Monday, October 14, 2024
spot_img

మీ ఋణం తీర్చుకుంటా..( మీ అభిమానానికి ఆనంద భాష్పాలొస్తున్నయ్ : బండి సంజయ్)

తప్పక చదవండి
  • నాతో కలిసి వందల కిలోమీటర్లు నడిచిన సంగ్రామ సేనకు రుణపడి ఉంటా
  • అవకాశమిచ్చిన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు
  • ఎన్నికల యుద్ద రంగంలో ఉన్నాం…
  • కార్యకర్తల త్యాగాలను వ్రుధా పోనివ్వను. గొల్లకొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం…
  • బీజేపీలో గ్రూపులున్నాయని, పార్టీ గ్రాఫ్ తగ్గిందనేది దుష్ప్రచారమే…
  • ప్రజల మనసుల్లో బీజేపీ పదిలంగా ఉంది…
  • పేదల పక్షాన మేం చేసిన పోరాటాలు జనం మదిలో నిలిచిపోయాయ
  • కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం…

( కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పచ్చని పాములా ఒక కుటుంబం దూరి లూటీ చేస్తోంది… ప్రజలను కాటేస్తోంది.. వర్షాలతో జనం విలవిల్లాడితే పరామర్శించని కేసీఆర్ మహారాష్ట్రపోయి రాజకీయాలు చేస్తున్నడు.. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసే మళ్లీ హామీల అమలు పేరుతో ఎన్నికల స్టంట్ చేస్తున్నడు.. రుణమాఫీ, వీఆర్ఏ, జేపీసీల క్రమబద్దీకరణ వంటి హామీలు ఎన్నికల డ్రామాలే.. సర్కార్ దగ్గర పైసల్లేక ఎన్నికల తాయిలాల కోసం భూములను అమ్ముకునే దుస్థితి కేసీఆర్ ది.. గడువు ముగియకముందే మద్యం టెండర్ల ద్వారా వేల కోట్లు సంపాదించుకోవడం ఎన్నికల స్టంట్ కోసమే…కేసీఆర్ మోసాలను, ద్రోహాన్ని ప్రజల్లో ఎండగడతాం…మోదీ ప్రభుత్వంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ సాక్షిగా ఎండగడతా -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ )

గత 9 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏనాడూ పట్టించుకోని సీఎం కేసీఆర్ ఎన్నికలు దగ్గరకొస్తుండంతో వాటిని నెరవేరుస్తానంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, రుణమాఫీ, పీఆర్సీ అమలు, వీఆర్ఏ, జేపీసీల రెగ్యులరైజేషన్ వంటి హామీలన్నీ కేసీఆర్ ఎన్నికల స్టంట్ లో భాగమేనన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తేలడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ డ్రామాలకు తెరదీశాడని దుయ్యబట్టారు. సర్కార్ దగ్గర నయాపైసా లేదని, జీతాలు కూడా సరిగా ఇవ్వలేని కేసీఆర్ ఎన్నికల తాయిలాల కోసం విలువైన ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్నారని మండిపడ్డారు. గడువు ముగియకముందే మద్యం టెండర్లను పిలిచి వేల కోట్లు పోగేసుకునే పనిలో పడ్డారని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పచ్చని పాములా కేసీఆర్ కుటుంబం దూరి ప్రజలను కాటేస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా కార్యకర్తలు చూపుతున్న అభిమానాన్ని చూస్తుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాఫ్ తగ్గిందని, పార్టీలో గ్రూపు తగాదాలున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారమేనన్నారు. పార్టీ గ్రాఫ్ తగ్గించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ప్రచారం విజయవంతం కావొచ్చేమో తప్ప ప్రజలు మాత్రం బీజేపీ పక్షానే ఉన్నారని చెప్పారు. కార్యకర్తలతోపాటు ప్రజా సంగ్రామ సేనతో కలిసి బీజేపీ చేసిన పోరాటాలు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాయన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు వేలాదిగా హాజరై శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ కు వేములావాడ పూజారుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీలు చాడ సురేష్ రెడ్డి రవీంద్ర నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమాదేవి, జె.సంగప్పతోపాటు వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, ఐటీసెల్ కన్వీనర్ తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

- Advertisement -

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించాక తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుండి ఇక్కడి వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చి స్వాగతం తెలిపినందుకు క్రుతజ్ఝతలు తెలియజేస్తున్నా. దారి పొడవునా ట్రాఫిక్ ఏర్పడి ప్రజలకు కొంత ఇబ్బందికి గురయ్యారు. క్షమించాల్సిన వారిని కోరుతున్నా. సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశమిచ్చారు. నాపై విశ్వాసముంచి ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పెద్ద బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి హ్రుదయ పూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా, సైనికుడిలా పార్టీ కోసం పనిచేస్తా. పదవులతో, అధికారంతో సంబంధం లేకుండా బీజేపీపై, మోదీపై విశ్వాసం, నాపై చూపుతున్న అభిమానానికి శిరస్సు వంచి వినమ్ర పూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్న. ఈ అభిమానం చూస్తుంటే కళ్లవెంట ఆనందబాష్పాలు వస్తున్నయ్. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతటి ప్రేమను చూపారే… ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపడం నా అదృష్టం. ఈ అదృష్టాన్ని కల్పించిన మోదీకి, అమిత్ షా, నడ్డాలకు కృతజ్ఝతలు. గత మూడేళ్లుగా కార్యకర్తలు చేసిన పోరాటాలు, వాళ్లు పడ్డ శ్రమ ఎన్నటికీ మర్చిపోను. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా సంగ్రామ సేన కార్యకర్తలు వయసుతో సంబంధం లేకుండా నాతోపాటు వందల కిలోమీటర్లు నడిచారు. స్వార్ధం లేకుండా ఏమీ ఆశించకుండా బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా, మోదీ అందిస్తున్న సంక్షేమ ఫలాలు పేదలకు అందించాలనే ధ్యేయంతో నాతోపాటు వేలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది ప్రజలు పాదయాత్ర చేశారు.

ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజాసంగ్రామ యాత్రపై చర్చ జరుగుతోందంటే ఆ అవకాశం మోదీ కల్పించడం, కార్యకర్తలు నాతో అడుగులో అడుగు వేయడమే కారణం. అనేక చోట్ల అడ్డుకునే కుట్రలు, అరెస్టులు, లాఠీ ఛార్జీలు చేసినా, కార్యకర్తల తలలు పగిలినా వెనకడుగు వేయకుండా 5 విడతల పాదయాత్రలను పూర్తి చేసిన ఘనత సంగ్రామ సేన కార్యకర్తలదే.. కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను వృధా చేయబోం. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. ఎన్నికల యుద్దంలో ఉన్నాం. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయమిది. చాలా మంది బీజేపీలో గ్రూపులున్నాయని, తగాదాలున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, కొన్ని పార్టీలు కలిసి బీజేపీపై తప్పుడు చేయడంలో సక్సెస్ అయ్యి ఉండొచ్చు. కానీ ప్రజల మనస్సులో బీజేపీ ఉంది. సర్వేలు అదే చెబుతున్నాయి. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం… చిన్న చిన్న అభిప్రాయ బేధాలుంటే దానిని భూతద్దంలో చూపడం మూర్ఖత్వమే. ప్రజా సమస్యలపై అనేకసార్లు కొట్లాడినం. జైలుకు పోయినం. లాఠీదెబ్బలు తిన్నం. ఈ విషయాలన్నీ ప్రజలు మర్చిపోరు. పేదల రాజ్యం కోసం, డబుల్ ఇంజిన్ సర్కార్ కోసమే పనిచేస్తున్నాం. నమ్మిన సిద్దాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నమే తప్ప వ్యక్తిగత ఇమేజ్ కోసం, పవర్ కోసం పనిచేసే వాళ్లం కాదు…. ఒకరుంటేనే పార్టీ నడుస్తుందని భావించడం పొరపాటు. 317 జీవోను సవరించాలని కొట్లాడి జైలుకుపోయినం. టీఎస్పీఎస్సీ లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తుంటే నిరుద్యోగ మార్చ్ చేస్తుంటే భరించలేక సహించలేక పేపర్ లీకేజీ పేరుతో తప్పుడు కేసులు బనాయించి నాతోపాటు అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన విషయాన్ని ప్రజలు మర్చిపోరు.

వడ్లు కొనుగోలు చేయాలంటూ నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తే… బీఆర్ఎస్ గూండాలు అడ్డుకుని రాళ్ల దాడి చేసి తలలు పగలకొట్టినా భరిస్తూ రైతుల పక్షాన ఉద్యమాలు నిర్వహించిన పార్టీ బీజేపీ.. గుర్రంపోడులో పోడు భూములపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించి 40 మంది కార్యకర్తలను నెల రోజులపాటు జైలుకు పంపిన తీరును ప్రజలు మర్చిపోరు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు కోసం, విద్యార్థుల పక్షాన పోరాటం చేసిన చరిత్ర బీజేపీదే.
వీటన్నింటిపై మేం పోరాడుతుంటే… పచ్చని ఇంట్లో పాము దూరి కాటేసినట్లుగా.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక కుటుంబం ఏ విధంగా దోపిడీ చేస్తుందో.. ప్రజల జీవితాలను ఏ విధంగా ఛిద్రం చేస్తుంటే అందరికీ తెలుసు. వర్షాలతో పంట నష్టపోయి, గూడు కోల్పోయి ప్రజలు, రైతులు విలవిల్లాడుతుంటే కనీసం పరామర్శించని కేసీఆర్.. ప్రత్యేక విమానంలో మహారాష్ట్రకు పోయి ఎట్లా రాజకీయాలు చేస్తున్నరో అందరూ గమనిస్తున్నరు. ప్రజల్లోకి వెళ్లి పర్యటిస్తే సీఎంను గల్లా పట్టి నిలదీస్తారని, వరద సాయం ఏమైందని తిడతారనే భయంతోనే కేసీఆర్ పరామర్శకు వెళ్లడం లేదు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కేసీఆర్.. ఎన్నికలొచ్చే సరికి మళ్లీ మోసం చేసేందుకు ఎన్నికల స్టంట్ చేస్తున్నడు. ఎన్నికలొస్తేనే హామీలిస్తడు.. ఎన్నికలయ్యాక లా పత్తా ఉండరు.. దయచేసి ప్రజలు కేసీఆర్ మోసాలను గమనించండి. గతంలో రైతులకు ఫ్రీ యూరియా ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సాధ్యం కాదని గతంలో తేల్చి చెప్పిన కేసీఆర్ ఎన్నికలొస్తున్నాయని మళ్లీ విలీనం జపం చేస్తూ ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తున్నడు. వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కేసీఆర్ విలీనం డ్రామా ఆడుతున్నడు. రేపో జీవో తెచ్చి డ్రామాలాడి ఓట్లేయించుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మూర్ఖత్వంవల్ల ఎంతోమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.. నేను ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ కార్మికులు నన్ను కలిసి సెల్పీలు దిగుతున్నరు. సన్మానం చేస్తున్నరు. మా సమస్యలపై స్పందించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెబుతుంటే… జీర్ణించుకోలేని కేసీఆర్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం పేరుతో కొత్త డ్రామాలాడుతున్నరు. గతంలో తమను రెగ్యులరైజ్ చేయాలని వీఆర్ఏలు ఏడాదిపాటు, జేపీసీలు నెలల తరబడి సమ్మె చేస్తే వాళ్లను కేసీఆర్ పట్టించుకోలేదు. జీతాలు ఇవ్వడానికే పైసల్లేవు. పీఆర్సీ ఇవ్వాలని చెప్పినా పట్టించుకోని కేసీఆర్ వాళ్లను రెగ్యులరైజ్ చేస్తానని, పీఆర్సీ ఇస్తానని మరోసారి మోసం చేస్తున్నడు. ప్రభుత్వం దగ్గర పైసలే లేవు. ఎక్కడి నుండి హామీలను నెరవేస్తాడు. డబ్బుల్లేక ఎన్నికల తాయిలాల కోసం గడువు ముగియకముందే మద్యం టెండర్లు పిలిచి వేల కోట్లు దోచుకోవాలనుకుంటున్నడు. దరఖాస్తు ల పేరుతోనే రూ.2 వేల కోట్లు వసూలు చేయబోతున్నడు. మద్యం ద్వారా ఈసారి 50 నుండి 75 వేల కోట్లు ఆదాయం పొందాలనుకుంటున్నడు. గడువు ముగియక ముందే టెండర్లు నిర్వహించే అధికారమెక్కడిది? డబ్బుల్లేక హైదరాబాద్ చుట్టపక్కల నున్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ భావితరాలను మోసం చేస్తున్నడు. ఈ తరుణంలో కేసీఆర్ మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం నాకొచ్చింది. పార్లమెంట్ ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలను ఎండగడతా అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు