Thursday, February 29, 2024

పోటెత్తిన మహాలక్ష్ములు

తప్పక చదవండి
  • ఉచితబస్సు ప్రయాణ పథకం ప్రారంభం
  • లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్‌
  • జనసందోహంగా మారిన బస్టాండ్ లు
  • ఉచిత బస్సు ప్రయాణంతో ఫుల్ ఖుషీ
  • ఆర్థిక భారం తప్పిందన్న మహిళలు
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళల హర్షం
  • మంత్రులతో కలిసి ప్రయాణించిన సీఎం
  • కాలేజీ బాయ్స్ కు అమలు చేయాలంటూ డిమాండ్స్
  • ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10లక్షలకు పెంపు

హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారంలో వస్తే పేదల కష్టాల్ని తీర్చే ఆరు హామీల్ని అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండు పథకాలకు శ్రీకారం చుట్టింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకు తగ్గట్టుగానే ఆరోగ్య శ్రీ పరిధిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్‌, మంత్రులు, ప్రొటెం స్పీకర్‌ శనివారం ప్రారంభించారు. శాసనసభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీలలో ఉచితం. అసెంబ్లీ ఆవరణలో మూడు బస్‌లను ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం సీఎం రేవంత్‌ ప్రారంభించారు. ఇదే సందర్భంలో వరల్డ్‌ ఛాంపియన్‌, కామన్వెల్త్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్‌ను రేవంత్‌ అందించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజన్నారు. 2009, డిసెంబర్‌ 9న తెలంగాణ పక్రియ ప్రారంభమైందన్నారు. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు. తనది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని రేవంత్‌ కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారన్నారు. ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామ న్నారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించ వచ్చన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని రేవంత్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతి కుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణ నుంచి ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

- Advertisement -

ఐడీ చూపిస్తే జీరో టికెట్
‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలు తొలుత వారం రోజులు ఎలాంటి ఐడీ కార్డు లేకుండానే బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని పొందవచ్చు. ఆ తర్వాత ఆధార్ వంటి ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రయాణ సమయంలో ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపిస్తే, ఆ వెంటనే వారికి జీరో టికెట్ మంజూరు చేస్తారు. ఈ పథకం కింద ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితులు లేవని సర్కారు స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని పేర్కొంది.

మహిళల హర్షం
ఉచిత బస్సు ప్రయాణం ‘మహాలక్ష్మి’ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్ సర్వీస్ తమకు ఓ వరమని విద్యార్థినులు, సాధారణ ఉద్యోగినులు అంటున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు జీతాలు వచ్చే వారికి దాదాపు రూ.2 వేలు ప్రయాణాలకే పోతుందని, అలాంటి సమయంలో ప్రభుత్వం ఈ పథకం కింద ఉచిత ప్రయాణం అమలు చేయడం సరైన నిర్ణయమని ప్రశంసిస్తున్నారు. నేడు చాలా వరకూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, విద్యార్థినుల కోలాహలం కనిపించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో రద్దీ పెరిగింది. అయితే, బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, బస్సు సర్వీసులను పెంచి ఇబ్బందులు లేకుండా చూడాలని మహిళామణులు కోరుతున్నారు.

ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు
ఆరోగ్య శ్రీ విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం పట్ల తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ వైద్య ఖర్చును 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నిర్ణయం తక్షణం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. ఇప్పటి వరకూ ఆరోగ్య శ్రీ పధకంలో 5 లక్షల వరకే ఖర్చుకు పరిమితి ఉంది. ఇక నుంచి ఈ పరిమితి 10 లక్షలకు పెరిగింది. 2004లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పధకాన్ని తొలిసారిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో ప్రస్తుతం 77 లక్షల 19 వేలమందికి ఆరోగ్య శ్రీ కార్డులున్నాయి. రాష్ట్రంలో 1310 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉండగా ఇందులో 293 ప్రైవేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పధకంలో 1376 శస్త్ర చికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు