Saturday, April 27, 2024

17న బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ
  • దశాబ్ది ఉత్సవాలు, కర్నాటక ఎన్నికలపై చర్చ
  • రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌

హైదరాబాద్‌ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ భవన్‌లో ఈ నెల 17వ తేదీన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కర్నాటకలో బిజెపి ఓటమితో ఇక్కడి బిఆర్‌ఎస్‌లో జోష్‌ పెరిగింది. తమకు తిరుగు లేదని వంద సీట్లు గెలుస్తామని కెసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇదే విషయమై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రానున్న రోజుల్లో ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణతో పాటు, కార్యాక్రమాలతో ప్రజల్లోకి చేరువ అయ్యే విధంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయంతో బీజేపీ పతనం ప్రారంభం అయ్యిందని, తెలంగాణలో దదానికి స్థానం కూడా ఉండదని మంత్రి వేముల ప్రశాంత రెడ్డి అన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం మొదలైందని పేర్కొన్నారు. ప్రజల మధ్య మతాల చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేస్తున్న కమలనాథుల విద్వేష రాజకీయాలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు. కార్పొరేట్‌ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి, పేద ప్రజల బతుకులను బలి చేస్తున్న ప్రధాని మోడీ డ్రామాలకు శాశ్వతంగా తెర వేయడానికి కర్ణాటక ప్రజలు దేశానికి దిశా నిర్దేశర చేశారని తెలిపారు. దేశంలోని అన్ని చోట్ల బీజేపీ ఖాతాలు క్లోజ్‌ అవుతాయని, తెలంగాణలో అయితే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఏమాత్రం ఉండదని తెలిపారు. తెలంగాణ గడ్డపై మూడోసారి కూడా బీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. కర్ణాటక ఫలితాలపై రేవంత్‌, బండి సంజయ్‌లది వింత ధోరణి అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, ఇక్కడ కాంగ్రెస్‌ గెలుస్తుందని పగటి కలలు కంటున్నాడని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసినవి సిగ్గుమాలిన వ్యాఖ్యలని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు సింగిల్‌ డిజిట్‌ కూడా దక్కదని మంత్రి వేముల పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు