Sunday, May 19, 2024

నవ్విపోదురు గాక.. నాకేంటి..!

తప్పక చదవండి
  • పోరుగు జిల్లాలకు పాకిన నకిలీల వ్యవహారం..
  • చక్కదిద్దుకునే పనిలో అక్రమార్కులు..
  • జాతీయ కమిషన్‌ దృష్టికి వసతి గృహాల అక్రమాలు..
    ఖమ్మం : నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా మారింది షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాల దుస్థితి. ఎవరొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు.. మాకంటూ ఓ కోటరీ వున్నది.. మా ఉద్యోగాలు పదిలంగానే ఉంటాయి.. అనే ధీమాతో పసి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి కాలం గడుపుతున్నారు. ఆదుకునేందుకు అమాత్యులు ఉండగా.. కాపాడేందుకు ఉన్నతాధికారులు అండగా ఉన్నారనే నెపంతో కొందరు ఉద్యోగులు అక్రమాల పర్వాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాల్లో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అవినీతి, అక్రమాలు చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నా వీరు మాత్రం అవేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. తమ శాఖలో ఏమీ జరగలేదు.. అన్నీ సక్రమంగానే ఉన్నాయని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పైగా చేసిన అక్రమాలను సక్రమాలుగా మార్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలోనే బయటపడ్డ నకిలీల బండారం కాస్త, పొరుగు జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చుట్టుపక్కల జిల్లాలకు ఖమ్మం జిల్లానే కేంద్రంగా మార్చుకొని ఈ తంతు కొనసాగించారనే విషయం తెలుస్తోంది..

ఉన్నత విద్యార్హత లేకుండా కొలువుల్లో దూరి, ఆపై డిగ్రీ సర్టిఫికెట్లు చేతపట్టి, ప్రమోషన్‌ కొట్టిన ఉద్యోగులు ఖమ్మం జిల్లానే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలలో కూడా వీరి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలను సైతం పక్కన పెట్టి బీహార్‌, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలో సర్టిఫికెట్లు సంపాదించి, ప్రభుత్వానికి మస్కా కొట్టారు. నిన్నటి వరకు కేవలం ఒక్క ఖమ్మం జిల్లాకే పరిమితమైందని భావిస్తున్న తరుణంలో పొరుగు జిల్లాల్లో కూడా నకిలీల వ్యవహారం బయట పడుతోంది.. పొరుగు జిల్లాలో ఉన్న ఉద్యోగులకు సైతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉన్నత ఉద్యోగి ఈ తంతు గుట్టుచప్పుడుగా నడిపించారనే విషయం స్పష్టమైనది. ఖమ్మం జిల్లాలో అక్రమార్కుల వ్యవహారానికి కాస్త ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ దినపత్రిక బహిర్గతం చేయడంతో అక్రమాలను దిద్దుబాటు చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరిగిన అనేక అంశాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ విచారణ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇంటిలిజెన్సీ అధికారులు సైతం ఈ వ్యవహారంపై నివేదిక పూర్తిచేసే పనిలో ఉన్నారు. మరోవైపు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖలో జరుగుతున్న అక్రమాలపై నివేదిక తయారు చేసిన కొందరు వ్యక్తులు జాతీయ కమిషన్‌ కు ఈనెల 11వ తేదీన సమర్పించే పనిలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్తే రాజకీయ నాయకులతో వ్యవహారాన్ని చక్కదిద్ది ఎటువంటి చర్యలు లేకుండా చేస్తారని ఉద్దేశంతో ఈ వ్యవహారాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్తున్నారని స్పష్టమవుతుంది. జిల్లాలో ఎన్ని వసతి గృహాలు ఉన్నాయి? ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నా రు.?. ఏ ఏ వసతి గృహాల్లో పరిస్థితులు అద్వానంగా ఉన్నాయి.? ఎంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగులు విధులకు హాజరు ఉన్నారు.? ఏఏ వసతి గృహాల్లో ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు..? ఏఏ గ్యాస్‌ ఏజెన్సీ కంపెనీల నకిలీ బిల్లులు వినియోగించారు..? బంధుప్రీతి… వేధింపులు అనే అంశాలపై పూర్తి స్థాయిలో ఫోటో, వీడియో రూపంలో నివేదిక తయారు చేసుకొని జాతీయ కమిషన్‌ కు అందజేయనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు