Wednesday, October 16, 2024
spot_img

మల్కాజ్ గిరి పొలిటికల్ మాస్టర్ ఎవరు..?

తప్పక చదవండి
  • సత్తా చాటాలని చూస్తున్ననాలుగు పార్టీలు..
  • ఇక్కడ నుంచి పార్లమెంట్‌లో పాగా వేస్తే జంటనగరాల్లో గ్రిప్‌..!
  • బీఆర్ఎస్‌ నుంచి మైనంపల్లి, మంత్రి మల్లారెడ్డి పేర్ల పరిశీలన..!
  • మేడ్చల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెడుతున్నదెవ్వరు.?
  • వన్ సైడ్ కానున్న మల్కాజ్‌గిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి గెలుపు..
  • ఉప్పల్‌ బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు.. టిక్కెట్ కోసం ట్రయాంగిల్ ఫైట్. .!
  • కుత్బుల్లాపూర్‌ బీజేపీ అభ్యర్థికి టీడీపీ నుంచి గండం..?
  • కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావుకు హ్యాట్రిక్ కొట్టడం సాధ్యమేనా..?
  • సాయన్నఅకాల మరణంతో కంటోన్మెంట్ బరిలో కొత్త వ్యక్తికి ఛాన్స్..
  • ఎల్బీనగర్‌ బీఆర్ఎస్‌ నుంచి సుధీర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్ మధ్య పోటీ..
  • కాంగ్రెస్ నుంచి మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బరిలో నిలుస్తారని టాక్..

మల్కాజ్‌గిరి ఆసియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం .. 31 లక్షల 50 వేల 313 మంది ఓటర్లతో తెలంగాణలోని మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానంగా నిలిచింది. ఇక్కడ 16 లక్షల 38 వేల 54 మంది పురుషులు, 15 లక్షల 11వేల 910 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అత్యధిక పురుష, మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా మల్కాజ్గిరి జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచింది. ఈ నియోజకవర్గంలో జరిగే ఎన్నికలపై రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చే జరుగుతుంది. దీంతో ఈ సారి జరిగే ఎన్నికల్లో మల్కాజ్ గిరిపై పట్టుకోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీగట్టిగా పోటీపడుతూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మల్కాజ్‌గిరిలో రాజకీయం ఎలా ఉండబోతుందన్న దానిపై రాజకీయవర్గాల్లో రసవత్తరమైన చర్చ నడుస్తోంది. మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఇక్కడ బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నఅంశాలేంటి..? బీజేపీకి బీఆర్ఎస్‌ ను డీకొట్టే సరైన అభ్యర్థులు ఉన్నారా..? కాంగ్రెస్‌ పట్టు నిలుపుకుంటుందా..? టీడీపీ నుంచి పోటీ చేసేది బీఆర్ఎస్‌, కాంగ్రేస్ అసమ్మతి నేతలేనా..? లేక కొత్త నాయకులకు టీడీపీ టికెట్ ఇస్తుందా..? ప్రధాన పార్టీలకున్నబలం ఏంటి..? బలహీనత ఏంటి..? మల్కాజ్‌గిరి చుట్టూ చక్కర్లు కొడుతున్న రాజకీయ ముఖచిత్రంపై ఆదాబ్ ప్రత్యేక కథనం ..

  • “వాసు” పొలిటికల్ కారెస్పాడెంట్ ..

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో పాగా వేస్తె జంటనగరాల్లో గ్రిప్‌ దొరుకుతుంది అన్నది అన్ని పార్టీల మనోభావం.. మల్కాజ్‌గిరి ఆసియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ! ఈ లోక్‌సభ స్థానాన్ని మినీ ఇండియా అనికూడా పిలుస్తుంటారు.. గడిచిన ఎన్నికల్లో జరిగిన రాజకీయాలు వేరు.. ఇప్పటి నుంచి జరిగేవి వేరు అన్నచందంగా పరిస్థితులు మారిపోయాయి. దేశ రాజకీయాల్లో వెలుగు వెలుగుదామని రెడీ అవుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ కూడా మల్కాజ్‌గిరి స్థానంపై సీరియస్ గానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి మోదీ పోటీ చేసే చాన్స్ ఉందని గతంలో వార్తలు కూడా వినిపించాయి. ఇక కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ సారి బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ నిలిపే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది.. ఇక టీడీపీ విషయానికొస్తే టీడీపీకి మల్కాజ్‌గిరిలో మంచి ఓటు బ్యాంకు ఉంది.. ఈ సారి టీడీపీ ఎలాగైనా తనకున్న ఓటుబ్యాంకుతో సీటును తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.. మల్కాజ్‌గిరి పై పట్టు సాధిస్తే.. జంటనగరాలు గ్రిప్‌లో ఉన్నట్లే అని ప్రచారం ఉంది. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మల్కాజ్‌గిరి గెలుపు కోసం సామ, దాన, భేద, దండోపాయాలు వాడుతున్నాయి. దీంతో మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ రాజకీయం రసవత్తరంగా మారింది.

- Advertisement -

మల్కాజ్‌గిరి సిట్టింగ్‌ ఎంపీగా రేవంత్ రెడ్డి :
బీఆర్ఎస్‌ నుంచి మైనంపల్లి హనుమంత రావు పేరుతో పాటు.. మంత్రి మల్లారెడ్డి పేర్ల పరిశీలన :
మల్కాజ్‌గిరిలో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకే పోటీ చేసే అవకాశం ఉనట్లు కాంగ్రేస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి.. ఇక్కడనుండి ఎంపీ బరిలో ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఆశావహులెవరూ ఇప్పటివరకు కనుచూపు మేరలో కనిపించనప్పటికీ రావాల్సిన సమయంలో బలమైన అభ్యర్థి పోటీలో ఉంటాడని కాంగ్రేస్ చెబుతోంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ.. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నారు. ఐతే ఆయన మరోసారి ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదని గాంధీభవన్‌ నుంచి వస్తున్న సమాచారం.. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు.. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. గులాబీ పార్టీ నుంచి మైనంపల్లి హనుమంత రావు పేరుతో పాటు..మంత్రి మల్లారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఎక్కువగా ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రాంతం మల్కాజ్ గిరి కావడంతో ఈ సీటుపై టీడీపీ కూడా ఎక్కువ ఆశలే పెట్టుకుంది. టీటీడీపీ నుంచి కాసాని వీరేష్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో టీడీపీ నుంచి వీరేష్ పోటీ చేస్తే బీఆర్ఎస్‌, కాంగ్రేస్, బీజేపీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

మేడ్చల్‌ లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మంత్రి మల్లారెడ్డికి వర్గపోరు :
మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి వర్గీయుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. మేడ్చల్ టికెట్ తమకే అంటూ ఇద్దరూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ విభేదాలు మల్లారెడ్డికి ఇబ్బందిగా మారాయి. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది..ఎన్నికల నాటికి ఈ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తోందో.. అన్న టెన్షన్ లో బీఆర్ఎస్‌ నాయకులున్నారు. కాంగ్రెస్ నుంచి సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డితో పాటు.. జంగయ్య యాదవ్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ను బలంగా ఢీకొట్టే అభ్యర్థి కోసం బీజేపీ వెతుకుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, సీనియర్‌ నేత మోహన్ రెడ్డి పేర్లు టికెట్‌ రేసులో వినిపిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా.. బలమైన నేతను చేర్చుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది.

మల్కాజ్‌గిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు :
బీజేపీ టికెట్‌ రేసులో రాంచంద్రరావు :
మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్‌ బలంగా ఉంది. మైనంపల్లికి స్థానిక నేతల మద్దత్తు కూడా ఉంది. మల్కాజ్‌గిరి స్థానం నుంచి ఆయన పోటీ చేస్తే గెలుపు పక్కా అని అంటున్నారు బీఆర్ఎస్‌ నేతలు. మైనంపల్లి హనుమంత రావు ఒకవేళ పార్లమెంటుకు పోటీ చేస్తే మంత్రి మల్లారెడ్డి ఈ సీటును అడిగే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మల్లారెడ్డితో మైనంపల్లికి ఏ మాత్రం పొసగడం లేదనే ప్రచారం ఉంది. గతంలో జిల్లా ఎమ్మెల్యేలంతా మైనంపల్లి ఇంట్లో భేటీ అయి.. మల్లారెడ్డి మీద తిరుగుబాటు బావుటా కూడా ఎగురవేశారు. ఈ వివాదం ప్రస్తుతానికి కూల్ అయినట్లు కనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ తరఫున 2014 నుంచి రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ ముఖ్య అనుచరుడిగా పేరున్న నందికంటి శ్రీధర్‌కే టికెట్ దాదాపు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రేస్ నుంచి పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో శ్రీధర్‌ ధీమాగా ఉన్నారు.

ఉప్పల్‌ బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు :
బీఆర్ఎస్ టిక్కెట్ కోసం ట్రయాంగిల్ ఫైట్ :
ఉప్పల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా భేతి సుభాష్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు.. ఈయనకు నియోజకవర్గంలో ఎదురుగాలి గట్టిగానే వీస్తోంది.. వార్డు మెంబర్ల నుంచి మొదలుకుని కార్పొరేటర్ల వరకు అందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నవారే. ఉప్పల్‌ నియోజకవర్గ అభివృద్ధికి భేతి సుభాష్ రెడ్డి నిధులు సమకూర్చుకోవడంలో విఫలమయ్యారని స్థానిక బీఆర్ఎస్‌ నేతలు ఆరోపించడం భేతికి మింగుడుపడని అంశంగా తయారయ్యింది. నియోజకవర్గంలో పార్టీ నాయకులను కలుపుకోకుండా ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వన్ మెన్ షో గా వ్యవహరిస్తున్నారని స్వంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వరని ఒకవేళ ఇచ్చినా గెలువరని బీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు బహిరంగానే మాట్లాడుకుంటున్నారు. ఇక ఉప్పల్‌ నుంచి టికెట్ ఆశిస్తున్నవారిలో మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మేయర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బొంతు రామ్మోహన్‌ నియోజకవర్గంలో పోటీచేస్తే పక్కాగా గెలుస్తారని ప్రచారం జరుగుతోంది.. ఉప్పల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గమంతా ఒక్కటయ్యి బొంతు రామ్మోహన్‌ ని పోటీకి నిలిపేందుకు గట్టిగా పట్టుబడుతున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్‌ అధిష్టానం బొంతుకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్‌ పక్కాగా గెలిచే స్థానాల్లో ఉప్పల్ కూడా ఒక్కటి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరుకున్న బండారి లక్ష్మారెడ్డి కూడా టికెట్‌ మీద కోటి ఆశలే పెట్టుకున్నారు. దీంతో ఉప్పల్ బీఆర్‌ఎస్‌లో ట్రయాంగిల్ టికెట్ ఫైట్‌ ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి టికెట్‌ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కమలం పార్టీ నుంచి ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్‌తో పాటు వీరేందర్ గౌడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి .అయినా బీజేపీ ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్‌కె మొగ్గుచూపే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి పేర్లు టికెట్‌ రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రేస్-టీడీపీ మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కాంగ్రేస్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్‌ కేడర్‌ ఛిన్నాభిన్నం అయిపోయింది.

కుత్బుల్లాపూర్‌ లో బీజేపీ నుంచి పోటీకి సైఅంటున్న కూన శ్రీశైలం గౌడ్‌ :
బీఆర్ఎస్ టిక్కెట్ తనకేనన్న ధీమాలో వివేకానంద గౌడ్ :
పారిశ్రామిక ప్రాంతం అయిన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నుంచి వివేకానంద గౌడ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో టికెట్ తనకే కేటాయిస్తారని వివేకానంద గౌడ్ ధీమాగా ఉన్నారు. ఐతే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా ఇక్కడి నుంచి అసెంబ్లీ బరిలో నిలవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శంభీపూర్ రాజు.. మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు ఇప్పటికిప్పుడు బయటకు కనిపించకున్నా.. ఎవరికి వారు అలర్ట్‌గా ఉంటూ స్వంత కేడర్‌ను ఏర్పాటుచేసుకునేపనిలో పడ్డారు. ఇద్దరిలో ఎవరి వైపు నిలవాలో తెలియక గులాబీ పార్టీ శ్రేణులు కన్ఫ్యూజన్‌లో కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిన కూన శ్రీ‌శైలం గౌడ్‌.. ప్రస్తుతం కాషాయం కండువ కప్పుకుని బీజేపీ నుంచి పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ కీలక అనుచరుడు నర్సారెడ్డి భూపతి రెడ్డికి టిక్కెట్ ఖాయమనే చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీపీ కొలను హన్మంత్ రెడ్డి కూడా హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారని తెలుస్తోంది. ఇక టీడీపీ విషయానికొస్తే టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.. టీడీపీ – బీజేపీ లు పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళితే కుత్బుల్లాపూర్‌ సీటుపై కాసాని జ్ఞానేశ్వర్ గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ పట్టుకు బీజేపీ తొలొగ్గి చేతులెత్తేస్తే కూన ఎటువైపు చూస్తారనే చర్చ జోరందుకుంది.

కూకట్‌పల్లి లో హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో మాధవరం కృష్ణారావు :
మహాకూటమి కారణంగా చెల్లాచెదురు అయిన కాంగ్రెస్ నాయకులు :
కూకట్‌పల్లి నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించిన మాధవరం కృష్ణారావు.. హ్యాట్రిక్‌ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌లకే టికెట్ అన్న కేసీఆర్‌ హామీతో.. మాధవరం మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో టికెట్ ఫైట్‌లో పెద్దగా పోటీ లేకపోవడం మాధవరం కృష్ణారావు కు కలిసొచ్చే అంశం.. 2018లో మహాకూటమిలో భాగంగా కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్‌ క్యాడర్ ఇక్కడ కూడా పూర్తిగా చెల్లాచెదురయ్యింది. దీంతో పార్టీ శ్రేణులను గాడిలోకి తీసుకురావడం హస్తం పెద్దలకు తలకుమించిన భారంగా పరిణమించింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగల్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కూకట్‌పల్లి మీద పట్టు సాధించేందుకు కమలం పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన పన్నాల హరీష్ రెడ్డి.. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఎలాగైనా టికెట్ సాధించి.. విక్టరీ కొట్టాలని పన్నాల కసి మీద ఉన్నట్లు తెలుస్తోంది..

సాయన్న అకాలమరణంతో కంటోన్మెంట్ లో కొత్త వ్యక్తి బరిలోకి దిగే అవకాశం :
కంటోన్మెంట్‌ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం . ఇక్కడి నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా దివంగత నేత సాయన్న.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మొన్నటివరకు కొనసాగారు. ఆయన మరణం తరువాత ఇక్కడి రాజకీయం వేడెక్కింది. దివంగత నేత సాయన్న కుమార్తె టికెట్ కోరినప్పటికీ గులాబీ బాస్ ఆమెకు టికెట్ ఇచ్చే విషయంలో సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ తరఫున కొత్త వ్యక్తి బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌లు క్రిశాంక్‌, గజ్జెల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కంటోన్మెంట్‌ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎస్సీ సెల్‌ చైర్మన్‌ నాగరి ప్రీతమ్‌తో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కంటోన్మెంట్‌లో బలమైన అభ్యర్థి కోసం బీజేపీ సెర్చింగ్ మొదలుపెట్టింది. గతంలో కాంగ్రేస్ లో టికెట్ దక్కకపోవడంతో బీజేపీ గూటికి చేరి టికెట్ దక్కించుకుని పోటీ చేసి ఓడిన శ్రీ గణేష్ అనూహ్యంగా గులాబీ చెంతకు చేరిపోయారు. ఆయన ఆశలు పెట్టుకున్నా ఆయనను ఆదరించేవాళ్లు గులాబీ వనంలో కరువయ్యారు. ఇక టీడీపీ నుంచి ముప్పిడి గోపాల్ సిద్ధంగా ఉన్నప్పటికీ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు లేవు. ఆయన కాకుండా మరో వ్యక్తి కోసం టీడీపీ చూస్తోంది..

ఎల్బీనగర్‌ బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్న వర్గ విభేదాలు :
సుధీర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్ మధ్య వర్గపోరు….కాంగ్రెస్ నుంచి బరిలో రేవంత్‌ రెడ్డి..!
మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలో ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్.. ఎల్బీనగర్‌ ! సుధీర్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు . బీఆర్ఎస్‌ను వర్గ విభేదాలు వెంటాడుతున్నాయి . ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పార్టీ ఎల్బీనగర్ ఇంచార్జి రామ్మోహన్ గౌడ్‌ మధ్య వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే మళ్లీ అవకాశం దక్కుతుందని సుధీర్‌రెడ్డి అంటుంటే.. వరసుగా మూడుసార్లు ఓడిన రామ్మోహన్ గౌడ్ ఈ సారి ఎలాగైనా అధిష్టానాన్ని ఒప్పించి టికెట్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎల్బీనగర్‌ బీఆర్ఎస్‌లో టికెట్ ఫైట్‌ ఇంట్రస్టింగ్‌గా మారింది. గ్రేటర్‌ ఎన్నికలు ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఫుల్ జోష్ ఇచ్చాయి .

ఎల్.బీ. నగర్ 11 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. ఐతే కమలం పార్టీ కార్పొరేటర్లు వంగా మధుసూధన్‌ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమోషన్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి కూడా టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి బరిలో ఉంటారనే ప్రచారం జరురగుతోంది. రేవంత్‌ ఆలోచన మార్చుకుంటే.. జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్‌ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో పాటు.. సీనియర్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి టికెట్ రేసులో ఉంటారు.

మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో నాలుగు పార్టీలను బలహీనతలు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్‌ను వర్గవిభేదాలు వెంటాడుతుంటే.. బలమైన అభ్యర్థులు లేక బీజేపీ, కేడర్ ఛిన్నాభిన్నమై కాంగ్రెస్, అయోమయంలో టీడీపీ ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఎన్నికలకుసమయం దగ్గర పడుతుండటంతో బలమైన అభ్యర్థులను వెతకడంలో పాటు.. పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. దీంతో మల్కాజ్‌గిరి ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు