Sunday, May 19, 2024

నీళ్ల చారు, కుళ్ళిపోయిన గుడ్లు…

తప్పక చదవండి
  • మూడు రోజుల నుండి పాలు, పెరుగు లేకుండానే భోజనం..
  • తలుపులు లేని స్థానాల గదులు..
  • ఎలాంటి జాగ్రత్తలు లేకుండా అదనపు గదుల నిర్మాణం..
  • పలు సమస్యలలో బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల..
  • వసతి గృహాన్ని పర్యవేక్షించిన జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు..

‘నిన్నటి సాంబారు, ఉడకని పప్పు దొరికేదేరా మెస్సూ.. బహు గొప్పదిరా మా మెస్సూ’ అంటూ ఒక చలనచిత్రంలో పాటను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసాం.. ఇదేమి చిత్రం అంటూ నవ్వుకున్నాం.. కానీ ఇప్పుడు అదే నిజమైంది.. ఓ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్ లో నివ్వెరపోయే పరిస్థితులు నెలకొన్నాయి.. విద్యార్థినిలకు నీళ్ల చారు, కుళ్లిపోయిన గుడ్లు వడ్డించడంతో పాటు.. అది బాలికల వసతి గృహం అన్న విషయాన్ని మరచిన అధికారులు కనీస వసతులు కూడా కల్పించకపోవడం శోచనీయం.. బోనకల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆదాబ్ అందిస్తున్న కథనం..

బోనకల్: ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు ఆ దిశగా సత్ఫలితాలను ఇవ్వటం లేదు. ప్రతి బడ్జెట్లో వందల కోట్ల రూపాయలు గురుకులాల కోసం కేటాయిస్తున్నా క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ నిధులు సరైన విధంగా అందటం లేదు. బోనకల్ మండలం లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల పలురకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.. కొంతమంది విద్యార్థుల తల్లి దండ్రులు పాఠశాలలోని సమస్యలపై మండల జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబుకు దృష్టికి తీసుకొని రాగా గురువారం జడ్పిటిసి సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పర్యవేక్షించటం జరిగినది. ఈ సందర్భంగా జడ్పిటిసి దృష్టికి పలు రకాల సమస్యలు వచ్చినట్టు మీడియా మిత్రులకు తెలియజేశారు. ప్రతి విద్యార్థికి తరగతిని బట్టి 30 రూపాయల నుండి 50 రూపాయలు ప్రతిరోజు ప్రభుత్వం కాంట్రాక్టర్ చెల్లిస్తున్నా కానీ ఆ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడం లేదని, నీళ్ల చారు, కుళ్ళిపోయిన కోడి గుడ్లు, కుళ్లిపోయిన కూరగాయలతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు అల్పాహారం కోసం ఉంచిన పెసలు పురుగులు పట్టి దర్శనమిచ్చాయని తెలిపారు

- Advertisement -

కనీస వసతులు కరువు :
గురుకుల పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉండగా వారికి అరకొరగా మరుగుదొడ్లు ఉండటం, వాటికి సరిగ్గా డోర్లు కూడా లేకపోవడంతో, విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్య మధ్యలో నీటి సమస్య కూడా తలెత్తడంతో, తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్నానం చేసిన వారికే నీళ్లు దొరుకుతుండటంతో త్వరగా లేచి క్యూలో నించొని మరి స్నానాలు చేసే దుస్థితి ఏర్పడింది.

కాంపౌండ్ వాల్ నిర్మించాలి :
ఈ గురుకుల పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో, పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులు పలుసార్లు పారిపోవడం, గతంలో కొంతమంది ఆకతాయిలు పాఠశాల వెనుక భాగము నుండి రాత్రిపూట రహస్యంగా చొరబడిన సంఘటనలు జరిగాయని, తమ పిల్లలకు భద్రత లేదని విద్యార్థులు తల్లి దండ్రులు వాపోతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం :
వసతి గృహం పైభాగంలో నూతనంగా అదనపు గదులను నిర్మిస్తున్న సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వసతి గృహంలోని సమస్యలపై దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు