Saturday, April 27, 2024

ధరణి చుట్టూ రాజకీయం..

తప్పక చదవండి
  • ధరణి కారణంగా రైతులకు ఎడతెగని స‌మ‌స్యలు..
  • వైఫల్యాలను ఎత్తుచూపుతున్న ప్రతిపక్ష పార్ట్టీలు..
  • ధరణి వచ్చాక భూ దందాల‌కు బ్రేక్ ప‌డింద‌న్న బీఆర్‌ఎస్‌..
  • హద్దులు దాటిన అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం..
  • ప్రతి పక్షాలకు అధికార పక్షం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి..

తెలంగాణ‌లో మూడోసారి హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాల‌ని బీఆర్‌ఎస్‌ భావిస్తుండగా.. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. ఎన్నిక‌లు దగ్గర ప‌డ‌తుండ‌టంతో ప్రతి ప‌క్షాల‌ను క‌ట్టడి చేసేందుకు అన్ని అస్త్ర శ‌స్త్రాల‌ను అధికార పార్టీ నాయకులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ధరణి వంటి సంస్కరణలోని లోపాలను, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వైఫల్యాలను, సంక్షేమ పథకాల తీరు తెన్నులను ఎత్తి చూపుతూ బీఆర్‌ఎస్‌ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్‌, బీజేపీలు భావిస్తున్నాయి. ధరణితో తెలంగాణ ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్ళాయంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మరీ విమర్శనాస్త్రాలను గుప్పిస్తున్నారు.. ధరణి పోర్టల్‌లో బ్రిటీష్ ఐల్యాండ్‌కు పెట్టుబడులు ఉన్నాయ‌ని, అది మంత్రి కేటీఆర్ మిత్రుడు గాదె శ్రీధర్ రాజు ప్రమేయంతో జరిగిందని వస్తున్న ఆరోపణలు అధికార పార్టీని అయోమయంలో పడేస్తున్నాయి. ధ‌ర‌ణితో రాష్ట్రంలో ల‌క్షల ఎక‌రాలు మాయం అవుతున్నాయని, దీనిపై త్వరలోనే ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది.

ధరణి అంశాన్ని తెరమీదికి తెచ్చిన కాంగ్రెస్ :
ధరణి కారణంగా రైతులు ఇప్పటికీ పలు స‌మ‌స్యలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడు ధరణి అంశాన్ని తెరమీదికి తేవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రోహిబిష‌న్ లిస్ట్, వార‌స‌త్వ భూముల రిజిస్ట్రేష‌న్‌ కొన్ని మాడ్యూల్స్ రైతుల‌కు, అధికారుల‌కు స‌వాల్‌గా మారాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదు. కాంగ్రేస్ ధరణిలోని లోపాలను ఎత్తి చూపడమే గాక కొత్త ఆరోపణలతో ముందుకు వస్తుండటంతో అధికార పార్టీకి ఏంచేయాలో అర్ధం కావడం లేదు. ధరణి విదేశీయుల చేతిలో ఉందని రేవంత్‌ సంచలన ఆరోపణలు ఎక్కుపెట్టారు. రాత్రికి రాత్రే స‌ర్కార్ భూములు ప్రైయివేట్ వ్యక్తుల చేతులోకి వెళుతున్నాయని ఆరోపించడంతో, దీనికి కౌంట‌ర్ ఇవ్వాల‌ని అధికార పార్టీ సిద్ధమవుతోంది. రేవంత్ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌కు కౌంటర్‌గా, ప‌వ‌ర్ ఫుల్ ప్రజెంటేష‌న్‌కు మంత్రి కేటీఆర్ సిద్దం అవుతున్నారు. ధరణి వచ్చాక భూ దందాల‌కు బ్రేక్ ప‌డింద‌ని, దీన్ని ప్రతిప‌క్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

బీజేపీ కూడా ధరణిపై విమర్శలు గుప్పిస్తోంది :
కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా ధరణిని ప్రవేశపెట్టడంపై తీవ్ర విమర్శలు చేస్తోంది.. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని ఎత్తేవేస్తామని ఇప్పటికే బీజేపీ నేతలు పలుమార్లు ప్రకటించారు కూడా. ప్రతిపక్షాల దూకుడుకు సీఎం కేసీఆర్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇస్తూ వచ్చారు. ధరణిని తీసేస్తామనే వాళ్లని బంగాళాఖాతంలో కలపాలని పలు వేదికల మీద కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తానికి ధరణి చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు