కర్నాటకలో కాషాయ పార్టీని మట్టికరిపించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల హామీల అమలుపై ఒత్తిడి పెరుగుతోంది. కర్నాటక పవర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో నియామక ప్రక్రియను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ దాదాపు 1500 మంది ఉద్యోగార్ధులు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఆయన నివాసంలో కలిశారు.
ఉద్యోగ నియామకాలను వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని వారు పట్టుపట్టారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని తాము ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం తమ బాధ్యతని స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించి అర్హులందరికీ ఉపాధి కల్పించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతాంశమని వివరించారు. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ కసరత్తును తాము చేపట్టామని, ఇది ఒకట్రెండు రోజుల్లో పూర్తవుతుందని తాను చెప్పలేనని, కానీ నియామకాల ప్రక్రియ జరిగి తీరుతుందని శివకుమార్ ఉద్యోగార్ధులకు భరోసా ఇచ్చారు.