Wednesday, May 15, 2024

ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న తుమ్మలపల్లి ప్రసాద్..

తప్పక చదవండి

అమరావతి,అత్యంత ప్రతిష్టాత్మకమైన మోటూరి హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవభూమి దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ తుమ్మలపల్లి ప్రసాద్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపర్తిలో అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ కు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. అవార్డు క్రింద పది వేల రూపాయల నగదు బహుమతి ని కూడా ప్రసాద్ కు అందజేశారు. ప్రసాద్ నవభూమి దినపత్రిక లో మార్చి నెల 8న 85 సంవత్సరాల అత్త అనారోగ్యంతో ఉన్న తన కోడలికి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవలను మగువా నీకు వందనం అనే శీర్షికతో వార్తా కథనాన్ని రాయగా, దానిని నవభూమి దినపత్రిక లో ప్రచురించారు. ఈ వార్తా కథనమే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ వార్తా కథనంగా మోటూరి హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు రావడానికి కారణం అయ్యింది. ప్రసాద్ కు ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందజేసిన వారిలో జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజ, ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ బి.తులసీదాస్, పొలిటికల్ ఎనలిస్టు తెలకపల్లి రవి, నాగార్జున యూనివర్శిటీ జర్నలిజం విభాగం అధిపతి జి.అనిత తదితరులు ఉన్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ప్రయోజనమే జర్నలిస్టుల లక్ష్యంగా ఉండాలని అన్నారు. పత్రికా యాజమాన్యాలు పక్షపాత ధోరణి విడనాడి ప్రజల పక్షం నిలవాలని, మోటూరి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. మోటూరి హనుమంతరావు అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ తెలకపల్లి రవి మాట్లాడుతూ పెద్దా, చిన్నా పత్రికలు అనే తేడా లేకుండా ఉత్తమ వార్తా కథనాలనే పరిశీలించామని అన్నారు. నాగార్జున యూనివర్శిటీ జర్నలిజం విభాగం అధిపతి జి. అనిత మాట్లాడుతూ ఉత్తమ జర్నలిస్టు అవార్డు గెలుచుకున్న తుమ్మలపల్లి ప్రసాద్ రాసిన వార్తా కథనం అవార్డు కమిటీ సభ్యులందరి మనసులను కదిలించిందని, అందుకే ఏకగ్రీవంగా ఉత్తమ జర్నలిస్టు గా ఎంపిక చేసామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, హైదరాబాద్ నుండి నవభూమి దినపత్రిక ఎడిటర్ ఎస్ ఏ అజీద్ కూడా పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు