Thursday, February 29, 2024

మన రాజ్యాంగాన్ని, విద్యా వ్యవస్థను కాపాడుకోవాలి

తప్పక చదవండి

నేడు బీజేపీ,సంఘ పరివార్‌ ఫ్యాసిస్ట్‌ శక్తులు మన దేశ ప్రజలను తీవ్ర కష్ట,నష్టాలకు గురి చేస్తున్నారు. ప్రజల కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటే క్రమంగా బడా కార్పోరేట్‌ శక్తులైన అదానీ, అంబానీలకు కారు చౌకగా అమ్మేస్తున్నారు.జీఎస్టీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధికంగా దెబ్బతీశారు. గతం కంటే రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రాలకు పన్నులలో చట్టబద్ధంగా రావాల్సిన వాటను ఎగగొట్టటానికి సెస్సుల పేరుతో నేరుగా కేంద్ర ప్రభుత్వం రాష్టాల ఆదాయాన్ని దోచుకుంటుంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం నుంచి యాచించే బిక్షగాళ్ళుగా మార్చి వేసింది. ఇది మన భారత ఫెడరల్‌ వ్యవస్థ లక్షాలకు విఘాతం కల్పించటమే. గవర్నర్‌/ లెఫ్టినెంట్‌ గౌర్నర్‌ వ్యవస్థను ఉపయోగించుకొని అక్రమంగా రాష్ట మంత్రి వర్గం తీసుకుంటున్న విధాన నిర్ణయాలను అమలు కాకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాస్వమ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొడుతున్నారు. లంచాలను ఎరవేసి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడుతున్నారు. లేదా సీబీఐ,ఈడీ,ఐటీ దాడులతో బెదిరించి విపక్ష ఎంఎల్‌ఏలను పార్టీ ఫిరాయించేలా చేసి బీజేపీలో కలిపేసుకొని తమపార్టీ సంఖ్యా బలం పెంచుకుంటున్పారు. సి.ఏ.ఏ., ఎన్‌.ఆర్‌.సి., ఎన్‌.పి.ఆర్‌. పేర్లతో మైనార్టీల పైన ముఖ్యంగా ముస్లిం,క్రీస్టియన్‌ మైనార్టీల పైన భౌతిక దాడులకు ఎగబడుతున్నారు. గోరక్షణ పేరుతో నిత్యం మైనార్టీలను, దళితులను హత్యాకాండలకు బలి చేస్తున్నారు.మన దేశ ఆధ్యాత్మిక కేంద్రాలయిన అయోధ్య రామాలయం, కాశీ,మధుర పేర్లతో మానవత్వాన్ని మరచి భిన్న మతస్థుల పట్ల పరస్పర నమ్మకాన్ని,సహోదర భావాన్ని చెరిపి వేసి హింసాత్మక దాడులతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఓట్ల రాజకీయాల కోసం పాకిస్తాన్‌,చైనా,సరిహద్దుల సమస్యల పేరుతో నిత్యం ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు.దేశభక్తి పేరుతో ప్రజలను భావోధ్వేగాలను రెచ్ఛగొడుతూ… సామాజిక, ఆర్ధిక, పారిశ్రామిక రంగాలలో తమ ప్రభుత్వాల పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చు కోవటానికి ప్రజల మధ్య కుల,మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలైన ఎలక్షన్‌ కమిషన్‌, ఈడి, సీబీఐ,ఎన్‌.ఐ.ఏ. తదితర స్వతంత్ర వ్యవస్థలను,తమ దౌర్జన్యాలను వ్యతిరేకించే విపక్షాల పైన ఈ విచారణా సంస్థలను ఉసిగొల్పుతున్నారు.వీరి దుర్మార్గాలను, అరాజకాలను వ్యతిరేకించే ప్రజాస్వామిక వాదుల పైనా,పౌరహక్కుల నేతల పైన అక్రమ కేసులను బనాయించి, జైళ్ళలో వేస్తున్నారు.వారికి కోర్టులలో బేయిల్‌ రాకుండా వారిపై దేశద్రోహలు అనే ముద్ర వేసి, రాజ్యధిక్కార నేరాలు మోపి వారిని అక్రమ నిర్బంధానికి గురిచేస్తున్నారు. చివరకు సుప్రీంకోర్టు కూడా తమ కన్ను సన్నుల్లో ఉండాలనీ,తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రాజ్యాంగ సంస్కరణల పేరుతో న్యాయమూర్తుల అధికారపరిధి పై కోతలు విధించేలా కుట్రలు చేస్తున్నారు. కొలీజియం వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారు.రాజ్యాంగ చట్టాలకు ఉన్న పాత పేర్లను మార్చటంతో పాటు, న్యాయ సమీక్షా పరిధికి కంచెలు నిర్మిస్తున్నారు.తమకు అనుకూలంగా తీర్పులు చెప్పిన న్యాయమూర్తులకు రాజ్యసభ పదవులు కట్టబెడుతున్నారు. మన విద్యావ్యవస్థలో లోపాలను సవరించి,విదేశాలతో పోటీపడేలా ఆధునిక శాస్త్ర, సాంకేతిక అంశాలతో నూతన సిలబస్‌ ను రూపొందించటానికి బదులు న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ పేరుతో సనాతన హిందూ మత ప్రాతిపధికగా సిలబస్‌ ను రూపొంధించారు.భారత దేశ చరిత్ర- సంస్కృతి పాఠ్య పుస్తకాలలో ఉన్న సిలబస్‌ ను మార్చి వేసి చరిత్రను వక్రీకరణ చేసి అంతా ‘‘మనవాద చరిత్ర’’ గా మారుస్తున్నారు.మొగల్‌ సామ్రాజ్య కాలాన్ని మొత్తం చరిత్ర సిలబస్‌ నుండి తొలగించారు. గాంధీ, నెహ్రూ, భగత్‌ సింగ్‌, డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ మొదలైన వారి భావాలు గల పాఠ్య అంశాలను చరిత్ర సిలబస్‌ నుండి పూర్తిగా తొలగిస్తున్నారు. డా.అంబేద్కర్‌ విరచిత రాజ్యాంగ స్థానంలో మనవాద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి 3వేల ఏళ్ళ నాటి వర్ణాశ్రమ ధర్మాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.సైన్స్‌ విద్యార్ధులకు ఉపయోగ పడే డార్విన్‌ జీవపరిణామ పాఠ్యాంశాలు, పిర్యాడికల్‌ టేబుల్‌ పాఠ్యాంశాలను తొలగించారు. ఉన్నత విద్యకు నిధులు బాగా తగ్గించారు. యూనివర్సిటీలలో పరిశోదనకు అవసరమైన నిధులను గణనీయంగా తగ్గించారు.యూజీసీ పాత్రను నిర్వీర్యం చేశారు.గత పదేళ్ళుగా యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల నియామాకాలు జరపలేదు. బోధన,పరిశోధన కుంటుపడిరది.ఇలా ప్రతిరంగంలో బీజేపీ పాలనాకాలంలో దేశం వెనకబడిరది. బీజేపీప్రభుత్వ దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు వీరి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా సమస్త ప్రజలను ఐక్యం చేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉంది. బాధితులంతా తమ మధ్య ఉండే చిన్న చిన్న సమస్యలను, అంతరాలను, విభేదాలను పక్కకు పెట్టి, ఐక్య పోరాటాలకు సిద్ధం కావల్సిన తరుణం వచ్చింది. దేశంలో అలాంటి మార్పు,చైతన్యం కోసం అవసరమైన రాజకీయ వాతావరణం నేడు సృష్టించడాలి. అందుకోసం మనమంతా కూడా ప్రతి గ్రామంలో,ప్రతి పట్టణంలో,ప్రతి నగరంలో కమిటీలు వేసుకొని శాస్త్రీయమైన,న్యాయమైన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రచారం చేయాలి.ఉద్యమ కార్యాచరణలో చేపట్టవలసిన అనేక నూతన మార్గాలను అన్వేశించి ఆచరణ లోకి సత్వరం తీసుకప రావలసిన అవసర ఎంతైనా ఉంది.
` డాక్టర్‌.కోలాహలం రామ్‌ కిశోర్‌, 9849328496

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు