సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై స్పందించి, విద్యార్దులకు అండగా నిలవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసి విన్నవించినట్లు టి.పి.సి.సి ఎలక్షన్ కమీషన్ కో- ఆర్డినేషన్ కమిటి సభ్యులు, న్యాయవాది నాగులూరి క్రిష్ణ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓయూ లా కళాశాల విద్యార్ది నాయకుడితో, సీతక్కను ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా క్రిష్ణ కుమార్ మాట్లాడుతూ గత కొంత కాలంగా ఓయూ లో సమస్యలు విలయతాండవం చేస్తున్న వర్సిటీ అధికారులు పట్టించుకోవడంలేదన ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇష్టారాజ్యాంగ ఫీజులు పెంచడం, పాఠాలు పూర్తిగా చెప్పకుండానే పరీక్షలు నిర్వహించడంతో విద్యార్దులు ఆందోళన బాట పట్టినట్లు చెప్పారు. వానలో తడుస్తూ విద్యార్థినిలు రోడ్డుపై గంటల కొద్ది కూర్చున్న అధికారులు స్పందించక పోవడం బాధాకరం అన్నారు. ఓయూ ను సందర్శించి, సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.