ రోజే మేనిఫెస్టోని రిలీజ్‌ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే సెంటిమెంటును రగిలించే విధంగా కొన్ని ప్రాంతాల పేర్ల మార్పుతో పాటు పలు కీలకమైన అంశాలను పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. వైద్య, విద్య ఉచితంగా అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. ఇక జాబ్‌ క్యాలెండర్‌ ఉపాధి అవకాశాలపైన కూడా ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు భిన్నంగా మేనిఫెస్టోను రూపొందించి.. ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రణాళికతో ముందుకెళ్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు