Wednesday, February 28, 2024

అర్హుల‌కు సున్నం.. అన‌ర్హుల‌కు బెల్లం..

తప్పక చదవండి
  • టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జూనియర్‌ లైన్‌మన్‌ పరీక్షలో అంతా అవ‌క‌త‌వ‌క‌లే
  • మాస్‌ కాపీయింగ్‌తో నష్టపోయిన టాలెంట్‌ కల్గిన అభ్యర్థులు
  • అధికారుల అండదండలతో అన‌ర్హుల‌కు ఉద్యోగాలు
  • గ‌త ప్ర‌భుత్వ నాయ‌కుల అండ‌తో ఈ వ్య‌వ‌హ‌రం జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు
  • అర్హుల‌కు పాత‌రేసి.. అన‌ర్హుల నుండి ల‌క్ష‌ల్లో దండుకున్న అధికారులు
  • జూనియర్‌ లైన్‌మన్‌ల నియమాకాలపై ప్ర‌భుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండలం విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)లో జూనియర్‌ లైన్‌మన్‌ పరీక్షలో జరిగిన అక్రమాలు అంత ఇంత కావు. ఈ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది మొదలుకోని ఏడీఈ, సబ్‌ ఇంజనీర్లు కలిసి బయటి వ్యక్తులతో సంబందాలు ఎర్ప‌ర్చుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ లైన్‌మన్‌ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగుల నుండి డబ్బులు వసులు చేసి మోసాలకు పాల్పడిన అధికారులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏలాంటి ఫ‌లితాలు రాబట్టలేక పోయారు. విద్యుత్‌ శాఖలో జూనియర్‌ లైన్‌మన్‌ ఉద్యోగాలకు జరిగిన అర్హత పరీక్షలో మాస్‌కాపియింగ్‌ జరగడంతో శిక్షణ శిబిరాల్లో శిక్షణ పోందిన అనేక మంది, కష్టపడి చదివిన విద్యార్థులకు నిజంగా అన్యాయం జరిగిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో 11వందల జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టులకు గాను 2018 డిసెంబర్ 28వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలచేసి 2019 ఫిబ్రవరి 2న రాత పరీక్షలు నిర్వహించింది.

అయితే ఈపరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ, ఏలాంటి అర్హత సాధించని అభ్యర్థులు 2019లో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 2500మంది జూనియర్‌ లైన్‌మన్‌ల నియమకాల కోసం 2019 సెప్టెంబర్‌28న నోటిఫీకేషన్‌ వేసి, మూడు నెలల తరువాత 2019 డిసెంబర్‌ 15న రాత పరీక్షలు నిర్వహించింది. ఇది ఇలా ఉండగా ట్రాన్స్‌కో జూనియర్‌ లైన్‌మన్‌ల నియమకాల కోసం 2019 డిసెంబర్‌ 15న రాత పరీక్షలు నిర్వహించినపుడు ఈ పరీక్షలో మాత్రం టాప్‌ టెన్‌ మార్కులు సాధించారు. దీంతో టాప్‌ టెన్‌లో నిలిచిన అభ్యర్థుల వివరాలను సేకరించడంతో అసలు విషయం బయటపడింది. 2019లో జరిగిన పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ జరిగిందని, కష్టపడి చదివిన అభ్యర్థులకు మాత్రం తీర‌ని అన్యాయం జరిగిందని పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు బోరుమంటున్నారు. పరీక్ష ఫలితాల అనంతరం 2500అభ్యర్థులకు గాను 1747 మంది అభ్య‌ర్థ‌లను అధికారులు ఉద్యోగాల్లో నియమించారు. రాత పరీక్షల అనంతరం అర్హులైన వారికి విద్యుత్ స్థంబాలు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అవకతవకలకు పాల్పడిన అధికారులు పోల్‌టెస్ట్‌లో 1#2 నిష్పత్తి ప్రకారం పరీక్షలు నిర్వహించిన్నప్పటికిని వారికి అనుకులంగా ఉన్న వారినే ఎంపికచేయడం జరిగింది. విద్యుత్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న కార్మికులకు మాత్రం సర్వీస్‌ వెయిటేజ్‌ కింద 20 మార్కులు కలిపి ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇక్కడ కూడా సర్వీస్‌ వెయిటేజ్‌ లేని అభ్యర్థులు ఉన్నట్లు సృష్టించి అధికారులు చేతులు దులుపుకున్నారు.

- Advertisement -

2022లో వేయ్యి మంది జూనియర్ లైన్‌మన్‌ ఉద్యోగాల నియమకాలకు సంబంధి టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 2022 జూలై 17వ తేదీన రాత పరీక్షనిర్వహించింది. లైన్‌మన్‌ ఉద్యోగ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ జరిగిందని అప్పట్లో రాచకొండ, హైదరాబాద్‌ పోలీసులు గుర్తించిన్నప్పటికీ ఏలాంటి చర్యలు తీసుకోలేక పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఆర్హత పరీక్షలో ఘట్‌కేసర్‌లోని కొమ్మరి ప్రతాప్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రంలో పరీక్ష హాల్‌లో ఒక అభ్యర్థి చరవాణిలో వస్తున్న సందేశాల ఆధారంగా పరీక్ష రాశాడు. ఇన్విజిలేటర్‌ గమనించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఐదుమంది అధికారులు, పరీక్ష రాస్తున్న అభ్యర్థుల నుంచి రూ. లక్షల్లో డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు. పరీక్ష గదిలోకి చరవాణిని రహస్యంగా తీసుకువెళితే సమాధానాలు పంపుతామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో అప్పట్లో ఈ నోటిఫికేషన్‌ను రద్ధు చేశారు. రద్ధయిన 1000 పోస్టులకు అదనంగా మరో 553 పోస్టులను చేర్చి మొత్తం 1553 జూనియర్‌ లైన్‌మన్‌ల నియమకాల కోసం 2023 ఫిబ్రవరి 22న నోటిఫీకేషన్‌ వేసి 2023 ఎప్రిల్‌ 30వ తేదీన ప‌రీక్షలు నిర్వహించింది.

మాస్‌ కాపీయింగ్‌తో టాప్‌ మార్క్‌లు..
తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండలం విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)లో జూనియర్‌ లైన్‌మన్‌ పరీక్ష 2019నోటిఫికేషన్‌లో కొంత మంది అభ్యర్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడి ఎక్కువ మార్కులు సాధించి ఉద్యోగం పోందారని పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఒకరైన కమతం వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఈ రాత పరీక్షలో టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే 2018లో తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో నిర్వహించిన జూనియర్‌ లైన్‌మన్‌ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షలో కనీసం క్వాలీఫై మార్కులు కూడా రానివారు 2019నోటిఫికేషన్‌లో జరిగిన పరీక్షలో అధికంగా మార్కులు పొందడంతో తమ అనుమానం నిజమైందని, ఈ పరీక్షలో పథకం ప్రకారమే మాస్‌కాపీయింగ్‌తో టాప్‌ మార్క్‌లు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని, నిజంగా కోచింగ్‌లకు వెళ్లి, కష్టపడి చదివిన 45 మార్కులు సాధించామని, మాలాంటి వారికి మాత్రం తగిన న్యాయం జరుగలేదని వెంకట్‌రెడ్డి వాపోయాడు. రెండు పర్యాయాలు నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను పరిశీలించగా.. 2019లో జరిగిన పరీక్షలో శేఖర్‌రెడ్డి మాలే 59 మార్కులు సాధించగా, అంతకు ముందు జరిగిన 2018 ట్రాన్స్‌కో నిర్వహించిన జూనియర్‌ లైన్‌మన్‌ రాత పరీక్షలో కనీసం క్వాలీఫై మార్కులు కూడా రాకుండా కేవలం 25 మార్కులు సాధించారు, ఇదే విధంగా పై అభ్మర్థులందరూ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణం ప్రక్క గ్రామాల సదరు అభ్యర్థులందరూ ఒకే ఏరియాకు చెందినవారు కావడం గమన్హరం. ఆదే విధంగా నల్లగొండతో పాటు సూర్యపేట, హైదరాబాద్ జిల్లాల్లో కూడా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని వెంకట్‌రెడ్డి ఆదాబ్ కు వివరించారు.

మరోక విషయం ఎమిటంటే సూర్యపేట జిల్లాలో ఎంపికైన అభ్యర్థి పేరు డీగోజు విజయ్‌ కుమార్‌గా మార్చడం జరిగింది. ఇట్టి విషయాలపై తగిన న్యాయం చేయాలని అర్హులైన అభ్య‌ర్థులు కోరారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ 2019లో నిర్వహించిన పరీక్షలో టాప్‌ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో కోంత మంది మార్కులను పరిశీలించగా మునుగోటి స్వామి మొత్తం 80 మార్కులకు గాను 64 మార్కులు వస్తే అంతకు ముందు ట్రాన్స్‌కో నిర్వహించిన పరీక్షలో 26 మార్కులు సాధించి క్వాలీఫై కూడా కాకపోవడం విశేషం. నర్సింగోజు నరసింహచారికి 64 మార్కులు రాగా, గత పరీక్షలో 21, సల్లోజు బిక్షమాచారి 63 మార్కులు రాగా, అంతకు ముందు పరీక్షలో 20, అల్వాల నరేందర్‌ 60మార్కులు పోందగా, అంతకు ముందు పరీక్షలో మాత్రం 17 మార్కులు పొందాడు. జటవత్‌ వినోద్‌ కుమార్‌కు 60 మార్కులు రాగా, అంతకు ముందు నిర్వహించిన పరీక్షలో 21 మార్కులు వచ్చాయని వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

నోటిఫికేష‌న్ జారీ చేసిన‌ప్పుడు నిరుద్యోగుల యువ‌కుల దృష్టి ప‌రీక్ష‌ల వైపు మ‌ళ్లుతుంది.. ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలు ఓర్చిన ప‌రీక్ష‌లొ ఉత్తీర్ణ‌త సాధించి ఉద్యోగాన్ని సంపాధించాల‌న్న సంక‌ల్పంతో రాత్రింబ‌ళ్ళు చ‌దివిన‌, ప్ర‌త్యేక కోచింగ్ సెంట‌ర్ల‌లో శిక్ష‌ణ పొంది ప‌రీక్ష రాసిన త‌మ‌కు అన్యాయం జ‌ర‌గ‌డం వెనుక టీఎస్ఎస్‌పీడీసీఎల్ అధికారులు, వారికి స‌హ‌క‌రించిన కొంత‌మంది ఉద్యోగులు, గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పెద్ద నాయ‌కుల కార‌ణంగా నిజ‌మైన త‌మ‌కు ఉద్యోగాలు ల‌భించ‌క రోడ్ల‌పాలు కావాల్సి వ‌చ్చింద‌ని వాపోయారు. ఇప్ప‌టికైనా నూత‌నంగా ఏర్ప‌డ్డ ప్ర‌భుత్వం ఈవిష‌యంపై స‌మ‌గ్రంగా విచ్చారించి దోషుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు