ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తాను ఈ కార్యక్రమాన్ని చూశానని, తాను అక్కడికి వెళ్లకపోవడం పట్ల సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగింది చూసి తాను కలత చెందానని అన్నారు. ఈ కార్యక్రమం కేవలం కొద్ది మందికే పరిమితమా అని పవార్ ప్రశ్నించారు. విపక్షాలు లేకుండా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించడంతో ఇది పరిపూర్ణ కార్యక్రమం కాదని పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ఎన్‌సీపీ నేత సుప్రియ సూలే వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి చోటు లేదని ఈ అంశం తేటతెల్లం చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి లోక్‌సభ చాంబర్‌లో చారిత్రక రాజదండాన్ని ప్రతిష్టించారు. మరోవైపు ప్రధాని రాజులా వ్యవహరిస్తూ పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని తన పట్టాభిషేక కార్యక్రమంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.