- రూ.8కోట్ల విలువైన పార్కు స్థలానికి అక్రమార్కుల ఎసరు
- నోటీసులివ్వకుండా వత్తాసు పలుకుతున్న పంచాయితీ కార్యదర్శి, ఎంపివో వెంకటేశ్వర్ రెడ్డి
- సైలెంట్ గా వ్యవహారిస్తున్న సర్పంచ్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి
- ఉన్నతాదికారులు వెంటనే స్పందించి పార్కు స్థలాన్ని కాపాడాలంటున్న గ్రామస్తులు
మొయినాబాద్ : ’’దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు’’గా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని రూ.8కోట్ల విలువైన పార్కు స్థలాన్ని అటు కబ్జాదారులు. .ఇటు అధికారులు కలిసి అప్పనంగా కాజేస్తున్నట్లు కనకమామిడి గ్రామస్తులు చెప్పకనే చెబుతున్నారు. పార్కు జాగను కొందరు స్థానిక వ్యక్తులు హస్తగతం చేసుకుంటూ.. దర్జాగా కబ్జా చేసి పట్టపగలే నిర్మాణాలు చేపడుతున్నా కూడా అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. మండలంలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 32లో 2004సంవత్సరంలో లే అవుట్ చేశారు. అందులో గ్రామంలోని పది మందికి ఉపయోగ పడే విధంగా దాదాపు 28గుంటల పార్కు స్థలాన్ని సైతం వదిలారు. అయితే పార్కు స్థలం జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో కొందరు వ్యక్తులు కన్నేసి కబ్జా చేసి కాలర్ ఎగరెస్తున్నారు. గ్రామ పంచాయితీ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన పంచాయితీ కార్యదర్శి విక్రమ్ రెడ్డి భక్షకులుగా మారుతున్నారనే విమర్శలు లేకపోలేవు. కబ్జాలో కట్టడాలు వేగంగా జరుగుతున్న కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కబ్జాదారులకు పంచాయయితీ కార్యదర్శి వత్తాసు పలుకుతున్నాడు. ఇదే విషయంపై ఎంపీవో వెంకటేశ్వర్ రెడ్డికి పలుమార్లు విన్నవించిన కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఏవేవో సాకులు చెబుతూ దొంగాటాడుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్న కూడా గ్రామ సర్పంచ్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి మాత్రం తమకేం తెల్వదన్నట్లు, కనీసం తమ మీద కనీస బాధ్యత లేనట్లో మౌన వ్రతం చేస్తూ నిర్లిప్త ఏకాంత దంత ప్రాకారాలలో గుడుగుడు గుంచం జీవితాలు గడుపుతున్నారు. కబ్జా జరిగినా కూడా కనీసం కాపాడకుండా పంచాయితీ కార్యదర్శి విక్రమ్ రెడ్డి, ఎంపీవో వెంకటేశ్వర్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరును చూసి అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.