Friday, September 20, 2024
spot_img

అధికారిక కార్యక్రమానికి అధికారులు ఎందుకు రాలేదు?

తప్పక చదవండి
  • ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదే…రావొద్దని ఎవరైనా బెదిరించారా?
  • కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు అధికారులు గైర్హాజర్ పై బండి సంజయ్ ఆగ్రహం
  • ఎవరొచ్చినా రాకున్నా కేంద్ర అభివ్రుద్ధి ఫలాలను ప్రజలకు అందించి తీరుతాం
  • కరీంనగర్ –హసన్ పర్తి రైల్వే లేన్ సాధించి తీరుతా…
  • కరీంనగర్ –తిరుపతి రైలును ప్రతిరోజు నడిచేలా రైల్వే మంత్రిని ఒప్పిస్తా
  • కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లను అభివ్రుద్ధి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం
  • అతి త్వరలోనే కరీంనగర్ రైల్వే స్టేషన్ ను సుందరంగా తీర్చిదిద్దబోతున్నాం…
  • రూ. 5 వేల కోట్ల రూపాయలతో కొనసాగుతున్న పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు
  • ఇప్పటికే 95.6 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తి… 178 కి.మీల మేర విద్యుద్దీకరణ పనులు పూర్తి
  • రూ. 1374 కోట్లతో 151 కిలోమీటర్ల మేరకు మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు
  • ఇప్పటికే పూర్తైన 65 కి.మీల మేరకు పనులు
  • కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు
  • ఉత్సాహంగా కొనసాగిన కార్యక్రమం… అలరించిన పిల్లల న్రుత్యాలు…
  • బండి సంజయ్ చేతుల మీదుగా నృత్యాలు చేసిన పిల్లలకు సర్టిఫకెట్లు ప్రదానం

కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా అధికారులు పాల్గొనకపోవడంపట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది రాజకీయ కార్యక్రమం కాదే… ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే కదా. ఆర్డీవో మినహా ఇతర అధికారులెవరూ ఎందుకు రాలేదు? మిమ్ముల్నెవరైనా బెదిరించారా?’’అంటూ ప్రశ్నించారు. ఎవరొచ్చినా రాకపోయినా కేంద్ర ప్రభుత్వ అభివ్రుద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్’’ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా రూ.25 వేల కోట్లతో 508 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ పనులను వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా 26 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు కరీంనగర్ ఆర్డీవో మహేశ్, దక్షిణ మధ్య రైల్వే అధికారులు క్రిష్ణారెడ్డి, కౌశల్ పాండే, స్థానిక కార్పొరేటర్లు కె.శ్రీనివాస్, జితేందర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్పొరేటర్లు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే లేన్ల ఏర్పాటు, కొత్త ఆర్వోబీ నిర్మాణం కోసం బండి సంజయ్ చేసిన కృషిని కొనియాడారు. సంజయ్ వల్లే కరీంనగర్ అభివృద్ధి జరుగుతోందన్నారు.

ప్రియతమనేత, దేశ ప్రధాని, ప్రపంచానికి బాస్ గా పిలవబడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా దేశంలోని రైల్వే స్టేషన్లన్నింటినీ అభివ్రుద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ను అమ్రుత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరించబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఇది రాజకీయ కార్యక్రమం కాదు… ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. ఆర్డీవో మినహా ఇతర అధికారులెవరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మిమ్ముల్నెవరైనా బెదిరించారా? మరి ఎందుకు రాలేదు? ఎవరొచ్చినా రాకపోయినా అభివ్రుద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తాం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు… ఎన్నికల తరువాత రాజకీయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ పదేపదే చెబుతూ పనిచేస్తున్న నాయకుడు… ఆ స్పూర్తితో పనిచేయకపోవడం బాధాకరం. ఈరోజు అమృత్ భారత్ పథకం కింద ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీగారు దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల రూపాయలతో 508 రైల్వే స్టేషన్లను ఆధునీకరించే ప్రక్రియకు ఈరోజు వర్చువల్ గా శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో మొత్తం 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలిదశలో ఈరోజు 21 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు 894 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.

- Advertisement -

నా పార్లమెంట్ పరిధిలో 26 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో కరీంనగర్ రైల్వే స్టేషన్ ను అభివ్రుద్ధి చేసే ప్రక్రియకు ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ తోపాటు రామగుండం రైల్వే స్టేషన్లను కూడా ఆధునీకరించబోతున్నాం. ఈరోజు వీడియోలో ఏ విధంగా చూపామో తూ.చ తప్పకుండా ఆధునీకరించి చూపబోతున్నాం. ఆధునీకరణ పనులు పూర్తయితే కరీంనగర్ స్టేషన్ అందంగా ముస్తాబై ప్రయాణీకులను అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అందుకోసం స్టేషన్ లో రూఫ్‌ ప్లాజాల, ప్లాట్‌ఫారాల నిర్మాణం జరుగుతుంది. స్టేషన్ గోడలపై స్థానిక కళారూపాలతో చిత్రాలు వేస్తారు. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, రెస్ట్‌ రూములు, వెయిటింగ్‌ రూములు, అదనపు కౌంటర్లు, బెంచీలు, పార్కింగ్, లైటింగ్, హైలెవల్‌ ప్లాట్‌ఫారాలు, రైళ్ల రాకపోకలను తెలిపే డిజిటల్‌ బోర్డుల ఏర్పాటుతోపాటు దివ్యాంగులకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పనుల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది.

గతంలో రైల్వే అభివ్రుద్ధి పనులకు పోతే 5 కోట్లు, 10 కోట్లు మాత్రమే ఇస్తూ… పనులు పూర్తికాకుండా చేసేవాళ్లు. డబ్బుల్లేక కాంట్రాక్టర్లు పనులు చేయలేక మధ్యలోనే వదిలేశారు. మోదీ వచ్చాక… ఒక్కసారి ఏదైనా పని ప్రారంభిస్తే… ఆ పని పూర్తయ్యే వరకు పూర్తి స్థాయి నిధులు కేటాయిస్తున్నారు. మోదీ పాలనలో తెలంగాణలో రైల్వేల అభివ్రుద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల అభివ్రుద్ధి, మౌలిక సదుపాయాలు, కొత్త లేన్ల ఏర్పాటు కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. 5 వేల కోట్ల రూపాయలతో పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నయ్. ఇప్పటికే 95.6 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తయ్యాయి. 178 కి.మీల మేరకు విద్యుద్దీకరణ పనులు కూడా పూర్తైనయ్. అట్లాగే మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టులో భాగంగా నా పార్లమెంట్ పరిధిలో 1374 కోట్ల రూపాయల ఖర్చుతో 151 కిలోమీటర్ల మేరకు చేపట్టిన పనులు కొనసాగుతున్నయ్. ఇప్పటికే 65 కి.మీల మేరకు పనులు కూడా పూర్తైనయ్. ఖాజీపేట నుండి బల్లార్షా వరకు (201 కి.మీ) మూడో లేన్ నిర్మాణ పనుల చేపట్టేందుకు 2 వేల 63 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అందులో భాగంగా రాఘవాపూర్ నుండి ఉప్పల్ (61కి.మీ)వరకు విద్యుద్దీకరణ పనులు కూడా పూర్తయినయ్. కరీంనగర్, ఉప్పల్, గంగాధర్ స్టేషన్లలో గూడ్స్ షెడ్స్ ను మెరుగుపర్చే పనులు కూడా పూర్తయ్యాయి. రైల్వే ప్రయాణీకుల భద్రతకు మోదీ గారి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జ్ (ఆర్ యూబీ), ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ) నిర్మాణాలకు మొదటి ప్రాధాన్యతనిస్తోంది. కరీంనగర్ ప్రజలు తీగలగుట్టపల్లి ఆర్వోబీ లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఒక రకంగా నరకం చూశారు. దీనికోసం కేంద్రం తొలుత 28 కోట్లను కేటాయించినా రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగలే. ప్రజల బాధలను అర్ధం చేసుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిస్తే సేతు బంధన్ పథకం కింద నిధులు కేటాయించారు. రూ.155 కోట్లతో పనులు ప్రారంభమైనయ్. అతి త్వరలోనే పూర్తి కాబోతోంది. నిధులన్నీ కేంద్రమే ఇస్తుంటే… కొంతమంది మాత్రం ఆ పైసలు మేమే ఇస్తున్నట్లు షో చేస్తూ మోసం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని బిజిగిరీషరీఫ్-జమ్మికుంట మధ్య 50 కోట్లతో ఆర్వోబీని నిర్మించింది. అట్లాగే ఉప్పల్ – జమ్మికుంట మధ్య 53 కోట్ల 64 లక్షలతో చేపట్టిన ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి. అట్లాగే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఖాజీపేట-బల్లార్షా లేన్ లో భాగంగా 20 కోట్ల రూపాయలతో రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ)లను నిర్మిస్తోంది. మనోహరాబాద్ –కొత్తపల్లి కొత్త లేన్ పనుల్లో భాగంగా 12 ఆర్ యూబీలను నిర్మిస్తోంది. 3 ఇప్పటికే పూర్తయ్యాయి. కరీంనగర్, జమ్మికుంట, ఉప్పల్, బిజిగిరీ షరీఫ్ రైల్వే స్టేషన్లో రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసింది. ఆయా స్టేషన్లలో టాయిలెట్స్, వైఫై వంటి కనీస సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కరీంనగర్ –హసన్ పర్తి రైల్వే లేన్ నిర్మాణం కోసం నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. కేంద్ర మంత్రిని కలిసి విజ్ఝప్తి చేశాను. సానుకూలంగా స్పందించిన కేంద్రం 20 కోట్లను వెచ్చి సర్వే పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కచ్చితంగా ఈ లేన్ ను సాధించి తీరుతాం. కరీంనగర్‌ నుంచి తిరుపతికి బయల్దేరే బైవీక్లీ ఎక్స్ ప్రెస్‌ (వారానికి రెండు రోజులే) చాలా రద్దీగా ఉంటుంది. ప్రతి ఆదివారం, గురువారం ఈరైలు వస్తుందంటే చాలు స్టేషన్‌ అంతా ప్రయాణీకులు, వాళ్ల బంధువులతో కిక్కిరిసిపోతుంది. ఈ రైలును ప్రతిరోజు నడిచేలా చూడాలని ఎంతోమంది ప్రయాణీకులతోపాటు మీడియా మిత్రుల నుండి కూడా ఆర్జీలు వస్తున్నాయి. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ద్రుష్టికి తీసుకెళ్లి ప్రతిరోజు కరీంనగర్ – తిరుపతి రైలు నడిచేలా కృషి చేస్తా అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు