Sunday, July 21, 2024

కేసీఆర్ ను పూనిన ఎన్నికల దేవత..

తప్పక చదవండి
  • కోరిన కోరికలు ఏవైనా తీర్చడానికి సిద్ధం..
  • గతంలో ఆర్టీసీ కార్మికుల కోరిక ఇప్పుడు తీర్చేశారు..
  • రైతులకు 19 వేల కోట్ల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్..
  • వరాల జల్లు కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు..
  • పొలిటికల్ హీట్ తో ప్రతిపక్షాలకు ఊపిరి ఆడనివ్వట్లేదు..
  • మళ్లోసారి సీఎం పీఠంపై కన్నేసిన పెద్ద దొర..
  • తాయిలాల తాంబూలాలతో ఎన్నికల సారె తీసుకొస్తున్న కేసీఆర్..
  • త్వరపడండి మంచి తరుణం మించిన దొరకదు..

ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న హామీలకు రెక్కలొచ్చాయి.. అడగకుండానే అన్నీ ఇచ్చే పనిలో పడ్డారు దొరవారు.. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆగమేఘాల మీద అందరి కోరికలు తీర్చేస్తున్నారు.. సాధ్యం కాదని గతంలో చెప్పినవి కూడా సుసాధ్యం చేసేస్తూ దూసుకుపోతున్నారు.. కేసీఆర్ స్పీడ్ చూస్తుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. ఎన్నికల కోడ్ రాకముందే అన్ని పనులూ పూర్తి చేయాలని ఆదేశాలు సైతం జారీ చేసినట్లు తెలుస్తోంది..

అయితే లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్లు ఉన్నట్టుండి కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రజలమీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది..? అంటే ఈజీగా సమాధానం చెప్పేయొచ్చు.. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎలాగైనా గెలిచి, మూడవ సారి ముచ్చటగా సీఎం పీఠాన్ని అధిరోహించాలన్నదే కేసీఆర్ యోచన అన్నది స్పష్టం అవుతుంది.. ఏదైనా తాజాగా జరిగినప్పుడే అందరికీ గుర్తుంటుంది.. ఎప్పుడో జరిగిన అభివృద్ధిని గుర్తుంచుకోవడం ప్రజలు ఎప్పుడో వదిలేశారు.. అందుకే కేసీఆర్ తాను ప్రామిస్ చేసిన పధకాలను ఎలక్షన్స్ వచ్చేవరకూ దాచివుంచారన్నది అక్షరసత్యం.. ఒక్కో పథకాన్ని బయటకు తీస్తూ.. ఒక్కో అస్త్రంలా వాడుకుంటూ ఎన్నికల యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకున్నారు.. ఏదేమైనా ఆయనకు సీఎం పీఠం ముఖ్యం.. ఇది వాస్తవం.. సో రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులు, రైతన్నలు, మహిళలు ఒక్కరేమిటి అన్నివర్గాల వారు ఇప్పుడే తొందరపడాలి.. పెండింగ్ లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళండి.. క్షణాల్లో మీ కోరికలు తీరిపోతాయి.. మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.. మంచి తరుణం మించిన దొరకదు.. కాదు కూడదని మౌనంగా ఉండిపోయారో.. ఇక మీ ఖర్మ.. ఈసారి దొరవారు అధికారంలోకి వస్తే వచ్చే ఐదేండ్లు మీకు తిప్పలే.. మీ సమస్యలు అటకెక్కి పోతాయి.. పైగా కొత్త కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.. ఇక ఆలోచించడం మానండి.. మీ సమస్యల చిట్టాలను సిద్ధం చేసుకోండి.. ముఖ్యమంత్రికి నివేదించేలా ముందడుగు వెయ్యండి.. తరువాత సంగతి తరువాత.. ఇప్పుడైతే కదలండి.. కేసీఆర్ ని ఎన్నికల దేవత వదిలిపెట్టకముంధే మేలుకోండి.. మీరనుకున్నవి సాధించుకోండి.. పారా హుషార్..

- Advertisement -

ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎన్నికల దేవత ఆవహించి ఉంటుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకే ఆయన అడిగినవి.. అడగనివి.. గతంలో ఇవ్వనని తెగేసి చెప్పినవి, కోరినవి.. కోరనివి.. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా.. వారి వారి కోర్కెలను నెరవేర్చడానికి తెగ ఉబలాట పడుతున్నారట.. గతంలో వద్దు.. చేయలేము అని ఖరాకండిగా చెప్పి పక్కన పెట్టిన పనులన్నిటినీ ఒక్కొక్కొటిగా పోగేసి, అమలు చేసేస్తూ.. ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కేసీఆర్ లో వచ్చిన ఈ అద్భుత మార్పు చూసి తెలంగాణ ప్రజలే కాదు, బీ.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు కూడా ఖంగు తింటున్నారట.. అసలు కేసీఆర్ కు ఏమయ్యింది..? 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమయంలో కేసీఆర్ చెప్పిన మాటను ఒక్కసారి మనం మననం చేసుకుంటే ఉన్న పథకాలను కొనసాగిస్తాం… అంతకు మించిన పెద్ద మేనిఫెస్టో ఏమీ ఉండదని చెప్పేశారు. కానీ అప్పటికే రైతు బంధు కేసీఆర్ ప్రారంభించేశారు. అంతటితో తెలంగాణ వ్యాప్తంగా తెరాసకు పూర్తిగా పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత రుణమాపీ, నిరుద్యోగ భృతి వంటి హామీలు గుప్పించి ఎన్నికల్లో విజయడంకా మోగించేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు కేసీఆర్ ఏమి చేస్తున్నారు..? ఏమి చేయబోతున్నారు.. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొబోతున్నారు..? అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.. 2023 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయనడంలో ఆశ్చర్యం లేదు. అయితే వీటివెనుక అధికార దాహమనే సీక్రెట్ దాగివున్నట్లు తెలుస్తూనే ఉంది..

హఠాత్తుగా ప్రాణంపోసుకున్న ఆర్టీసీ విలీనం :
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో కేసీఆర్ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ డిమాండ్ తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ పూర్తిగా అటకెక్కించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ఉండబట్టలేక చూసీ చూసీ కేసీఆర్ రెండో సారి గెలిచిన తర్వాత 2019 అక్టోబర్‌ మాసంలో నోరు తెరిచి అడిగేశారు. సీఎం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ కు నో చెప్పేయడంతో వారు సమ్మెకు దిగారు. కేసీఆర్ అప్పుడు ఎంత కఠినంగా వ్యవహరించారంటే ఆర్టీసీ కార్మికులకు వారి యూనియన్ నాయకులకు చెమటలు పట్టాయి. కేసీఆర్ కోపాన్ని తట్టుకోలేని ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసేసుకున్నామని ప్రకటించేశారు. చివరికి కేసీఆర్ తన ఫంథాతో వాళ్ళని కనికరించారు.. దీంతో తమ ఉద్యోగాలు కనీసం తమకి మిగిలాయని సర్దిచెప్పుకుని సీఎం ఫోటోలకు పాలాభిషేకాలు చేసి.. డ్యూటీ చేసుకుంటూ పోతున్న ఆర్టీసీ కార్మికులు మరో సారి సమ్మె ఆలోచన చేయలేదు. విలీనం గురించి ఏనాడూ మాట్లాడలేదు.. కాగా ఎన్నికలకు ముందు హఠాత్తుగా సీఎం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఎవరూ ఊహించని నిర్ణయంతో షాక్ ఇచ్చారు.. దీంతో ఆర్టీసీ కార్మికలకు ఏమి చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. గతంలో విలీనం అని రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు విలీనంఫై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.. అదనపు పని భారం, ఇంక్రిమెంట్లలో కోతలు, జీతాల్లో పెరుగుదల లేకపోవడం, ఆర్టీసీ యాజమాన్యం నియంతృత్వ పోకడలు ఆర్టీసీ కార్మికులను ఇబ్బందిపెట్టే అంశాలుగా ఉన్నాయి. గతంలో యూనియన్లు వద్దు నేనున్నాను మనం కలిసి సమస్యలు పరిష్కరించుకుందామన్న సీఎం ఒక్క సారి కూడా సమస్యలపై దృష్టి సారించలేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇపుడు ప్రభుత్వం విలీనం అని చెప్పినంత మాత్రాన తమ రాతలు ఏమీ మారవని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.

ఇక రూ. 19 వేల కోట్ల రుణమాఫీ అంశం :
రైతులకిచ్చిన రుణమాపీ హామీ అంశాన్ని నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం పెండింగ్‌లో పెటింది. ఎన్నికల ఏడాదిలో పూర్తి చేయాడనికి బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కూడా కేటాయించింది. 2018 ఎన్నికల్లో పంట రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ రూ.37 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు. మొత్తం 5.42 లక్షల మందికి చెందిన రూ.1,207 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. మిగిలిన 37 వేల నుంచి 90 వేల లోపు గల రుణాలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాఫీ చేయాల్సిఉండగా.. ఇందు కోసం 19 వేల కోట్లు అవసరం ఏర్పడింది. కానీ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది కేవలం ఆరువేల కోట్లు మాత్రమే.
రైతుల రుణ మాఫీకి అవసరమైన నిధులు కేటాయించకుండా.. సగానికి సగం కోత విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పథకాల అమలుతో.. వరాల జల్లులతో :
తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజులుగా ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. తన పార్టీకి ఎక్కడెక్కడ మైనస్ ఉందో సర్వేల మీద సర్వేలు చేయించుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు.. ఆర్టీసీ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని తేలిన తర్వాత.. విలీనం నిర్ణయంతో సరి పెట్టారు. అనూహ్యంగా గ్రేటర్ హైదరాబాద్… ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలు వచ్చిన తర్వాత కేసీఆర్ అందుకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విశ్లేషణ జరిపి అందర్నీ కూల్ చేయడానికి మెట్రో ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆవిధంగా దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు వంటి పథకాలను ప్రారంభించారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు సరేసరి..

పథకాలు ఒకే నిధులెక్కడనుంచి తెస్తారు..?
ఇంత కాలం రుణమాఫీ చేయకపోవడానికి కేంద్రం కారణం అని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రుణమాఫీ చేయడానికి గల కారణం చెప్పలేకపోయారు. ఇప్పుడు రుణ మాఫీ ఎలా చేయగలుగుతున్నారు. ఒకవేళ కేంద్రం అనుమతించిందా..? అన్నప్రశ్నకు సీఎం జవాబు చెప్పాలి.. పథకాల అమలుకు, పలు ప్రభుత్వ రాయితీలకు నిధుల సమీకరణ ఎలా అన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఇప్పటికే పెద్ద ఎత్తున పథకాలకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మినహా జిల్లాల్లో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. మరి వేల కోట్లు ఎలా సమీకరిస్తారన్నది కీలకంగా మారింది. ఎన్నికల్లో ఓటింగ్ జరిగే నాటికి హామీలన్నీ పూర్తి కాకపోతే.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశంఉందని సీఎం ఎందుకు గ్రహించలేకపోయారని
పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా కేవలం గెలుపే లక్ష్యంగా.. సీఎం పదవే పరమావధిగా.. అమలుకు వీలు కాకున్నా.. వరాలు మాత్రం కురిపిస్తున్నారు కేసీఆర్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి.. రాత్రుళ్ళు నిద్రలేకుండా చేస్తోంది.. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలో బీజేపీతో లోపాయికారి ఒప్పొందం కుర్దూర్చుకున్నారన్నది జగమెరిగిన సత్యమే.. దానికి తగ్గట్టుగానే బీజేపీ అధిష్టానం కూడా కేసీఆర్ ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ పెద్దగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టుగానే తెలుస్తోంది.. ఒక జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేయాలనే పావులు కదుపుతోంది.. బీజేపీకి ధీటుగానే కాంగ్రెస్ కూడా కదనరంగంలో దూసుకుపోతోంది.. ఈ పరిస్థితుల్లో బీజేపీతో ఎలాంటి సమస్య లేకపోయినా కాంగ్రెస్ ను కట్టడి చేయాలంటే.. తెలంగాణ ప్రజలను తమవైపుకు తిప్పుకోక తప్పదనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది.. అందులో భాగంగానే హామీల అమలుకు ఆగ మేఘాల మీద దూసుకుపోతున్నారు కేసీఆర్.. మరి చూడాలి కేసీఆర్ ఎత్తులు, జిత్తులు తెలంగాణాలో పనిచేస్తాయా..? లేదా..? అన్నది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు