Wednesday, February 28, 2024

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో జట్టు కట్టిన లెజెండ్స్ లీగ్ క్రికెట్

తప్పక చదవండి
  • భారత్‌లో క్రీడలను ప్రోత్సహించడానికి దేశ వ్యాప్త ప్రచారానికి శ్రీకారం
  • వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 17 రాష్ట్రాల్లో ప్రయాణించనున్న క్రికెట్, ఇతర క్రీడా దిగ్గజాలు
  • క్రీడా బృందానికి స్వాగతం పలకనున్న ఇండియన్‌ రైల్వేస్‌

న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడలను ప్రోత్సహించేందుకు లెజెండ్స్‌ లీగ్ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ), ఇండియన్‌ రైల్వేస్‌ తో జట్టు కట్టింది. లెజెండ్స్‌ లీగ్‌ జాతీయ ప్రచారంలో భాగంగా 2023 సీజన్‌ ట్రోఫీ నవంబర్ 8 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో దేశ వ్యాప్తంగా ప్రయాణిస్తుందని ఇండియన్ రైల్వేస్‌, లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రకటించాయి. ఈ ట్రోఫీ దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రయాణిస్తుంది. తొలిసారిగా నిర్వహిస్తున్న 15 రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమం దేశంలోని ప్రతి ప్రాంతంలో క్రికెట్ ప్రేమికులను ఆకర్షించనుంది. దేశంలోని అత్యంత వేగవంతమైన రైల్వే నెట్‌వర్క్ – వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో క్రీడా దిగ్గజాలతో పాటు క్రికెట్ ప్రేమికులు ఈ వినూత్న కార్యక్రమంలో భాగం అవనున్నారు. ఈ కార్యక్రమం గురంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్, దిగ్గజ ఆటగాళ్లను వందే భారత్‌లో స్వాగతిస్తున్నాము. దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించే ఈ అద్భుతమైన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమీషనర్ రవిశాస్త్రి మాట్లాడుతూ, ‘ఇండియన్‌ రైల్వేస్‌తో జట్టు కట్టడం, క్రీడలను ప్రోత్సహించడంలో మా వంతు సహకారం అందించడం మాకు గర్వకారణం. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌తో ఈ ఆట ప్రతి రోజూ మెరుగవుతోంది. ఎక్కువ మంది ఆటగాళ్ళు లీగ్ లో చేరడంతో మేము తప్పనిసరిగా దీనిపై ఆసక్తిని పెంచుతూనే ఉండాలి. అలాగే కొత్త వేదికల్లో అత్యుత్తమ క్రికెట్‌ను చూసే అవకాశాన్ని అభిమానులకు అందించాలి. ఈ సీజన్‌లో లెజెండ్స్ అదరగొట్టబోతున్నారని నేను నమ్మకంగా చెప్పగలను’ అని అన్నారు. నవంబర్ 8వ తేదీన న్యూఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రచారం 16 మార్గాల ప్రయాణంలో మొదటిది కానుంది. కాగా, ఇండియన్ రైల్వేస్‌ ఎల్లప్పుడూ క్రీడలను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రయాణాన్ని ప్రోత్సహించడంలో సహాయం చేస్తామని ఎల్‌ఎల్‌సీకి హామీ ఇచ్చింది. పలువురు కేంద్ర మంత్రులు, ఇండియన్‌ రైల్వేస్ బృందం, దేశ వ్యాప్తంగా పలువురు క్రీడా ప్రముఖులు ఈ ప్రయాణంలో భాగం కానున్నారు. క్రిస్‌ గేల్, శ్రీశాంత్, షేన్ వాట్సన్‌ వంటి క్రికెట్‌ స్టార్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ సీఈవో రమన్ రహేజా తెలిపారు.

‘ఇండియన్ రైల్వేస్‌తో కలిసి మేంఈ ప్రత్యేక ప్రచార సహకారానికి జెండా ఊపుతున్నప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్ అభిమానులకు సాధ్యమైనంత ఉత్తమ అనుభూతిని అందిస్తుందని హామీ ఇస్తున్నాం. దేశంలోని ప్రతి మూలకు క్రీడల సంస్కృతిని ప్రోత్సహించడానికి ఇది ఒక రకమైన చొరవ కానుంది. ఎల్‌ఎల్‌సీ ట్రోఫీతో పాటు గేల్, శ్రీశాంత్, వాట్సన్ వంటి దిగ్గజాలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో దేశవ్యాప్త పర్యటనలో పాల్గొంటారు’ అని రామన్ రహేజా అన్నారు. గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్, ఎస్. శ్రీశాంత్, పార్థివ్ పటేల్, షేన్ వాట్సన్, ప్రవీణ్ కుమార్, ఝులన్ గోస్వామి వంటి క్రికెట్ దిగ్గజాలు కూడా భాగస్వాములు కావడంతో ఈ ప్రత్యేకమైన ప్రచారానికి మరింత ఉత్సాహం తేనుంది. కొన్నితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన జాతీయ, అంతర్జాతీయ దిగ్గజాలు నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ అనే ఐదు రైల్వే జోన్‌లలో విస్తరించి ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచారంలో పాల్గొంటారు. ఈ ప్రయాణం గురించి మాట్లాడిన షేన్ వాట్సన్ ఇంత ప్రత్యేకమైన రీతిలో క్రీడల స్ఫూర్తిని ప్రోత్సహించాలనే ఆలోచన అద్భుతమైనదని కొనియాడారు. ‘ఇందులో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆటలో నా అనుభవాలను అభిమానులతో పంచుకోవడానికి వేచి ఉండలేను’ అని పేర్కొన్నారు. క్రిస్ గేల్ స్పందిస్తూ.. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగమైనందుకు వందే భారత్‌తో లీగ్ అద్భుతమైన సహకారాన్ని చూడటం తనకు చాలా ఉత్సాహంగా ఉందన్నారు. రాబోయే సీజన్‌లో ఉత్సాహాన్ని పెంచే ఈ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. శ్రీశాంత్‌ మాట్లాడుతూ ‘వందే భారత్‌తో లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ జట్టు కట్టడం గొప్ప విషయం. భారత్‌లో క్రీడలను ప్రోత్సహించే ఇలాంటి చొరవలో భాగం అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సీజన్‌లో లీగ్‌ను మరింత మెరుగ్గా, ఆసక్తిగా మార్చే ఇలాంటి ఆలోచనలతో నేను ఆశ్చర్యపోయాను’ అని శ్రీశాంత్ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

కాగా, లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండవ ఎడిషన్ నవంబర్ 18 నుంచి డిసెంబర్ 9 వరకు జరుగుతుంది. ఈసారి రాంచీ, డెహ్రాడూన్, జమ్ము, వైజాగ్, సూరత్ ఐదు నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు. తొలి మ్యాచ్ ఇర్ఫాన్ పఠాన్ నేతృత్వంలోని భిల్వారా కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఎల్‌ఎల్‌సీలోని ఆరు జట్లు ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్, అర్బన్‌ రైజర్స్ హైదరాబాద్, సదరన్ సూపర్ స్టార్స్, భిల్వారా కింగ్స్ ఈ ప్రయాణం ద్వారా ఆవిష్కరించే ట్రోఫీ కోసం పోరాడుతున్నాయి. లెజెండ్స్ లీగ్ క్రికెట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, ఫ్యాన్‌కోడ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు