Wednesday, May 15, 2024

ఎస్సారెస్పీ కెనాల్ భూమిని కబ్జా చేసిన ” రావుస్ లాబొరేటరీస్ ఫార్మా “..

తప్పక చదవండి
  • కబ్జాకు గురైన ఎస్సారెస్పీ కెనాల్ భూమి..
  • సంపద వనాల ఏర్పాటుకు అధికారుల తిప్పలు..
  • కెనాల్ కు సంబంధించిన భూమిలో ఫార్మా కంపెనీ అక్రమ నిర్మాణం..
  • ఓ మండల అధికారి చేష్టలతో తలలు పట్టుకుంటున్న అధికారులు..
  • సంపద వనాలు లక్ష్యం సాధించాలని ఉన్నతాధికారుల ఒత్తిడి..

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ దశాబ్ది ఉత్సవాల పేరుతో గ్రామాలలో పచ్చదనం పెంపొందించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీలలో “సంపద వనాలు” ఏర్పాటు చేసి, లక్షకు పైగా మొక్కలు నాటాలనే సంకల్పంతో ఎస్.ఆర్.ఎస్.పి. కెనాల్ వెంట ఉన్న స్థలాలలో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించింది. అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా పరిధిలోని తిరుమల గిరి, నాగారం, జాజి రెడ్డి గూడెం, తిమ్మాపురం, సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు (ఎస్), పెన్ పహాడ్ గ్రామ పంచాయతీలలో సంపద వనాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మండల అధికారులు హుటాహుటిన స్థలాలను గుర్తించి మొక్కలు నాటే పనిలో పడ్డారు.

ఫార్మా కంపెనీ అయితే ప్రభుత్వ భూమి కబ్జా చేస్తారా..?
సూర్యాపేట ఖమ్మం రహదారి చివ్వెంల శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ పక్కనే “రావుస్ లాబొరేటరీస్” ఫార్మా పేరుతో ఓ కంపెనీ నడుస్తుంది. ఈ కంపెనీ యాజమాన్యం చెప్పే మాటలు ఎంతో పద్ధతిగా ఉంటాయి. కానీ వీరు చేసే పనులు మాత్రం వారి మాటలకు, వ్యవహార శైలికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ కంపెనీ నిర్వాహకులు ఎస్సారెస్పీ కెనాల్ కు కొద్దిపాటి దూరంలో నిర్మాణం చేపట్టారు. ఆ కంపెనీ యాజమాన్యం మెల్లమెల్లగా ఎస్సారెస్పీ కెనాల్ సంబంధించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అందులో ప్రహరీ గోడ సైతం నిర్మాణం చేశారు. అక్కడే చుట్టూ పట్టు ఉన్న కొంతమంది రైతులు, ఎస్.ఆర్.ఎస్.పి. కెనాల్ భూమిని మలుపుకున్న రైతుల దగ్గర నుండి అధికారులు స్వాధీనం చేసుకొని, అందులో హద్దులు చూసి, ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటారు. “రావుస్ లాబొరేటరీస్ లిమిటెడ్” ఫార్మా కంపెనీ యాజమాన్యం కబ్జా చేసి, అక్రమ గోడ నిర్మాణం చేసిన ప్రాంతాన్ని అధికారులు వదిలేయడంతో రైతులు అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. అమాయక రైతుల వద్ద భూమిని లాక్కొని అందులో మొక్కలు నాటిన అధికారులు, ఫార్మా కంపెనీ యాజమాన్యం ఆక్రమిస్తే, వారిపై చర్యలు తీసుకోకుండా వెనుకేసుకొస్తున్న అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సంపద వనాల ఏర్పాటుకు ఆ అధికారి అడ్డు.. :
మండల పరిధిలోని ఎస్సారెస్పీ కెనాల్ వెంట ఉన్న భూమిలో సంపద వనాల పేరుతో మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు సమయత్వం అవుతుంటే, చివ్వెంల మండల కేంద్రంలో పనిచేస్తున్న ఓ అధికారికి సంభందించిన బంధువుల భూమి ఉండ్రుగొండ సమీపంలో కొంత ఉందని, ఆ భూమికి పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ సంబంధించిన భూమిని కూడా స్వాధీనం చేసుకొని అందులో వ్యవసాయం చేస్తున్నారు. సంపద వనాల కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారులకు ఉండ్రుగొండ, వల్లభాపురం గ్రామాలకు చెందిన రైతులు అడ్డుపడడంతో చేసేదేమీ లేక అధికారులు వెనక్కు తిరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ భూమిలో మొక్కలు పెట్టకుండా రైతులకు పలు సూచనలు చేసి, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని మంత్రి క్యాంప్ ఆఫీస్ కు పంపి, మండల అధికారులపై క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేసే విధంగా మండలంలోని ఆ అధికారి చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. వీరి చేష్టలతో ఇతర శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకపక్క జిల్లా ఉన్నతాధికారులు, సంపద వనాలను ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని మండల అధికారులపై ఒత్తిడి తెస్తుంటే, మండలంలోని అధికారి చేష్టలకు, మిగతాధికారులకు పాలుపోని స్థితిలో ఉన్నారు. ఎంపీడీఓ లక్ష్మి వివరణ.. ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ సంబంధించిన భూమిలో “రావుస్ లాబొరేటరీస్ లిమిటెడ్” కంపెనీ వారు అక్రమ గోడ నిర్మాణం చేసిన విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. వారికి నోటీసులు ఇచ్చి అక్రమణకు గురైన ప్రాంతాన్ని గుర్తించి,ఆ ప్రాంతంలో మొక్కలు నాటుతామన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు