Saturday, May 4, 2024

షోలాపూర్‌ చేరుకున్న సిఎం కేసీఆర్..రాత్రికి ఇక్కడే బస చేసిన ముఖ్యమంత్రి..

తప్పక చదవండి
  • నేడు విఠలేశ్వరున్ని దర్శించుకోనున్న కేసీఆర్..
  • వెయ్యి కిలోల పూలతో మూడు హెలికాప్టర్లతో
    భక్తులపై పూల వర్షం కురిపించేందుకు ప్లాన్

షోలాపూర్‌, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్లకాన్వాయ్‌తో బయలుదేరి వెళ్ళారు. మధ్యాహ్నం ధారాశివ్‌ జిల్లా ఒమర్గాలో మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం సోలాపూర్‌కు చేరగా.. ముఖ్యమంత్రికి బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌ రాత్రి సోలాపూర్‌లోనే బస చేశారు.. కాగా నేటి ఉదయం 8 గంటలకు పండరీపురానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ రుక్మిణీ సమేత విఠేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. జిల్లా నేత భగీరథ్‌ బాల్కే సహా పలువురు నాయకులు సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతారు. ఆ తర్వాత ధారాశివ్‌ జిల్లాలో కొలువుదీరిన శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యే, సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

అయితే.. ఈ పవిత్ర క్షేత్రం సాక్షిగా.. మరాఠా ప్రజలను ఆకర్షించేందుకు అద్దిరిపోయే స్కెచ్ వేశారు గులాబీ బాస్. ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాద‌శి.. మహత్తరమైన రోజుగా ప్రసిద్ధి. అయితే.. ఈ ఏకాదశి పండుగ రోజున అక్కడి ప్రజలు.. భారీ సంఖ్యలో విఠ‌లేశ్వరుడి ద‌ర్శనం కోసం తరలిరానున్నారు. అయితే.. ఆ భ‌క్తుల‌ను ఆకర్షించేందుకు.. వారిపై పూల వ‌ర్షం కురిపించాలని నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌పై సుమారు వెయ్యి కిలోల గులాబీ పూల వర్షాన్ని కురింపించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ వివరించారు. ఇందుకోసం.. 3 హెలికాప్టర్లను ఏర్పాటు చేసినట్టు బాల్క సుమన్ తెలిపారు. అయితే.. భక్తులపై గులాబీ పువ్వుల వర్షం కురిపించేందుకు స్థానిక ప్రభుత్వ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

- Advertisement -

అయితే.. మొదటి నుంచి మహారాష్ట్రలో జరుగుతున్న బీఆర్ఎస్ కార్యక్రమాలను ఎమ్మెల్యే బాల్క సుమన్, జీవన్ రెడ్డి తదితరులు దగ్గరుండి చూసుకుంటున్నారు. కాగా.. సోలాపూర్‌లో బీఆర్ఎస్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లను బాల్క సుమ‌న్ ప‌రిశీలిస్తున్నారు. అయితే.. సోలాపూర్‌కు సీఎం కేసీఆర్ ఏకంగా 600 కార్ల కాన్వాయ్‌తో బయలుదేరారు. దారి పొడవునా.. కేసీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. మహారాష్ట్రకు చెందిన పలువురు కీలక నేతలు బీఆర్ఎస్‌లో చేరనుండగా.. వారికి కేసీఆర్ సాదర స్వాగతం పలకనున్నారు. నేడు విఠలేశ్వరున్ని దర్శించుకుని.. అటునుంచి అటు తుల్జా భవాని అమ్మవారి దర్శనం చేసుకుని.. మళ్లీ తిరిగిన రోడ్డు మార్గం ద్వారానే హైదరాబాద్ చేరుకోనున్నారు కేసీఆర్.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు