Wednesday, May 22, 2024

కోమటి కుంట హాంఫట్..

తప్పక చదవండి
  • అక్రమ నిర్మాణాలకు అడ్డాగా వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ..
  • చెరువుల పాలిట యముడిగా మారిన విజయ్ కుమార్..
  • కోమటి కుంట చెరువు కబ్జా చేసి.. అభివృద్ది అంటూ కలరింగ్..
  • కబ్జాదారుడైనా విజయ్ కుమార్ పై కేసులు నమోదు చేసిన అధికారులు..
  • అక్రమాలను సక్రమం చేసే పనిలో మంత్రి కేటీఆర్…
    -కేసులు నమోదైనా రెరా వెబ్సైట్ నుండి తొలగించని వైనం..
  • రేరా మీద నమ్మకంతో ఇక్కడ ఫ్లాట్స్ అంతే సంగతులు..
  • కొనుగోలు దారులకు కుచ్చుటోపీ పెట్టి.. కోట్లు కొల్లగొడుతున్న సంస్థ..

కంచె చేనును మేసినట్లు.. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ఒక మంత్రి అక్రమార్కులకు భేషరతుగా మద్దతు ఇస్తుంటే.. మేధావి వర్గం ముక్కుమీద వేలేసుకుంటోంది.. ఇలాంటి ఘటనే మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని, బాచుపల్లి శివారులో జరుగుతోంది.. కోమటికుంట చెరువు కబ్జాదారుల చేత చిక్కి కనుమరుగైపోతోంది..

- Advertisement -

హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, బాచుపల్లి శివారులో ఉన్న కోమటికుంట చెరువు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కి కనుమరుగు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ కొనుగోలుదారులకు లేనివి ఉన్నట్లుగా చూపిస్తూ, అమాయక ప్రజలకు మోసం చేస్తూ కోట్ల రూపాయల నిధులను కొల్లగొడుతుంది.. కోమటికుంట చెరువులో భారీ నిర్మాణం చేసి, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ యజమాని విజయ్ కుమార్ పై నిజాం పేట మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులు బాచుపల్లి మండల పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన విషయం.. విజయ్ కుమార్ పై రెండు కేసులు నమోదైన విషయం విదితమే.. నేటికీ వాసవి నిర్మాణ సంస్థ యజమాని అక్రమాలపై విచారణ జరపకుండా, చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయకుండా, మున్సిపల్ అధికారులు మౌనంగా ఉండటం వెనుక మంత్రి హస్తం ఉందంటూ బాహాటంగానే చర్చలు వినిపిస్తున్నాయి..

ఆరోపణలు ఎదుర్కొంటున్న వాసవి సంస్థకే మంత్రి కెటిఆర్ చెరువును అభివృద్ధికి ఇవ్వాలంటూ అదేశాలివ్వడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుంది.. కోమటి కుంట చెరువును పూడ్చి.. దర్జాగా కబ్జా చేస్తున్నారని, పనులు నిలిపి వేయమన్న కమిషనర్ మాటలు బేఖాతరు చేస్తూ.. యదేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సామాన్య ప్రజలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేస్తే మున్సిపల్, పోలీస్, టాస్క్ ఫోర్స్ అధికారులు మమేకమై తక్షణమే కూల్చి వేసి, చర్యలు చేపట్టిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.. మున్సిపల్ శాఖలో సామాన్యులకు ఒక్క చట్టం.. ధనికులకు మరో చట్టామా..? అంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చెరువుల పాలిట యముడిగా మారిన విజయ్ కుమార్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా ఉండటం, చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ శాఖ మంత్రి చెరువులో అభివృద్ధి పేరుతో కబ్జాలకు పాల్పడుతున్న వాసవి అర్బన్ సంస్థ కు ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది..
చెరువు కబ్జా చేసిన వాసవి అర్బన్ సంస్థ అక్రమాలను సక్రమం చేసే పనిలో మంత్రి స్థానిక సంబంధిత అధికారులతో మంతనాలు నడుపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఒక్క అక్రమాన్ని సక్రమం చేసే పనిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ నిధులను సైతం దారి మళ్ళించడం.. అభివృద్ది పేరుతో ముమ్మాటికీ అక్రమాలు చేయడమే అవుతుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు..

వాసవి నిర్మాణ సంస్థపై కేసులు నమోదైనా.. రెరా వెబ్సైట్ నుండి నేటికీ తొలగించక పోవడం.. పిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం.. రాష్ట్రంలో రెరా చట్టం అమలు అవుతుందా..? లేదా మంత్రి అండగా ఉన్న సంస్థ కాబట్టే రేరా నిబంధనలు వర్తించవా..? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. భావితరాలకు ఉపయోగపడే చెరువులను చేరబట్టి, చెరువును మట్టితో పూడ్చడం.. వాల్టా చట్ట నిబంధనలను ముమ్మాటికీ ఉల్లగించినట్లే అవుతుంది.. కొనుగోలుదారులు వాసవి అర్బన్ అక్రమాలను, పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ పై నమోదైన కేసులను, చెరువులో కట్టిన నిర్మాణాన్ని చూడకుండా కొనుగోలు చేసినట్లైతే, రేపు రాబోయే రోజుల్లో వర్షాలకు కూలిపోయి ప్రాణం నష్టం జరిగే ప్రమాదం ఉందని పలువురు మేదావులు, ప్రతిపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి, అమాయక ప్రజలు ఇందులో ప్లాట్లు కొని నష్ట పోకుండా, అన్యాక్రాంతం అవుతున్న కోమటి కుంట చెరువు కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రేరా నుండి తొలగించాలనే, డిమాండ్లు సైతం వెల్లు వెత్తుతున్నాయి.. కొనుగోలుదారులకు మాయ మాటలు చెప్పి, కుచ్చుటోపీ పెడుతున్న వాసవి అర్బన్ పై.. వారి అక్రమాలపై విచారణ జరిపి, చేస్తున్న కబ్జాలపై దృష్టి సారించి.. కొనుగోలుదారులు నష్ట పోకుండా చూడాలని, లేకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామని పలువురు హెచ్చరిస్తున్నారు.. వాసవి అర్బన్ సామాన్య ప్రజలకు చేస్తున్న మోసం, చేస్తున్న అక్రమాలకు సంబంధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది.. ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు