Monday, April 29, 2024

ఏమి సేతుర లింగా …!

తప్పక చదవండి
  • సందిగ్ధంలో జంపు జిలానీల రాజకీయ భవిష్యత్తు
  • అధికారపార్టీ దెబ్బకు లీడర్ల మైండ్‌ బ్లాక్‌
  • అప్పడు ఊపులో పాత బంధాన్నితెంచుకున్నారు
  • ఇప్పుడు నిజం తెలిసి కలుపుకోవాలనుకుంటున్నారు
  • వారిని రానిచ్చేదెవ్వరు.. ఈడ పొమ్మనదెవ్వరు..?
  • పొమ్మనలేక పొగపెడుతున్న బీఆర్‌ఎస్‌ అధిష్టానం

హైదరాబాద్ : హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెరాస రేంజ్‌ పూర్తిగా మారిపోయింది. తెరాస ప్రభుత్వం ఏర్పాటు కాకముందు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయిన తెరాస లీడర్ల బతుకు చిత్రాలు తెలంగాణ వచ్చాక.. వారు అధికారం చెప్పట్టాక పూర్తిగా మారిపోయాయి. ఖరీదయిన కార్లు, నౌకర్లు, అద్దాల మేడలు, భూములు, విలాసవంతమైన జీవితాలు.. ఒక్కటేమిటి చెప్పాలంటే లీడర్ల జీవితాల్లో ఎన్నో మార్పులు.. ఎవరూ ఊహించని అద్భుతాలు జరిగిపోయాయి. అంతా బాగానే ఉంది కదా మరి ప్రాబ్లం ఏంటని కదా మీ ప్రశ్న.. అక్కడికే వస్తున్నాం అసలు కథ ఇప్పుడు చెబుతాం.. శ్రద్దగా చదవండి… ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక కథనం ..
బిఆర్‌ఎస్‌ దెబ్బకు లీడర్ల మైండ్‌ బ్లాక్‌ :
పలు పార్టీల్లో కీలక పదవులు చేపట్టి రాజకీయ క్షేత్రంలో చక్రం తిప్పిన రాజకీయ ఉద్దండులు తెరాస ప్రభుత్వంలో చేరి ఎవరికీ కాకుండా పోయారు. వీరిలో కొందరికి అవకాశాలు అందివచ్చినా.. మరికొందరికి ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి. తాము పుట్టి పెరిగిన జిల్లాలో తమ పేరుచెప్పుకుని చక్రం తిప్పిన నాయకులే తమ ప్రాంతాల్లో ఇప్పుడు ఎందుకు పనికిరాని నాయకులుగా మిగిలిపోయారు. తెరాస పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొంతకాలానికే చేరికల పర్వానికి తెరలేపింది. దీంతో వివిధ పార్టీలలో కీలకంగా పనిచేస్తున్న నాయకులు పార్టీ మారిపోయి తెరాసలో ఆనందంగా చేరిపోయారు.. చేరిపోవడమే కాదు తల్లిలాగా రాజకీయ భవిష్యత్తునిచ్చిన పార్టీని అనరాని మాటలు అని తెగదెంపులు చేసుకున్నారు. తాము సిద్ధాంత పరంగా నమ్ముకున్న పార్టీని.. రాజకీయ బిక్ష పెట్టిన పార్టీని కాదని తెరాసలోని ప్రముఖుల మాటలను నమ్ముకుని తమ రాజకీయ భవిష్యత్తునే సమాధి చేసుకున్నారు. అప్పుడు ఎగబడి ఇంటికి వచ్చి సీటును కేటాయిస్తామన్న లీడర్లు ఇప్పుడు అన్నీచంపుకుని ఇంటికెళ్లి గలుమకాడ కూసున్న దర్వాజాల గొళ్ళాలు కూడా లీడర్లు తీయడం లేదట.

సందిగ్ధంలో జంపు జిలానీల రాజకీయ భవిష్యత్తు :
ఉన్న పార్టీలో ఇముడలేకపోతున్నారు. పోనీ సిగ్గిడిసి పాత పార్టీలకు పొదామనుకుంటే రమ్మనేటోళ్లు లేరు. సరే మనోళ్లే కదా అని మూడడుగులు ముందుకేసి పోదామనుకుంటే ఆళ్ళను తిట్టిన గలీజు తిట్లు గుర్తొచ్చి ఆరడుగులు వెనక్కిపడుతున్నాయి. దీంతో జంపు జిలానీల రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారమయి పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, కమ్యూనిస్ట్‌ పార్టీలలో కీలకంగా ఉన్న పలువురు నాయకులు తెరాసలో చేరిపోయారు. చేరికల సమయంలో ఓ వెలుగు వెలిగిన నాయకులు ఇప్పుడు ఎందుకు చేరిపోయామురా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.

- Advertisement -

ఆడ రానిచ్చేదెవ్వరు.. ఈడ పొమ్మన్న దెవ్వరు..?
తమ పార్టీలో చేర్చుకున్న ఏ నాయకుడిపై తెరాసకు ప్రేమ లేదు. వారికున్న ఏకైక లక్ష్యం ప్రతిపక్షం లేకుండా చేయడం.. ప్రధాన పార్టీలను నిర్వీర్యం చేయడం మాత్రమే. తెరాస తాను అనుకున్నలక్ష్యాలను చేరుకోవడానికి పలు పార్టీల నేతలను సమిధలను చేసి పారేసి తన లక్ష్యాలను నిర్విరామంగా చేరుకుంది. ఆయా పార్టీలను నాశనం చేయాలంటే పార్టీల్లో ఉన్న ముఖ్యమైన నేతలను తమ దారిలోకి తెచ్చుకుని తమ అమ్మల పొదలో దాచుకోవడమే. ఇది గ్రహించని నేతలు ప్రేమగా పిలిచారని ధృతరాష్ట్రుని కౌగిలికి బలయిపోయారు. ఇప్పుడు పాశ్చాత్తాప పడ్డా ఫలితం లేకుండా పోతోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు