Wednesday, September 11, 2024
spot_img

వీఆర్ఏల స‌ర్దుబాటు షురూ..!

తప్పక చదవండి
  • నాలుగు శాఖ‌ల్లో అడ్జస్ట్ చేయడానికి ప్రణాళిక..
  • ఉద్యోగి వయసు 61 ఏండ్లు దాటితే వార‌సుల‌కు కొలువు.. !
  • వీ.ఆర్.ఏ.ల క్రమబద్దీకరణ, సర్దుబాట్లపై సీఎం సమీక్ష..
  • అర్హతలను బట్టి నాలుగు శాఖల్లో సర్దుబాటు..
  • దీనికి సంబంధించిన జీఓ ఈరోజు విడుదలయ్యే అవకాశం..
  • మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం జీఓ విడుదల..
    హైదరాబాద్ : రాష్ట్రంలో వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, స‌ర్దుబాటుపై స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశం ముగిసింది. వీఆర్ఏల విద్యార్హత‌ల‌ను బ‌ట్టి నాలుగు శాఖ‌ల్లో వీఆర్ఏల‌ను సర్దుబాటు చేయాల‌ని నిర్ణయించింది రాష్ట్ర ప్ర‌భుత్వం.. అందులో భాగంగా నీటిపారుద‌ల‌, పుర‌పాల‌క శాఖ‌, పంచాయ‌తీరాజ్ శాఖ్, మిష‌న్ భ‌గీర‌థ శాఖ‌లో వీఆర్ఏల‌ను స‌ర్దుబాటు చేయ‌నున్నారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వార‌సుల‌కు ఇచ్చేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవడం గమనార్హం.. వీఆర్ఏల స‌ర్దుబాటు, ఇత‌ర అంశాల‌కు సంబంధించిన జీఓ ఈరోజు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉందని తెలుస్తోంది..
    ఈ సమీక్షా మీటింగ్ లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఏ. జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    మైనారిటీలకూ రూ. లక్ష.. జారీ అయిన ఉత్తర్వులు :
    త్వరలోనే విధి విధానాలు విడుదల చేయనున్న సర్కారు..
    ఎన్నికల వేళ మరో కొత్త స్కీం అంటున్న ప్రతిపక్షాలు..
    రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొస్తోంది. గతంలో దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ సర్కారు.. నెల కింద వెనుకబడిన చేతివృత్తులు, కులవృత్తుల వారికి చేయూతనిచ్చేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించింది. ఇక ఇప్పడు మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్ని లక్ష్యంతో.. బీసీ బంధు తరహాలోనే వంద శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. మైనార్టీలకు లక్ష సాయం పథకాన్ని తీసుకొస్తున్నట్టు మూడు రోజుల కిందే.. మంత్రి హరీశ్ రావు తెలపగా.. ఈరోజు ఏకంగా పథకానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ మైనార్టీలకు లక్ష రూపాయల పథకానికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే విడుదల కానున్నాయి. దీనికి కూడా బీసీ బంధు మాదిరిగానే కండీషన్లు ఉండే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఎలాంటి నిబంధనలు పెట్టనున్నారో తెలియాల్సి ఉంది. కాగ.. మైనార్టీల కోసం ప్రభుత్వం లక్ష స్కీమ్ పథకాన్ని తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సీఎం పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తున్నదని సీఎం అన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత, ఆచార, సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే వుంటుందని సీఎం స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ సర్కారు వరుస పథకాలు ప్రారంభించటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దళిత బంధుతో ఆ వర్గాన్ని, బీసీలకు లక్ష సాయంతో వారిని బీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ముస్లింలకు కూడా ప్రత్యేక పథకాన్ని అమలు చేసి.. వాళ్లను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు