Sunday, May 5, 2024

బీజేపీ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ..

తప్పక చదవండి
  • సొమ్మసిల్లి పడిపోయిన కిషన్ రెడ్డి..
  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్
  • ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరుద్యోగ దీక్ష

కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన ’24 గంటల నిరాహార దీక్ష’ను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను బలవంతంగా నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కిషన్ రెడ్డి చేతికి, ఛాతికి గాయాలయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపట్టగా.. దీక్ష భగ్నంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులు కిషన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.
బుధవారం సాయంత్రం 6 గంటల వరకే దీక్షకు అనుమతి ఉందని, వెంటనే దీక్షా శిబిరం ఖాళీ చేయాలని 6.30 గంటల సమయంలో పోలీసులు కిషన్‌డ్డికి సూచించారు. గురువారం ఉదయం 6 గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులను హెచ్చరించారు. వెనక్కి తగ్గిన పోలీసులు.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో మరోసారి ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కిషన్‌రెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు. ధర్నాచౌక్‌ వద్ద జరిగిన తోపులాటలో కిషన్‌రెడ్డి చేతికి, ఛాతికి గాయాలు కావడంతో డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోమంత్రి అమిత్‌షా.. కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంటే.. సీఎం కేసీఆర్‌ కుటుంబానికే అవన్నీ దక్కాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ ప్రకటనలు వేయడానికి తొమ్మిదేళ్లు పట్టిందని ఆక్షేపించారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్‌ మాటతప్పారన్నారు. తల్లిదండ్రుల వద్ద ఉన్న బంగారం అమ్మి, అప్పులు చేసి శిక్షణ పొంది పరీక్షలు రాస్తే.. ప్రశ్నపత్రాల లీకేజీతో 35 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయన్నారు. వారి గురించి పోరాటం చేసిన బండి సంజయ్‌పై కేసులు పెట్టారన్నారు. వరంగల్‌లో నిరుద్యోగులపై లాఠీఛార్జి చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో మాదిరే ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు