Wednesday, May 15, 2024

మ‌న‌మే గెలుస్తాం..

తప్పక చదవండి
  • తుమ్మలూరులో హరితహారం 9వ విడతను ప్రారంభించిన ముఖ్యమంత్రి
  • హరితహారం అంటే కాంగ్రెస్ నాయకులు నవ్వారన్న కేసీఆర్
  • తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడి
  • గ్రామ సర్పంచులను ప్రత్యేకంగా అభినందించిన సీఎం

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు శాసన సభలో నవ్వుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని వివరించారు. పట్టుబట్టి ప్రారంభించిన హరితహారంతో ఇప్పుడు తెలంగాణ కొద్దిగా పచ్చబడిందని చెప్పారు. తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయని వివరించారు. ఈ క్రెడిట్ రాష్ట్రంలోని సర్పంచులకే మొదట చెందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులతో పాటు రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన హరితోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని ఆయన ఓ మొక్క నాటి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని మ‌రింత‌ బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని ప‌నులు జ‌రుగుతాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి కృష్ణా నీళ్లు వ‌స్తాయి. మ‌హేశ్వ‌రం దాకా మెట్రో రైలు ఆటోమేటిక్‌గా వ‌స్త‌ది. అటు బీహెచ్ఈఎల్.. ఇటు ఇక్క‌డి దాకా వ‌స్త‌ది. మ‌ళ్లీ మ‌న‌మే గెలుస్తం.. అందులో డౌట్ లేదు. బ్ర‌హ్మాండంగా మ‌న‌మే ఉంటాం కాబట్టి.. ఒక ప‌ద్ధ‌తిలో వ‌చ్చే ట‌ర్మ్‌లో ఇవ‌న్నీ సాధ్యం చేసుకుందామ‌ని మ‌న‌వి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. ఫారెస్టు డిపార్ట్‌మెంట్ వారు చాలా క‌ష్ట‌ప‌డి మ‌న కోసం అడ‌వుల‌ను పెంచుతున్నారు అని కేసీఆర్ తెలిపారు. కానీ దుర్మార్గులు ఒక ఫారెస్టు అధికారిని దారుణంగా చంపేశారు. ఆ ఫారెస్టు అధికారి భార్య‌కు డిప్యూటీ త‌హ‌సీల్దార్‌గా ఉద్యోగం క‌ల్పించి, నియామ‌క ప‌త్రాన్ని అంద‌జేశాం. కొంత డ‌బ్బులు కూడా సాయం చేశాం. మ‌నిషిని అయితే తేలేం. కానీ వారికి ఉద్యోగం కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు హామీ ఇస్తున్నాను. మీ మీద దాడులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు పోలీసు స్టేష‌న్ల మాదిరిగా ఫారెస్టు స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తాం. ఒక 20 వ‌ర‌కు స్టేష‌న్లు అవ‌స‌రం అవుతాయ‌న్నారు. వాటిని వెంట‌నే మంజూరు చేద్దాం. ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ను ప‌టిష్టం చేద్దాం. తెలంగాణ‌లో భారీగా ఫ‌ల వృక్షాలు పెంచాలి అని కేసీఆర్ సూచించారు. హ‌రిత‌హారంలో అనేక అద్భుతాలు జ‌రిగాయ‌న్నారు కేసీఆర్. తెలంగాణ‌లో.. ప్ర‌తి గ్రామంలో న‌ర్స‌రీ, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు ఏర్పాటు చేసుకున్నాం. అర్బ‌న్ పార్కులు కూడా రూపుదిద్దుకున్నాయి. ఈ విజ‌యం మ‌నంద‌రి విజ‌యం. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన పండ్ల మొక్క‌ల‌ను పంచేందుకు ఒక వంద కోట్ల బ‌డ్జెట్ అయినా పెట్టి ఫ‌ల వృక్షాల‌ను పంచాల‌ని నిర్ణ‌యించాం అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల‌ను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. దివ్యాంగుల‌ను మాన‌వ‌త్వంతో ఆదుకుంటున్నాం. వారికి పెన్ష‌న్లు పెంచాం. ప్ర‌తి ఒక్క‌రికి అవ‌స‌ర‌మ‌య్యే ప‌థ‌కాలు పెట్టుకున్నాం. కులానికో, మ‌తానికో, జాతికో సంబంధించి ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం లేదు. ఏ ఒక్క‌రిని వ‌దిలిపెట్ట‌కుండా అంద‌రినీ ఆదుకుంటున్నాం. తల‌స‌రి విద్యుత్ వినియోగంలో, త‌ల‌స‌రి ఆదాయంలో, ధాన్య‌పు రాశులు పండించ‌డంలో అలా అన్నింటిలో నంబ‌ర్ వ‌న్‌గా ఉన్నాం అని కేసీఆర్ తెలిపారు.

హరితహారం కార్యక్రమంలో 2013 నుంచి 2023 వరకు273.33 కోట్ల మొక్కలు నాటినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్‌ ప్రకృతి వనాలు, 1,00,691 కిలోమీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ దాదాపు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. గోదావరి నీళ్లను గండిపేట, హిమాయత్ సాగర్ వరకు తీసుకొస్తామని, రాబోయే కొద్ది రోజుల్లోనే చేవెళ్ల ప్రాంతానికి నీళ్లు అందిస్తామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు